మీర్‌పేట: మూఢ నమ్మకాలకు ఓ కుటుంబ బలైంది. తమ అనారోగ్యానికి చేతబడులే కారణమని భావించి, దేవాలయాల చుట్టూ తిరగడానికి భారీగా ఖర్చు చేసి చివరకు నలుగురు కుటుంబ సభ్యులూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... వికారాబాద్ జిల్లా, దరూర్ మండలం, డోర్నాల గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, సువర్ణబాయి భార్యభర్తలు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు మరణించగా.. సువర్ణబాయి (55) తన కుమారులు హరీష్‌రావు (30), గిరీష్‌రావు (27), కుమార్తె స్వప్నలతో (23) కలిసి 2007లో నగరానికి వలసవచ్చారు. తొలుత కొన్నాళ్లు శాలిబండలోని తన బంధువుల ఇంట్లో ఉన్నారు. రెండేళ్ల క్రితం మీర్‌పేటలోని అల్మాస్‌గూడ బీఎస్‌ఆర్ కాలనీలోని శ్రీసాయితేజ హైట్స్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. హరీష్‌రావు, గిరీష్‌రావు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరు అందుకు చేతబడే కారణమని నమ్ముతూ దానికి నివృత్తి అంటూ భారీగా ఖర్చు చేశారు. వైద్య ఖర్చులకూ మరికొంత ఖర్చు చేయడంతో ఆస్తులు కరిగిపోయాయి. ఎట్టకేలకు జీవితంపై విరక్తి చెందిన ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. (మ‘రుణ’ మృదంగం!)
సూసైడ్ నోట్ రాసిన వీరు బుధవారం ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రం 5–6 గంటల మధ్యలో తొలుత హరీష్‌రావు తన తల్లి, సోదరుడు, సోదరిలు ఒకరి తర్వాత ఒకరుగా బెడ్‌రూమ్‌లో ఫ్యానుకు ఉరివేసుకుని చనిపోయారు. ఒకరి తర్వాత ఒకరు బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోగా... హరీష్‌రావు వీరందరి మృతదేహాలను కిందకి దింపి తల్లిది బెడ్ పైన, సోదరుడు, సోదరిలను నేల మీద పడుకోబెట్టాడు. అనంతరం హాల్‌లోకి వెళ్లిన హరీష్‌రావు అక్కడి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అంచనా వేస్తున్నారు. చనిపోయే ముందు వీరు తమ ఇంటి ప్రధాన ద్వారం డోర్‌పై ‘ఈ డోర్ తెరవండి’ అని రాసిన పేపర్‌ను అతికించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో దీనిని చూసిన స్థానికులు తలుపులు తోయగా తెరుచుకున్నాయి. దీంతో ఆత్మహత్యల విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇంట్లోని అల్మారాలోని గోడకు ఆనుస్తూ ‘ఈ లేఖ చదవండి’ అంటూ ఓ అట్ట ముక్కపై రాసి పెట్టారు. దానికి సమీపంలో ఉన్న రెండు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న నలుగురూ ఉమ్మడిగా రాసినట్లు ఉన్న ఆ లేఖలోని ముఖ్యాంశాలు ఇవీ...
మా మృతదేహాలకు పోస్టుమార్టం వద్దు
‘మమ్మల్ని క్షమించండి. చేతబడి శక్తుల చేత ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడి వేరే దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం. మా వస్తువుల్ని గ్రామవాసులకు లేదా ఎవరికి కావాలంటే వారికి ఇవ్వండి. మమ్మల్ని హాస్పిటల్‌కు తీసుకుపోవద్దు... పోస్టుమార్టం చేయవద్దు. ఇదే మా ఆఖరి కోరిక. డైరెక్టుగా మమ్మల్ని అంత్యక్రియలకు తీసుకెళ్లండి. మాతో పాటు మా నాన్న గారి ఫొటో, మా పప్పీ (కుక్క పిల్ల) ఫొటో, బ్యాగ్‌లోని సామానులు కాల్చేయండి. మేము ఎన్నో దేవుళ్ల వద్దకు తిరిగినా తక్కువ కాకపోవడంతో ఈ విధంగా చేసుకుంటున్నాం. మా దగ్గర ఉన్న డబ్బు దేవుళ్ల వద్దకు తిరగడానికి, మందులకు ఖర్చయిపోయింది. ఈ బాధల వలన సొంత ఇల్లు, ప్లాట్స్, గోల్డ్ ఖర్చయిపోయాయి. ఉద్యోగం వదులుకోవడంతో పాటు మేము ఎవరమూ పెళ్ళి కూడా చేసుకోలేదు. ఈ ఉత్తరాన్ని మా నలుగురి ఆమోదంతో రాస్తున్నాం.’ ఈ లేఖను ‘నోట్’ అని పేర్కొంటూ వేర్వేరు పేరాలుగా రాశారు. ఒక్కో దాంట్లో ఒక్కో అంశంతో పాటు తమ గ్రామస్తులు, గ్రామ పెద్దల పేర్లు, వారి ఇంట్లోని వస్తువుల జాబితా పొందుపరిచారు. నగరంలోని తమ సమీప బంధువుల పేర్లు, అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు రాశారు. తమ గ్రామానికి చెందిన నలుగురితో పాటు గ్రామ ప్రజలు తమ ముఖాలు చూసి, అంత్యక్రియలు చేయాలంటూ అందులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment