వరలక్ష్మి (ఫైల్), ఒంటరైన కొడుకు సుజన్
చిన్నంబావి (వనపర్తి): క్షణికావేశం.. ఆ కుటుంబంలో ఉన్న నలుగురిలో ముగ్గురిని బలిగొంది. కాలిన గాయాలతో తండ్రి, చెల్లి గురువారం మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన తల్లి సైతం శుక్రవారం మృతిచెందింది. దీంతో నాకు దిక్కెవరు అంటూ కుమారుడు సుజన్ రోదనలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. మండలంలోని అయ్యవారిపల్లిలో క్షణికావేశంలో కుటుంబ కలహలతో భర్త జయన్న(40) తన భార్య, కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించగా గురువారం జయన్న, కూతురు గాయత్రి(17) మృతి చెందారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న వరలక్ష్మి(35) శుక్రవారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. ఇంటికి పెద్దదిక్కు తమ కుటుంబాన్ని మొత్తాన్ని పోషించేది అమ్మేనని, తన చిన్నతనం నుంచి తమ కోసం ఎంతో కష్టపడిందని గుర్తుచేసుకున్నాడు. అంగన్‌వాడీ టీచరుగా పనిచేస్తు తమకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుందని, ఇప్పుడు అకాలంగా నన్ను విడిచి వెళ్తుందని ఎన్నడూ అనుకోలేదని కొడుకు సుజన్ రోదించాడు.
ఎవరి కోసం బతకాలి..
కుటుంబంలో అందరిని కోల్పోయి ఒంటరిగా మిగిలాడు సుజన్. తనకు జీవితం మీద ఇష్టం లేదని, తను ఇంక ఎవరి కోసం బతకాలని తను చనిపోయి ఉన్నా బాగుండు అని రోదించాడు. గురువారం జయన్న, గాయత్రి మృతదేహలకు సర్పంచ్ రామస్వామి, గ్రామస్తుల సహకారంతో ఖననం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment