కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయం
సాక్షి, కొత్తకోట : ఓ వైపు పార్లమెంట్ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించడానికి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండగా... మరో వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వెనువెంటనే ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. ఈ ఏడాది జూన్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీల పదవికాలం ముగియనుంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియతో పాటుగా ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేశారు. జాబితాను గ్రామ పంచాయితీ కార్యాలయాలు, తహాసీల్దార్ కార్యాలయాలం ఎదుట ప్రదర్శించారు. ఇంతకు ముందే ఎంపీటీసీ స్థానాల ఏర్పాట్లపై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మండలంలో 59పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. గతంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్న కొత్తకోట గ్రామ పంచాయితీ ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో అయిదు స్థానాలకు ఎన్నికలు లేకుండా పోయాయి.
మండలంలో రిజర్వేషన్లు ఇలా..
మండలంలో 22గ్రామ పంచాతీలకు గానూ 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ సైతం ముగిసింది. అమడబాకుల(జనరల్), అప్పరాల (బీసీ మహిళ), కానాయపల్లి (బీసీ జనరల్), కనిమెట్ట (జనరల్), మిరాషిపల్లి (జనరల్ మహిళ), నాటవెళ్లి (ఎస్టీ జనరల్), నిర్వేన్ (జనరల్ మహిళ), పాలెం (ఎస్సీ జనరల్), పామాపురం (బీసీ మహిళ), రాయిణిపేట (జనరల్ మహిళ), సంకిరెడ్డిపల్లి (జనరల్), వడ్డెవాట (ఎస్సీ మహిళ)కు కేటాయించారు.
40,289మంది ఓటర్లు..
మండలంలో 23 పంచాయతీల్లో ఓటర్ల లెక్క తేలింది. మొత్తం 40,289మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 20,458, మహిళలు 19,831మంది ఉన్నారు.
పైరవీలు షురూ..
ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకునే అశావహులు తమ పార్టీ పెద్దల వద్ద పైరవీలు మొదలు పెట్టారు. సర్పంచ్ సీటు కోల్పోయిన వారు, గతంలో సీటు కోసం యత్నం చేసి విఫలం చెందిన వారు ఎంపీటీసీ స్థానాల సీటు కేటాయించాలని ఆయా పార్టీల పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ప్రత్యర్థులకు ధీటుగా ఆర్థికంగా తట్టుకునే వారిని నిలబెట్టేందుకు పార్టీ పెద్దలు చూస్తున్నారు.
కసరత్తు చేస్తున్నాం
స్థానిక ఎంపీటీసీ ఎన్నికలకు సంబందించి ఓటురు లిస్టును ప్రర్శించాం. అధికారుల అదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ చేస్తున్నాం. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుందో సమాచారం లేదు. ఎన్నికలు ఎప్పడు వచ్చిన ఎదుర్కొవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం.
– కతలప్ప, ఎంపీడీఓ, కొత్తకోట
Comments
Please login to add a commentAdd a comment