కొడుకు కోత
కన్నబిడ్డ పోతే తల్లిదండ్రులకు మిగిలేది కడుపుకోత.
బిడ్డ ఉండీ నిరాదరణకు గురిచేస్తుంటే... అది కడుపుకోతను మించిన కొడుకు కోత.
తల్లిదండ్రులను దైవంగా చూసుకునే సమాజంలో కనీసం మనుషుల్లా చూసే అవకాశం కూడా కపడట్లేదు. నేను అంటే ఏంటి? నేను సంపాదించుకున్న జ్ఞానం! అంటే నేను చదువుకున్న పుస్తకాలు, నా అనుభవానికి అందిన జీవితం! ఈ జీవితంలో అమ్మానాన్న లేకుండా ఉంటారా? మనకు కనపడిన మొదటి పుస్తకాలు వాళ్లేగా? అక్షరం నేర్చుకుని ఆప్యాయత పోగొట్టుకున్నామా? ఆదాయం వచ్చాక అభిమానాలు చంపుకున్నామా? ఎలాంటి కథైనా వినొచ్చు. కాని ఇలాంటి కథైతే ఎప్పుడూ వినకూడదు. మనకు తెలియకుండా.. మనకు తెలిసీ.. మన చుట్టుపక్కల ఇలాంటి కథలు, వ్యధలు, బాధలు ఎన్నో గట్టిగా అరిచి వాటి ఉనికిని తెలియజేస్తూనే ఉంటాయి. యాంత్రిక జీవితంలో మనకు ఈ వ్యధలు కనపడవు. వినపడవు.
వనపర్తి జిల్లా, వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలోని 70 ఏళ్ల బాల్‌రెడ్డి, 60 ఏళ్ల నర్సమ్మ దంపతులది అలాంటి గాథే! ఈ వాస్తవ సంఘటన మనల్నందరినీ తట్టిలేపుతుందని... మన బాధ్యతను గుర్తుచేస్తుందనే ఆశతో జీవిత చరమాంకంలో ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్న వేదనను చెప్తున్నాం.ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు వ్యవసాయం చేశాడు బాల్‌రెడ్డి. ఉన్న పొలంలో రెండు ఎకరాలు కొడుకు కోసం ఉంచి మిగిలినది అమ్మి ఆడపిల్లలకు పెళ్లి చేశాడు. ఆడపిల్లల బాధ్యత తీరాక కొడుక్కి పెళ్లిచేశారు. అప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి.
భార్యమాట వింటూ తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశాడు కొడుకు. రోజులు గడుస్తున్నాయి. కొడుక్కి పిల్లలు పుట్టారు. పెరిగారు. కొడుకు, కోడలు చీదరింపులు, సాధింపులు ఎక్కువయ్యాయి తప్ప తగ్గలేదు. కొడుకు కూతురు పెళ్లీడుకొచ్చింది. పెళ్లి చేయడానికి తన దగ్గర డబ్బుల్లేవని, ఆ రెండెకరాల పొలాన్ని అమ్మేద్దామని తండ్రిని అడిగాడు ప్రభాకర్‌రెడ్డి. కొడుకు అడిగిందే తడవుగా ఒప్పుకొని మనవరాలి పెళ్లికి సహాయం చేశాడు బాల్‌రెడ్డి. అయినా ఆ కొడుకుకు తల్లిదండ్రుల మీద ప్రేమ రాలేదు. చీటికి మాటికి గొడవ పడడమే కాక చేయి కూడా చేసుకున్నాడు. దీంతో మనస్థాపం చెందిన ఆ వృద్ధులు కూతుళ్ల దగ్గరకు వెళ్లారు. ఇది జీర్ణించుకోలేని ప్రభాకర్‌రెడ్డి అక్కాచెల్లెళ్లతోనూ గొడవపడ్డాడు. ‘అమ్మానాన్నకు అన్నం పెట్టొద్దు. వాళ్లను మీ దగ్గర ఉంచుకోవద్దు’ అని వాళ్లను బెదిరించాడు. దాంతో వారు కూడా తల్లిదండ్రులను బయటికి పంపించారు.
వాటర్‌షెడ్‌హాల్... వృద్ధాప్య ఫించన్
కొడుకు చూడక.. బిడ్డలనూ చూడనివ్వకపోవడంతో ఆ అమ్మానాన్న ఊళ్లోని కమ్మూనిటీ హాల్లో తలదాచుకున్నారు. బాల్‌రెడ్డికి వచ్చే వెయ్యి రూపాల వృద్ధాప్య పింఛనే ఆ భార్యాభర్తకు జీవనాధారం. అవి మందులకే సరిపోతున్నాయి. ఇరుగుపొరుగు వారు పెట్టేది తింటూ బతుకీడుస్తున్నారు. ఏదో ఒకలా రోజులు గడుస్తున్నాయనుకుంటుంటే... బాల్‌రెడ్డి కింద పడి కాలు విరిగి మంచానికి పరిమితమయ్యాడు. అన్నీ తానై భర్తను చూసుకుంటోంది నర్సమ్మ. జీవిత చరమాంకంలో వీరికి తినడానికి తిండి, ఉండడానికి వసతి తప్ప మరే ఆశలూ లేవు. కొడుకు నుంచి రక్షణ, సంరక్షణ కల్పించాలని మొరపెట్టుకుంటున్నారు.
ఈ విషయం తెలుసా?
ప్రభాకర్‌రెడ్డిలాంటి పిల్లలకు ఒక విషయం తెలుసో లేదో? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సరిగా చూడకపోతే... వాళ్ల యోగక్షేమాలను పట్టించుకోకపోతే జైలు శిక్ష ఉంటుంది. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ బిల్, 2007 ప్రకారం పిల్లలకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షను తప్పించుకోవడానికి వీలు లేదు. అప్పీలుకు చాన్స్ లేదు.
ఈ కష్టం ఎవరికీ రావద్దు
‘ఎన్నో బాధలుపడి కొడుకును పెంచి పెద్ద చేశాం. ఈ రోజు వాడు మమ్మల్ని పగవాళ్లలా చూస్తున్నాడు. ఈ కష్టం ఎవరికీ రావద్దు’ అంటున్నాడు బాల్‌రెడ్డి. మమ్ముల్ని ఎక్కడా ఉండనీయడం లేదు. ఊళ్లోవాళ్ల సాయంతో ఈ వాటర్‌షెడ్ హాల్‌లో ఉంటున్నాం. బిడ్డలు మాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామని చెప్పారు. కానీ నా కొడుకు పడనీయట్లేదు. వాళ్లతో కొట్లాడ పెట్టుకుంటున్నాడు. ఆ భయంతో వాళ్లు మా దగ్గరికి రావట్లేదు. మేము ఎక్కడున్నా అక్కడికొచ్చి గొడవపడుతున్నాడు. భయంభయంగా గడుపుతున్నాం’ అంటు కళ్లనీళ్ల పర్యంతమైంది నర్సమ్మ.
– సిలివేరు యాదగిరి, సాక్షి, వనపర్తి