family mass suicide
-
ఇదే మా ఆఖరి కోరిక..
-
మూఢనమ్మకాలకు కుటుంబం బలి
మీర్‌పేట: మూఢ నమ్మకాలకు ఓ కుటుంబ బలైంది. తమ అనారోగ్యానికి చేతబడులే కారణమని భావించి, దేవాలయాల చుట్టూ తిరగడానికి భారీగా ఖర్చు చేసి చివరకు నలుగురు కుటుంబ సభ్యులూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... వికారాబాద్ జిల్లా, దరూర్ మండలం, డోర్నాల గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, సువర్ణబాయి భార్యభర్తలు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు మరణించగా.. సువర్ణబాయి (55) తన కుమారులు హరీష్‌రావు (30), గిరీష్‌రావు (27), కుమార్తె స్వప్నలతో (23) కలిసి 2007లో నగరానికి వలసవచ్చారు. తొలుత కొన్నాళ్లు శాలిబండలోని తన బంధువుల ఇంట్లో ఉన్నారు. రెండేళ్ల క్రితం మీర్‌పేటలోని అల్మాస్గూడ బీఎస్ఆర్ కాలనీలోని శ్రీసాయితేజ హైట్స్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. హరీష్‌రావు, గిరీష్‌రావు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరు అందుకు చేతబడే కారణమని నమ్ముతూ దానికి నివృత్తి అంటూ భారీగా ఖర్చు చేశారు. వైద్య ఖర్చులకూ మరికొంత ఖర్చు చేయడంతో ఆస్తులు కరిగిపోయాయి. ఎట్టకేలకు జీవితంపై విరక్తి చెందిన ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. (మ‘రుణ’ మృదంగం!) సూసైడ్ నోట్ రాసిన వీరు బుధవారం ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రం 5–6 గంటల మధ్యలో తొలుత హరీష్‌రావు తన తల్లి, సోదరుడు, సోదరిలు ఒకరి తర్వాత ఒకరుగా బెడ్రూమ్లో ఫ్యానుకు ఉరివేసుకుని చనిపోయారు. ఒకరి తర్వాత ఒకరు బెడ్రూమ్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోగా... హరీష్‌రావు వీరందరి మృతదేహాలను కిందకి దింపి తల్లిది బెడ్ పైన, సోదరుడు, సోదరిలను నేల మీద పడుకోబెట్టాడు. అనంతరం హాల్లోకి వెళ్లిన హరీష్‌రావు అక్కడి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అంచనా వేస్తున్నారు. చనిపోయే ముందు వీరు తమ ఇంటి ప్రధాన ద్వారం డోర్‌పై ‘ఈ డోర్ తెరవండి’ అని రాసిన పేపర్‌ను అతికించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో దీనిని చూసిన స్థానికులు తలుపులు తోయగా తెరుచుకున్నాయి. దీంతో ఆత్మహత్యల విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇంట్లోని అల్మారాలోని గోడకు ఆనుస్తూ ‘ఈ లేఖ చదవండి’ అంటూ ఓ అట్ట ముక్కపై రాసి పెట్టారు. దానికి సమీపంలో ఉన్న రెండు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న నలుగురూ ఉమ్మడిగా రాసినట్లు ఉన్న ఆ లేఖలోని ముఖ్యాంశాలు ఇవీ... మా మృతదేహాలకు పోస్టుమార్టం వద్దు ‘మమ్మల్ని క్షమించండి. చేతబడి శక్తుల చేత ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడి వేరే దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం. మా వస్తువుల్ని గ్రామవాసులకు లేదా ఎవరికి కావాలంటే వారికి ఇవ్వండి. మమ్మల్ని హాస్పిటల్‌కు తీసుకుపోవద్దు... పోస్టుమార్టం చేయవద్దు. ఇదే మా ఆఖరి కోరిక. డైరెక్టుగా మమ్మల్ని అంత్యక్రియలకు తీసుకెళ్లండి. మాతో పాటు మా నాన్న గారి ఫొటో, మా పప్పీ (కుక్క పిల్ల) ఫొటో, బ్యాగ్‌లోని సామానులు కాల్చేయండి. మేము ఎన్నో దేవుళ్ల వద్దకు తిరిగినా తక్కువ కాకపోవడంతో ఈ విధంగా చేసుకుంటున్నాం. మా దగ్గర ఉన్న డబ్బు దేవుళ్ల వద్దకు తిరగడానికి, మందులకు ఖర్చయిపోయింది. ఈ బాధల వలన సొంత ఇల్లు, ప్లాట్స్, గోల్డ్ ఖర్చయిపోయాయి. ఉద్యోగం వదులుకోవడంతో పాటు మేము ఎవరమూ పెళ్ళి కూడా చేసుకోలేదు. ఈ ఉత్తరాన్ని మా నలుగురి ఆమోదంతో రాస్తున్నాం.’ ఈ లేఖను ‘నోట్’ అని పేర్కొంటూ వేర్వేరు పేరాలుగా రాశారు. ఒక్కో దాంట్లో ఒక్కో అంశంతో పాటు తమ గ్రామస్తులు, గ్రామ పెద్దల పేర్లు, వారి ఇంట్లోని వస్తువుల జాబితా పొందుపరిచారు. నగరంలోని తమ సమీప బంధువుల పేర్లు, అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు రాశారు. తమ గ్రామానికి చెందిన నలుగురితో పాటు గ్రామ ప్రజలు తమ ముఖాలు చూసి, అంత్యక్రియలు చేయాలంటూ అందులో పేర్కొన్నారు. -
మిగిలింది ఒక్కడే..!
చిన్నంబావి (వనపర్తి): క్షణికావేశం.. ఆ కుటుంబంలో ఉన్న నలుగురిలో ముగ్గురిని బలిగొంది. కాలిన గాయాలతో తండ్రి, చెల్లి గురువారం మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన తల్లి సైతం శుక్రవారం మృతిచెందింది. దీంతో నాకు దిక్కెవరు అంటూ కుమారుడు సుజన్ రోదనలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. మండలంలోని అయ్యవారిపల్లిలో క్షణికావేశంలో కుటుంబ కలహలతో భర్త జయన్న(40) తన భార్య, కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించగా గురువారం జయన్న, కూతురు గాయత్రి(17) మృతి చెందారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న వరలక్ష్మి(35) శుక్రవారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. ఇంటికి పెద్దదిక్కు తమ కుటుంబాన్ని మొత్తాన్ని పోషించేది అమ్మేనని, తన చిన్నతనం నుంచి తమ కోసం ఎంతో కష్టపడిందని గుర్తుచేసుకున్నాడు. అంగన్వాడీ టీచరుగా పనిచేస్తు తమకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుందని, ఇప్పుడు అకాలంగా నన్ను విడిచి వెళ్తుందని ఎన్నడూ అనుకోలేదని కొడుకు సుజన్ రోదించాడు. ఎవరి కోసం బతకాలి.. కుటుంబంలో అందరిని కోల్పోయి ఒంటరిగా మిగిలాడు సుజన్. తనకు జీవితం మీద ఇష్టం లేదని, తను ఇంక ఎవరి కోసం బతకాలని తను చనిపోయి ఉన్నా బాగుండు అని రోదించాడు. గురువారం జయన్న, గాయత్రి మృతదేహలకు సర్పంచ్ రామస్వామి, గ్రామస్తుల సహకారంతో ఖననం చేశారు. -
మ‘రుణ’ మృదంగం!
నేర్చుకున్న వృత్తిని నమ్ముకోక స్నేహితుల మాటలు నమ్మిఓ కుటుంబ పెద్ద పెడదారిన పట్టడం భార్యాపిల్లలకుశాపమైంది. దంపతులతోపాటు ముగ్గురు చిన్నారుల ప్రాణాలను హరించివేసింది. అలాగే చేసిన అప్పులు మెడకు చుట్టుకోవడంతో తీర్చేమార్గం లేక భార్య, ఇద్దరు పిల్లలు సహా రైలు పట్టాలపై జీవితాన్ని చాలించాడు. దాదాపుగా ఒకేరోజు జరిగిన ఈ సంఘటనలు స్థానిక ప్రజలనుకలచివేశాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: విల్లుపురం జిల్లా సెంజి సమీపం పనమలై గ్రామానికి చెందిన బంగారు నగల తయారీ కార్మికుడు అరుళ్ (32), భార్య శివగామసుందరి (28), కుమార్తెలు ప్రియ దర్శిని (5), యువశ్రీ (3) భారతి (1)లతో కలిసి విల్లుపురం సిత్తేరీకరైలో అద్దె ఇంటిలో కాపురం ఉంటున్నాడు. తొలిరోజుల్లో సొంతగా నగలతయారీ దుకాణాన్ని పెట్టుకుని జీవనం సాగించేవాడు. అయితే ఈ వృత్తిలో అత్యాధునిక యంత్రాల ప్రవేశంతో తన దుకాణాన్ని శాశ్వతంగా మూసివేసి వేరే నగల తయారీ కంపెనీలో కార్మికునిగా చేరాడు. అయితే ఆశించిన ఆదాయం లభించక విరక్తి చెందాడు. పరిమితమైన ఆదాయం కలిగిన జీవితంలో రాజీపడలేక పక్కదారులు వెతికాడు. ఈ దశలో కొందరు స్నేహితులు లాటరీల ద్వారా జాక్‌పాట్ కొడితే భారీ ఆదాయం ఖాయమని ఆశపెట్టారు. వారి సలహాతో మూడు నంంబర్ల లాటరీ చీటీలను కొనడం ప్రారంభించాడు. ఇదిగో వస్తుంది, అదిగో లాటరీ తగులుతుందనే ఆశతో గత నాలుగేళ్ల కాలంలో సంపాదించిన సొమ్ముంతా లాటరీలో పెట్టేశాడు. దీంతో కుటుంబ పోషణ కష్టమైపోయి కృంగిపోయాడు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి 11 గంటలకు తన భార్యా బిడ్డలకు విషమిచ్చి తాను సేవిస్తున్న వీడియోను వాట్సాప్‌లో పెట్టి స్నేహితులకు పంపాడు. ఈ వీడియో విల్లుపురం నగరమంతా వైరల్ కావడంతో అందరూ వారికోసం వెతుకులాట ప్రారంభించి అర్ధరాత్రి 12 గంటల సమయంలో అరుళ్ ఇంటిని కనుగొన్నారు. ఇంటి ముందువైపు తలుపులు మూసి ఉండడంతో పగులగొట్టి లోనికి ప్రవేశించి చూడగా ఐదుగురూ స్పృహతప్పిన స్థితిలో పడిఉన్నారు. పోలీసులు వచ్చి అందరినీ ఆసుపత్రికి తరలించగా అందరూ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అరుళ్, శివకామసుందరి, ప్రియదర్శిని, యువశ్రీ, భారతిల మృతదేహాలు (ఇన్సెట్లో భార్య, పిల్లలతో అరుళ్) కంటతడిపెట్టించిన వీడియో.. నగల తయారీకి వినియోగించే సైనైడ్‌ను పాలలో కలిపి ముందుగా పిల్లలతో తాగించాడు. ఆ తరువాత భార్యకు ఇచ్చి అందరూ ప్రాణాలు విడిచిన తరువాత అరుళ్ తానూ సేవించి ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. వాట్సాప్‌లో విడుదల చేసిన ఒక వీడియోలో పిల్లలకు సైనైడ్‌ను కలిపిన పాలను తాగించడం, పిల్లలంతా చనిపోయిన దృశ్యాలను అందరూ చూడండి అంటూ అరుళ్ చెపుతున్నాడు. ప్రాణాలు విడిచే సమయంలో పిల్లలంతా గిలగిలా కొట్టుకునే దృశ్యాలు అందరినీ కలచివేశాయి. మరో వీడియోలో...దేవుళ్లారా మీ వల్ల అనేక గుణపాఠాలు నేర్చుకున్నాను, మనుషుల్లో న్యాయం, ధర్మం నశించాయి, నా భార్యా, పిల్లలను విషంతో చంపి కూర్చుని ఉన్నాను. నేను కూడా విషం తీసుకోబోతున్నా. ఆ తరువాత అందరూ జాలీగా జీవించండి. విల్లుపురంలో మూడునంబర్ల లాటరీ లేకుండా నిర్మూలించండి. ఇలా మరో కుటుంబం బలికాకూడదు...అంటూ ఆవేదనతో చెబుతున్న దృశ్యాలు పోలీసులను సైతం కంటతడిపెట్టించాయి. మరో కుటుంబ విషాదగాథ: అప్పుల బాధ అతడిని ఆత్మహత్యకు పురికొల్పింది. అంతేగాక తనతోపాటూ భార్యా పిల్లలను సైతం బలవన్మరణానికి పాల్పడేలా చేశాడు. తిరుచ్చిరాపల్లి ఉరలయూరుకు చెందినఉత్తిరపతి (50) తన భార్య సంగీత (43), కుమార్తె అభినయశ్రీ (15), కుమారుడు ఆకాష్ (12)లతో కలిసి కొన్నిరోజుల క్రితం దిండుగల్లు జిల్లా కొడైక్కెనాల్‌కు వచ్చి విహారయాత్ర చేశారు. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో వారంతా కొడైరోడ్డు రైల్వేస్టేషన్‌కు చేరుకుని ఒకరిచేతిని ఒకరు పట్టుకుని రైలుపట్టాలపై నడుచుకుంటూ బయలుదేరారు. ఈ సమయంలో తిరునెల్వేలీ–చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు వారిని ఢీకొనడంతో అందరి శరీరాలు చిద్రమై సంఘటనా స్థలంలోనే మరణించారు. మృతుల ఆధార్‌కార్డు ఆధారంగా మృతుల వివరాలు తెలుసుని బంధువులకు సమాచారం ఇచ్చారు. అప్పుల బాధతోనే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాధమిక విచారణలో పోలీసులు తేల్చారు. ఆత్మహత్యకు పాల్పడాలనే ఉద్దేశ్యంతోనే వారు కొడైక్కెనాల్‌కు బయల్దేరారని చెప్పారు. రాష్ట్రంలో ఒకేరోజున రెండు కుటుంబాలు నిలువునా ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపింది. -
గోడపై రక్తంతో మరణ వాంగ్మూలం..
తమిళనాడు,తిరువొత్తియూరు: మొదట బిడ్డను హత్య చేసి, ఆ తర్వాత తల్లిదండ్రులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లై జిల్లాలో చోటు చేసుకుంది. తెన్కాశి జిల్లా చెంగోట్టై సమీపం పులియరైకట్టులై నివాస ప్రాంతానికి చెందిన కందస్వామి (35). కూలీ కార్మికుడు. అతని భార్య ఇందుమతి (30), వీరి కుమారుడు చిన్న ముత్తిరన్ (6), రెండు సంవత్సరాల కుమార్తె వున్నారు. కందస్వామి పలువురి వద్ద అప్పు చేసినట్టు తెలిసింది. కూలీ పనులకు వెళ్లి కుటుంబం పోషించాల్సి రావడంతో అతను తీసుకున్న అప్పు తీర్చలేకపోయాడు. దీంతో రుణదాతలు ఒత్తిడి చేశారు. దీంతో విరక్తి చెందిన కందస్వామి, అతని భార్య సోమవారం రాత్రి భోజనం చేసి తరువాత కుమారుడికి అన్నం తినిపించారు. తరువాత మనసును రాయి చేసుకుని మొదట కుమారుడిని గొంతు నులిమి హత్య చేశారు. దీని తరువాత రెండు సంవత్సరాల ఆడబిడ్డను గొంతు బిగించినట్టు తెలిసింది. ఆ బిడ్డ ఏడవడంతో ఆమెను వదలి పెట్టి ఇంటిలో వేరే వేరుగా ఫ్యాన్లకు కందస్వామి, అతని భార్య ఇందుమతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం చాలా సమయం అయినప్పటికీ వారి ఇంటి తలుపులు తెరచుకోకపోవడం ఇంటి నుంచి బిడ్డ ఏడుపు శబ్ధం వినబడటం చూశారు. ఆ సమయంలో భార్య, భర్త ఉరిలో శవాలుగా వేలాడుతున్నారు. పక్కన బాలుడు చిన్న ముత్తిరన్ శవంగా పడి వున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పులియారై పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని తెన్కాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలకు పోరాడుతున్న చిన్నారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమతించారు. పోలీసుల విచారణలో అప్పుల బాధతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తమ రక్తంతో గోడపై మరణ వాగ్మూలం రాశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
డబ్బుపై ఆశే ప్రాణం తీసింది
చిత్తూరు అర్బన్ : రూపాయి రూపాయి ఏం చేస్తావ్ అంటే.. అయినవాళ్లను విడదీస్తాను. తోబుట్టువుల మధ్య రక్తపాతం సృష్టిస్తాను. బంధాలను సైతం బూడిద చేస్తానని చెప్పిందట. ఇదే కోవలో కట్టుకున్న భార్య కన్నబిడ్డ భవిష్యత్తును అదే రూపాయిల కోసం చిదిమేసి తనువు చాలించాడో వ్యక్తి. అర్ధరాత్రి కూల్‌డ్రింక్ తాపించడానికి నిద్రలేపుతుంటే కన్నతండ్రి, కట్టుకున్న భర్తపై ఉంచిన నమ్మకంతో అందులో కలిపి ఉన్న విషాన్ని గ్రహించలేక మృత్యుఒడికి చేరుకున్నారు. చిత్తూరు నగరంలోని ఓబనపల్లె హౌసింగ్ కాలనీలో చోటుచేసుకున్న హృదయవిదారక ఘటన అందరినీ కన్నీళ్లుపెట్టించింది. చిత్తూరు నగరంలోని సంతపేట సమీపంలో ఉన్న ఓబనపల్లె హౌసింగ్ కాలనీకి చెందిన కల్లూరు రవి (50).. అతని భార్య కల్లూరు భువనేశ్వరి (45), కుమార్తె కల్లూరు గాయత్రి (9)కి పురుగులమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి తాను కూడా ఇదే పానీయాన్ని తాగడంతో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగుచూసింది. చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, టూటౌన్ సీఐ యుగంధర్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రవి మొదటి భార్య గౌరి 15 ఏళ్ల క్రితం మృతిచెందింది. వీరికి భార్గవి అనే పాప ఉంది. గౌరి మృతి తరువాత బెంగళూరుకు చెందిన భువనేశ్వరితో పెద్దలు రవికి వివాహం చేశారు. వీరికి గాయత్రి, నాగేశ్వరసాయి (6)అనే ఇద్దరు పిల్లలున్నారు. రవి తల్లి కల్లూరు జయలక్ష్మి ఎల్ఐసీలో పనిచేస్తూ ఇటీవల రిటైరయ్యారు. కాస్త డబ్బులు రావడంతో రవి ఆ డబ్బు కోసం నిత్యం తల్లితో వాదులాడేవాడు. పైగా ఓబనపల్లె కాలనీలో ఉన్న ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని పలుమార్లు గొడవ కూడా పెట్టుకున్నాడు. అయితే మద్యానికి బానిసైన కొడుకు ఇంటిని పోగొట్టుకుంటాడని భావించిన జయలక్ష్మి.. ఇంటిని మనవడి పేరిట రాస్తామంటూ చెబుతూ వచ్చేది. కుటుంబ పోషణ అంతంతమాత్రంగా ఉండటంతో భువనేశ్వరిని ఆర్థికంగా ఆదుకునేది. ఇది నచ్చని రవి, తన భార్యతో కూడా తగాదాలు పెట్టుకునేవాడు. ఈ నేపథ్యంలో నిద్రిస్తున్న భార్య, పిల్లల్ని అర్థరాత్రి లేపి, పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించాడు. కొద్దిసేపు తరువాత తాను కూడా తాగి స్పృహ కోల్పోయాడు. ముగ్గురూ చనిపోయారు. ఇద్దరి రాత బాగుండటంతో... రవి తన కొడుకు నాగేశ్వరసాయికి కూడా పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించాడు. కొద్దిగా తాగిన సాయి, తనకు వద్దని చెప్పి పడుకునేశాడు. కొంతసేపటికి లేచి చూస్తే తల్లిదండ్రులు, అక్క అపస్మారక స్థితిలో పడుంటడాన్ని గమనించాడు. ఇంట్లో కింది అంతస్తులో పడుకున్న నానమ్మకు సమాచారమిచ్చాడు. ఆమె పైకివెళ్లి చూడటంతో అందరూ విగతజీవులుగా ఉన్నారు. స్థానికుల సాయంతో 108 అంబులెన్సులో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురూ చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. సాయి మాత్రం ప్రాణా పాయం నుంచి బయటపడ్డాడు. రవి మొదటి భార్య కుమార్తె భార్గవి, నానమ్మ వద్ద పడుకోవడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. మృతుల కుటుంబాన్ని చిత్తూరు ఆర్డీవో రేణుక పరామర్శించారు. -
కుటుంబం ఉసురు తీసిన దీపావళి గిఫ్టులు
దంపతులిద్దరూ ప్రయివేటు కంపెనీల్లో పనిచేస్తున్నారు. అదనపు ఆదాయం కోసం చీటీలు నిర్వహిస్తు్తన్నారు. దీపావళి పండుగ కోసం అదనపు ఆకర్షణలు పెట్టారు. వారి ప్రయత్నాలన్నీ వికటించాయి. అప్పుల గుదిబండ ప్రాణాలమీదికి తెచ్చింది. అప్పు తీర్చేదారిలేక కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. బంధువులు, ఆత్మీయులకు కన్నీరు మిగిల్చింది. ఈ ఘటన విల్లుపురం జిల్లా వానూరు తాలూకా కుయిలాపాళయంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: విల్లుపురం జిల్లా వానూరు తాలూకా కుయిలాపాళయం గ్రామానికి చెందిన సుందరమూర్తి(40) బేకరీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య మహేశ్వరి (35) గ్రామానికి సమీపంలో నీటిశుద్ధి కేంద్రానికి సొంతమైన సోలార్ కిచన్ సెంటర్లో పనిచేస్తోంది. వీరికి ప్లస్ టూ చదివే కృత్తిక (17), 8వ తరగతి చదువుతున్న షర్మిల (13) అనే కుమార్తెలున్నారు. నీటిశుద్ధి కంపెనీ ఇచ్చిన స్థలంలో ఇల్లుకట్టుకుని వీరు నివసిస్తున్నారు. భార్యాభర్తలు ఇరువురూ కలిసి కొంతకాలంగా చీటీలు, దీపావళి ఫండ్ పేరుతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.30 లక్షల మేర అప్పులపాలయ్యారు. దీపావళి సమీపిస్తుండగా ఖాతాదారుల నుంచి వత్తిడిపెరగడంతో సొమ్ము, గిఫ్టులు తప్పనిసరిగా చెల్లించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఒకవైపు అప్పులభారం, మరోవైపు దీపావళి గిఫ్టులు, చీటిపాట సొమ్ము చెల్లించే అవకాశం లేకపోవడంంతో భార్యాభర్తల మధ్య తరచూ వాదోపవాదాలు చోటుచేసుకునేవి. ఈనెల 14వ తేదీన కుయిలాపాళయం గ్రామంలోనితన తల్లిదండ్రులను కలుసుకుని వచ్చాడు. ఆ తరువాత ఆ కుటుంబ సభ్యులెవ్వరూ బయట కనిపించకపోవడంతో పండుగ సందర్బంగా అందరూ ఊరేళ్లి ఉంటారని ఇరుగూపొరుగూ భావించారు. సుందరమూర్తి కుటుంబం(ఫైల్) అయితే గురువారం రాత్రి వారింటి నుంచి భరించలేని దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారింటి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా సుందరమూర్తి ఉరికి వెళాడుతూ, భార్య మహేశ్వరి (35), కుమార్తెలు కృత్తిక (17), షర్మిల (13) విగతజీవులై కిందపడి ఉన్నారు. పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉన్న నలుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన రోజున బయట నుంచి తీసుకొచ్చిన ఆహారంలో విషం కలిపి భార్యా, కుమార్తెలతో తినిపించి హతమార్చిన సుందరమూర్తి ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. -
ఒకే రోజు తల్లి, ఐదుగురు కుమార్తెల బలవన్మరణం
తమిళనాడులో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే ఆరుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. మద్యానికి బానిసైన భర్తతో వేగలేక ఓ మహిళ తనువుచాలించాలని నిశ్చయించుకుంది. తన ముగ్గురు కుమార్తెలను కాలువలో తోసి తనూ దూకేసింది. ఆర్థిక ఇబ్బందులతో మరో ఇల్లాలు తీవ్ర మనోవేదనకు లోనయ్యింది. తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తనూ సేవించింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటనలు తమిళనాడు వ్యాప్తంగా సంచలనమయ్యాయి. బంధువుల ఆర్తనాదాలు చూపరులకు కన్నీళ్లు తెప్పించాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్యానికి బానిసైన భర్తతో విసిగిపోయిన ఒక ఇల్లాలు ముగ్గురు కుమార్తెలతో కలిసి పంటకాలువలోకి దూకేసింది. భర్తను కోల్పోయిన మరో ఇల్లాలు ఆర్థి క ఇబ్బందులతో సతమతమై తన ముగ్గురు కుమార్తెలతో కలిసి విషం తాగేసింది. ఈ రెండు దయనీయ సంఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఇద్దరు విషమపరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ దయనీయ ఉదంతాల వివరాలు ఇలా ఉన్నాయి. కడలూరు జిల్లా విరుదాచలానికి చెందిన మణికంఠన్ (38), సత్యవతి (29) దంపతులకు ఆంజియ (6), నందిని (4), దర్షిణి (2) అనే ముగ్గురు కుమార్తెలున్నారు. వీరిలో అక్షయ, నందిని సమీపంలోని ప్రయివేటు పాఠశాలలో చదువుతున్నారు. మణికంఠన్‌మద్యానికి బానిసకావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకునేవి. గత 24న ఇదే రీతిలో ఇద్దరూ గొడవపడగా సత్యవతి ముగ్గురు కుమార్తెలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. సత్యవతికి ఆమె తల్లి నచ్చజెప్పి బుధవారం ఉదయం బస్సు ఎక్కించి భర్త వద్దకు పంపించింది. అయితే భర్త వద్దకు వెళ్లడం ఇష్టంలేని సత్యవతి మార్గమధ్యంలోనే పిల్లలతో కలిసి దిగింది. సాయంత్రం ఆరుగంటల సమయంలో సమీపంలోని పంటకాలువలోకి ముగ్గురు కుమార్తెలతో కలిసి దూకేసింది. స్పృహలేని స్థితిలో సత్యవతి ఒడ్డుకు కొట్టుకురాగా అక్షయ, నందిని ప్రాణాలు కోల్పోయారు. గల్లంతమైన దర్షిణి కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. తేనీ జిల్లా బోడినాయగంకు చెందిన వ్యాపారి పాల్పాండి, లక్ష్మి (36) దంపతులకు ప్లస్‌టూ చదువుతున్న అనసూయ (18), 9వ తరగతి చదువుతున్న ఐశ్వర్య (16), 5వ తరగతి చదువుతున్న అక్షయ (10) అనే ముగ్గురు కుమార్తెలున్నారు. అనారోగ్యకారణాలతో పాల్పాండి రెండేళ్ల క్రితం మరణించాడు. కుట్టుమిషన్‌పెట్టుకుని అరకొర సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అనసూయను ఆర్థికపరమైన ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైన అనసూయ గురువారం ఉదయం 7 గంటల సమయంలో కాఫీలో విషపూరితమైన మందు కలిపి ముగ్గురు కుమార్తెలకు ఇచ్చి తాను తాగేసింది. పొద్దుపోయినా ఎంతకూ వారు బయటకు రాకపోవడంతో అనుమానించిన ఇరుగూపొరుగూ తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లగా ప్రాణాపాయ స్థితిలో నలుగురూ నేలపై విలవిల కొట్టుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తల్లీ కుమార్తెలను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలొ చికిత్స పొందుతూ అనసూయ, ఐశ్వర్య ప్రాణాలు విడిచారు. తల్లి లక్ష్మి, మరో కుమార్తె అక్షయ విషమపరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. -
వేధింపులే ప్రాణాలు తీశాయా?
కర్ణాటక, మైసూరు : చామరాజనగర జిల్లా గుండ్లుపేటె వద్ద మైసూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుటుంబ సభ్యులను చంపి తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ప్రత్యేక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం హత్య, ఆత్మహత్యలా అనే అనుమానాలు కూడా ఉన్నాయన్నారు. అండర్ వరల్డ్ డాన్ల వేధింపులను తట్టుకోలేకనే ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులతో పాటు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కమిషనర్ బాలకృష్ణ నేతృత్వంలో పోలీసుల బృందం నగరంలోని దట్టగళ్లిలో ఉన్న ఓం ప్రకాశ్ ఇంటికి వచ్చి ఆయన సోదరి సమక్షంలో ఓం ప్రకాశ్ ఇంటి తలుపులు తెరిచి పరిశీలన చేశారు. అయితే ఇంటిలో బట్టలు మూటలు కట్టి ఉన్నాయి. ఇల్లు ఖాళీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఓం ప్రకాశ్ సెల్‌ఫోన్‌కు వచ్చిన నెంబర్లను పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రోదిస్తున్న స్నేహితులు రోదనల మధ్య అంత్యక్రియలు : ఓం ప్రకాశ్‌తో పాటు మిగతా ఐదు మృతదేహాలను ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం దట్టగహళ్లిలోని నివాసానికి తీసుకువచ్చారు. విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసి బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. అనంతరం చాముండి కొండ లోయవద్ద ఉన్న çస్మశాన వాటికలో సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు. -
కాపాడాల్సినోడే కాల్చిచంపాడు
తల్లిదండ్రులకు, కట్టుకున్నామెకు కష్టమొస్తే అండగా ఉండి జీవితం పంచాల్సిన వ్యక్తి ఏవో కారణాలకు కసాయిగా మారిపోయాడు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందన్న విచక్షణ మరచి తుపాకీకి బలిచ్చాడు. అతడు తుపాకీ తీయగానే వృద్ధ తల్లిదండ్రులు, భార్య, కొడుకు ఎంత విలవిలలాడి ఉంటారో? వ్యాపారంలో నష్టాలనే కారణంతోరక్తపాతానికి ఒడిగట్టాడు. సాక్షి, బెంగళూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేటె వద్ద శుక్రవారం ఉదయం ఘోర విషాదం వెలుగుచూసింది. మైసూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుటుంబ సభ్యులను పిస్టల్‌తో చంపి తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు, అప్పుల భారమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలంలోఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ హెచ్డీ ఆనందకుమార్ తెలిపారు. వ్యాపారంలో రాణించి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరు చెందిన నాగరాజ భట్టాచార్య తనయుడు ఓంకార్‌ప్రసాద్ (38) మైసూరులో స్థిరపడ్డాడు. ఐటీ, స్థిరాస్థి, గనులు తదితర వ్యాపారాలు సాగించిన ఓంకార్ దండిగా ఆర్జించాడు. అయితే కొంతకాలంగా వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో దిక్కుతోచలేదు. తాను చనిపోతే కుటుంబసభ్యులు దిక్కులేని వాళ్లవుతారని భావించి వాళ్లని చంపి తాను చనిపోవాలనే నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో సమీపంలో ఉండే గుండ్లుపేటెలో లాడ్జిలో కుటుంబంతో దిగాడు. గురువారం అర్ధరాత్రి దాటిన సమయంలో సమీపంలోని ఫాంహౌస్ వద్దకెళ్లారు. అక్కడ తల్లిదండ్రులు నాగరాజ భట్టాచార్య (65), తల్లి హేమ (60), భార్య నిఖిత (28), కొడుకు ఆర్య కృష్ణ(4) ను కాల్చి తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతసేపటికి వారి కారు డ్రైవర్ వచ్చి గమనించగా అందరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. తెల్లవారుజామున 3–4 గంటల సమయంలో సంఘటన జరిగి ఉంటుందని ఎస్పీ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటనాస్థలంలో మృతదేహాలు ఆ గన్ సెక్యూరిటీ గార్డుది డేటా బేస్ కంపెనీ నిర్వహిస్తున్న ఓంకార్ అలియాస్ ఓం ప్రకాశ్ నలుగురు గన్మెన్ల ను నియమించుకున్నాడు. రియల్ఎస్టేట్, నగదు లావాదేవీలతో రాజభోగం అనుభవించేవాడు. గన్‌మెన్‌గా ఉన్న మాజీ సీఆర్పీఎఫ్ జవాన్ నాగరాజు వద్ద లైసెన్స్డ్ పిస్టల్ ఉంది. టూర్‌కు వెళ్తున్నా, భద్రత కోసమని దానిని ఓంకార్ తీసుకున్నాడు. అందులో 12 బుల్లెట్లు ఉండగా.. ఆరు ఉపయోగించాడు. కుటుంబసభ్యులు న లుగురితో పాటు తాను కాల్చుకోగా.. మరో బుల్లెట్‌ను గాల్లోకి కాల్చినట్లు భావిస్తున్నారు. నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు అదన పు ఎస్పీ అనిత తెలిపారు. -
ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య
-
ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య
కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాలేరు జలాశయానికి అనుసంధానంగా ఉన్న జలవిద్యుత్ కేంద్రం కాలువలో దూకి ఆరుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జీళ్ల చెరువు గ్రామానికి చెందిన షేక్ పెంటూ సాహెబ్(50), షేక్ మహబూబ్‌బీ(45), వీరి కుమారుడు షేక్ సలీం(32), సలీం భార్య రజియా(28), వీరి పిల్లలు షహనాజ్ బేగం(8) నస్రీనా (4) బుధవారం తెల్లవారుజామున కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరితో పాటు ఆత్మహత్య చేసుకుందామని వచ్చిన షేక్ లాలూ భయపడి ఆ ఆలోచన విరమించుకుని గ్రామానికి వెళ్లి విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పాలేరు జలాశయం మత్స్యకారులు మృతదేహాలను నీటిలో నుంచి వెలికి తీశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రఘు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాదం నెలకొంది.