under ground water
-
పొంగిపొర్లుతున్న భూగర్భ జలాలు
పాతాళగంగ పొంగిపొర్లుతోంది. నేలబావుల నుంచి బోరు బావుల వరకూ దేన్ని పరిశీలించిన నీరు ఉబికివస్తోంది. గతంలో కంటే భూజగర్భ జలాలు బాగా పెరిగాయి. మండువేసవిలో కూడా సాధారణ పరిస్థితి ఉండడం విశేషం. రాజాం నియోజకవర్గం వ్యాప్తంగా పరిస్థితి మరీ అనుకూలంగా ఉంది. మడ్డువలస జలాశయం ఉన్నందున ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు బాగా పెరిగాయని సంబంధిత అధికారులు అంచనా వేశారు. రాజాం: జిల్లాలో కొన్ని మండలాలు మినహా మిగిలిన చోట్ల భూగర్భ జలాలు బాగున్నాయి. రాజాం నియోజకవర్గం పరిధి సంతకవిటి మండలంలో 1.52 మీటర్ల లోతులోనే లభ్యమవుతున్నాయి. మండువేసవిలోనే ఇలా ఉండగా. వర్షాకాలంలో మరింత మీదకు వచ్చే అవకాశం ఉంది. రాజాంలో 1.72 మీటర్లలో, రేగిడిలో 2.31, వంగరలో రెండు, ఎల్‌ఎన్‌పేట మండలంలో 1.89, సరుబుజ్జిలిలో 1.84, జలుమూరులో 2.82, హిరమండలంలో 2.34, గార మండలంలో 2.34 మీటర్ల లోతులోనే భూ గర్భజలాలు తొణికిసలాడుతున్నాయి. ఈప్రాంతాల్లో బోర్లు తక్కువలోతులో వేస్తున్నా నీరుపడుతోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో సాగునీటి కోసం తక్కువ ఖర్చుతోనే వ్యవసాయ బోర్లు, బావులు, ఇంటి అవసరాలకు బోరింగులను వేయించుకుంటున్నారు. 20 నుంచి 30 మీటర్ల లోతుకు వెళ్లగానే కావాల్సినంత నీరు పడుతోంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో వేసవిలో కూడా సాగునీటి చెరువులు, బావులు జలకళను సంతరించుకున్నాయి. రణస్థలం మండలంలోని పైడిభీమవరం వద్ద అత్యంత ప్రమాదకరంగా 13.91 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, ఎచ్చెర్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అలాగే పలాస, కంచిలి, సోంపేటలో కూడా భూగర్భ జలాలు కొంతవరకూ అడుగంటాయి. జిల్లా వ్యాప్తంగా లెక్కిస్తే సరాసరిన 7.88 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభ్యమవుతూ సేఫ్ జోన్లో ప్రస్తుతం కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది సుమారు ఎనిమిది మీటర్లగా ఉండేది. సాగునీటి కాలువలు ఉన్న ప్రాంతాల్లో.. సాగునీటి కాలువలు, నదులు ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు అనుకూలంగా ఉండగా.. పరిశ్రమలు, బీడు భూములు ఉన్న ప్రాంతాల్లో నీటి వనరులు తగ్గుముఖం పడుతున్నాయి. వీటికి తోడు అనుమతులు లేకుండా ప్రైవేట్ నేలబావులు తవ్వకాలతో కొన్నిచోట్ల నీటి లభ్యత అనుకూలంగా లేదని నేషనల్ గ్రీన్‌కోర్ ఉపాధ్యాయుడు పూజారి హరిప్రసన్న తెలిపారు. -
ముమ్మరంగా నీటి నిల్వ గుంతలు
సాక్షి,మల్దకల్: రోజు రోజుకు ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటిపోతున్న తరుణంలో ప్రభుత్వం నీటి నిల్వ గుంతలకు ఆర్థిక సాయం అందించడంతో రైతులు తమ వ్యవసాయ పొలాల్లో నీటి నిల్వ గుంతల తవ్వకాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వ్యవసాయ పొలాల్లో నీటినిల్వ గుంతలను తవ్వుకోవడం ద్వారా భూగర్భజలాలు పెరగడంతో పాటు బోరుబావుల్లో నీటి లభ్యత ఉంటుంది. వీటి నిర్మాణాలపై ఉపాధి హామీ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించడంతో పాటు గ్రామసభలు నిర్వహించి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా ఉపాధి హామీ పథకం ద్వారా నీటి నిల్వ గుంతలను నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించడంతో రైతులు తమ వ్యవసాయ పొలాల్లో వాటి నిర్మాణాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో ప్రభుత్వం నీటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించడంతో రైతులు తమ పొలాల్లో వాటిని తవ్వుకునేందుకు ముందుకు వస్తున్నారు. కూలీలకు ఉపాధి పనులు దొరకడంతో పాటు రైతులకు నీటి నిల్వ గుంతలను ఏర్పాటు చేయడంతో రెండు విధాలా లబ్ధిపొందుతున్నారని ఉపాధి హామీ సిబ్బంది తెలియజేశారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి.. ముఖ్యంగా వీటి నిర్మాణాల కోసం అధికారులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రైతులకు వాటి నిర్మాణాలతో కలిగే ఉపయోగాలను వివరిస్తున్నారు. దీంతో రైతులు సైతం ముందుకు వచ్చి తమ పొలాల్లో నీటి నిల్వ గుంతలను తవ్వుకుని భూగర్భ జలాల పెంపునకు తమవంతు కృషి చేస్తున్నారు. మల్దకల్ మండలానికి మొత్తం ప్రభుత్వం 821 నీటి నిల్వ గుంతలు మంజూరు కాగా.. వాటిలో 30కు పైగా నిర్మాణ పనులు పూర్తి కాగా.. మరో 50 నీటి నిల్వ గుంతల పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. నీటి నిల్వ గుంతల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.60 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు వాటి కొలతలను బట్టి ఆర్థిక సాయం అందించడంతో వాటి నిర్మాణాలను రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే వ్యవసాయ పొలాల్లో పొలం చదునుచేసేందుకు, పొలం గెట్లపై ముళ్లచెట్ల తొలగింపు వంటి పనులను ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో చేపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు నీటి నిల్వ గుంతలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడంతో వీటి నిర్మాణ పనులపై స్థానిక ఉపాధి హామీ సిబ్బంది సైతం వేగవంతం చేస్తున్నారు. మండలంలో నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి నీటి నిల్వ గుంతలను వందశాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఉపాధి ఏపీఓ శరత్‌బాబు తెలియజేశారు. -
విస్తరిస్తున్న విషం..!
దేశంలో సగానికన్నా ఎక్కువ భూభాగంలో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి. దేశంలోని మొత్తం 676 జిల్లాల్లో 21 రాష్ట్రాల పరిధిలోని 387 జిల్లాల్లో భూగర్భ జలాల కలుషితం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర 15 రాష్ట్రాల్లోని 113 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో మోతాదుకు మించి భారలోహాలు, సీసం, కాడ్మియం, క్రోమియం, ఫ్లోరైడ్, నైట్రేట్ ఉన్నాయి.. గత ఏడాది కేంద్ర భూగర్భ జలాల బోర్డు(సీజీడబ్ల్యూ) నివేదిక సారాంశమిదీ. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలపై రాష్ట్ర భూగర్భ జలాల విభాగం జరిపిన పరిశీలనలోనూ దాదాపు సీజీడబ్ల్యూబీ నివేదికను బలపరిచే విషయాలే వెల్లడయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మనకు తెలిసిన నల్లగొండ జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లోనూ ఫ్లోరైడ్ భూతం వేగంగా విస్తరిస్తున్నట్లు భూగర్భ జల విభాగం అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా జనగాం, వరంగల్ రూరల్, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో సేకరించిన నీటి నమూనాల్లో అంచనాకు మించి ఫ్లోరైడ్ శాతాలు నమోదైనట్లుగా తేల్చింది. వీటితో పాటే నైట్రేట్, సల్ఫేట్ సైతం పరిమాణానికి మించి ఉన్నట్లుగా వెల్లడైంది. – సాక్షి, హైదరాబాద్ నల్లగొండ తర్వాత ఆసిఫాబాద్.. భూగర్భ జల విభాగం ఏటా వర్షాలకు ముందు ఒకమారు, వర్షాల అనంతరం మరోమారు రాష్ట్రంలోని భూగర్భ జల పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. ఈ ఏడాది వర్షాలకు ముందున్న పరిస్థితులపై రాష్ట్రవ్యాప్తంగా 2,670 నీటి నమూనాలను సేకరించి పరిశోధన జరిపింది. వీటిలో నైట్రేట్స్ అధికంగా ఉన్న శాంపిల్స్ 1,494 వరకు ఉండగా, ఫ్లోరైడ్ అధికంగా ఉన్న శాంపిల్స్ ఏకంగా 567 వరకు ఉన్నట్లు వెల్లడైంది. వాస్తవానికి నీటిలో 1 నుంచి 1.5 మిల్లీగ్రామ్/లీటర్ వరకు ఫ్లోరైడ్ ఉండాలి. అంతకుమించితే ప్రమాదమే. ప్రస్తుతం పరిశీలించిన శాంపిల్స్‌లో నల్లగొండలో అధికంగా 7.83 మిల్లీగ్రామ్/లీటర్ ఉండగా, ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లో 5.98 మిల్లీగ్రామ్/లీటర్‌గా ఉన్నట్లు తేలింది. జిల్లాల వారీగా చూస్తే నల్లగొండ తర్వాత జనగాం, వరంగల్ రూరల్, రంగారెడ్డి, సిద్ధిపేట, నిర్మల్‌లో సేకరించిన నమూనాల్లో అధికంగా ఫ్లోరైడ్ శాతం ఉన్నట్లు తేలింది. గత వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడం.. జలాశయాల్లో తగినంత నీరు లేక సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటం, ప్రజలు చేతిబోర్ల వైపు మళ్లడంతో ఫ్లోరైడ్ శాతం అధికంగా కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు. నైట్రేట్ ఎక్కువే.. సేకరించిన నీటి నమూనాల్లో ఫ్లోరైడ్‌తో పాటు అధికంగా నైట్రేట్లు ఉన్నట్లు భూగర్భ జల విభాగం తేల్చింది. మొత్తం 2,670 నమూనాల్లో 1,494 నమూనాల్లో నైట్రేట్లు అధికంగా ఉన్నాయని గుర్తించింది. వాస్తవానికి నీటిలో నైట్రేట్ శాతం 10.16 మిల్లీగ్రామ్/లీటర్‌కు మించరాదు. కానీ సూర్యాపేట జిల్లాలో ఏకంగా 445 మిల్లీగ్రామ్/లీటర్ ఉన్నట్లు గుర్తించారు. నల్లగొండ, సిద్ధిపేట జిల్లాల్లోనూ ఇదే రీతిన ఫలితాలు వచ్చి నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నైట్రేట్లు అధికంగా ఉన్న నీటితో రక్త కణాల్లోకి ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలుగుతుందని, దీనిని బ్లూ–బేబీ సిండ్రోమ్‌గా పేర్కొంటారని తెలిపారు. శుద్ధమైన జలాలు తీసుకోవడం, తక్కువ ఎరువుల వాడకం ద్వారా నైట్రేట్‌ను నియంత్రించవచ్చని వెల్లడించారు. సల్ఫేట్ అధికంగా ఉన్న మండలాలు(%) జిల్లా మండలం సల్ఫేట్ శాతం (మిల్లీగ్రామ్/లీటర్) గద్వాల్ మనోపాడ్ 1,770 గద్వాల్ ఇటిక్యాల్ 1,100 నల్లగొండ నిడమనూర్ 620 యాదాద్రి వలిగొండ 586 నల్లగొండ అనుముల 542 నైట్రేట్ అధికంగా ఉన్న మండలాలు(%) జిల్లా మండలం నెట్రేట్శాతం (మిల్లీగ్రామ్/లీటర్) సూర్యాపేట గరిడేపల్లి 445 నల్లగొండ నిడమనూర్ 347.5 సూర్యాపేట హుజూర్నగర్ 283 సిద్ధిపేట వర్గల్ 246 సూర్యాపేట నేరేడుచర్ల 235 2,670 రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన నమూనాలు 127 విద్యుత్ వాహకత ఎక్కువ ఉన్న నమూనాలు 567 ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నట్టు తేలిన శాంపిల్స్ 1,494 నైట్రేట్ ఎక్కువగా ఉన్నట్టు తేలిన శాంపిల్స్ -
ముమ్మరంగా వాటర్‌షెడ్ పనులు
కంగ్టి, న్యూస్‌లైన్: భూగర్భ జలవనరులను సమృద్ధి పరి చేందుకు చేపడుతున్న మెగా వాటర్‌షెడ్ పథకం పనులు మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తుర్కవడ్‌గాం శివారులో నీటి కుంటల నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మండలంలోనే అతి పెద్ద తుర్కవడ్‌గాం గ్రామ పంచాయతీ పరిధిలో రాజారాం తండా, సాధుతండా, చింతామణి తండాలు ఉన్నాయి. ఇక్కడ సాగుకు పనికి రాని భూములే ఎక్కువ. బొడిగె రాళ్లు, పరుపు బండ రాళ్ల భూములే అధికం. నీటి వనరులు చాలా తక్కువ. ఇక్కడి రైతులు కేవలం వర్షాధారం కింద ఖరీఫ్ పంటలు మాత్రమే పండిస్తారు. అందుకే ఈ ప్రాంత గిరిజనులు ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇతర ప్రాంతాలకు వలస వెళుతుంటారు. వీరి భూములను అభివృద్ధి పరిచేందుకు మండలంలో ‘మెగా వాటర్ షెడ్ తుర్కవడ్‌గాం’ పథకం పేరిట పనులు చేపడుతున్నారు. నీటి కుంటలు, ర్యాక్ ఫీల్డ్ డ్యాం నిర్మాణాలను చేపడుతున్నారు.తుర్కవడ్గాంలోని 870 హెక్టార్ల భూములను మెగా వాటర్‌షెడ్ కింద గుర్తించారు. ఈ మేరకు రూ.1.04 కోట్లు నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు 25 శాతం పనులు పూర్తయినట్లు సమాచారం. ఇప్పటికే 34 నీటి కుంటల నిర్మాణం పనులను యంత్రాల ద్వారా పూర్తి చేశారు. మరో 14 నీటి కుంటల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో నీటి కుంటకు రూ.30 నుంచి రూ.50వేల వర కు వెచ్చిస్తున్నారు. ఇవే కాకుండా ఈ ప్రాంతంలో ర్యాక్ఫీల్డ్ డ్యాంలు(రాతి కట్టడాలు) కూడా చేపట్టారు. కుంటల అభివృద్ధి వల్ల తమ ప్రదేశాల్లో భూగర్భ జల వనరులు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.