ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుంటున్న శ్రీనివాస్
దోమ( వికారబాద్): నెలరోజుల క్రితం తన తండ్రి మరణధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసినా అధికారులు నిర్లక్ష్యంతో ఇవ్వలేదని మనోవేదనకు గురైన ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘంన శుక్రవారం దోమ మండల పరిషత్ కార్యాలయం ఎదుట జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని రాకొండ గ్రామానికి చెందిన బండి నర్సింలు రెండు నెలల క్రితం మరణించాడు.
ఆయనకు భార్యలు సాయమ్మ, బాబమ్మ ఉన్నారు. సాయమ్మ వివాహమైన రెండు నెలలకు భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోవడంతో నర్సింలు బాబమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొడుకు శ్రీనివాస్ తండ్రి మరణ «ధ్రువీకరణపత్రం కోసం జనవరి 25న పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేశాడు. నెలరోజులు గడుస్తున్నా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై శుక్రవారం అతడు కుటుంబీకులతో కలిసి వచ్చి ఎంపీడీఓ జయరాంను కలిస్తే ఇష్టానుసారంగా మాట్లాడారని శ్రీనివాస్ ఆరోపించాడు.
అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డెత్ సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు మండల పరిషత్ కార్యాలయం నుంచి కదిలేదిలేదని కుటుంబసభ్యులతో అతడు నిరసనకు దిగాడు. ఎంతకూ ఎంపీడీఓ బయటకు రాకపోవడంతో శ్రీనివాస్ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి వెంటనే అతని వద్ద నుంచి పెట్రోల్ డబ్బాను లాకున్నారు. అంతలోనే ఎంపీడీఓ జయరాం బయటకు వచ్చి శ్రీనివాస్ కుటుంబీకులకు డెత్ సర్టిఫికెట్ అందజేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఉద్దేశపూర్వకంగా ఆలస్యం..
రాకొండ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై తాను ఆర్టీఐకి దరఖాస్తు చేశానని, దీంతోనే అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ అధికారులు ఉద్దేశపూర్వకంగా తన తండ్రి డెత్ సర్టిఫికెట్ ఆలస్యం చేశారని బండి శ్రీనివాస్ తెలిపాడు. సర్పంచ్ భర్త, అతని సోదరుడితో పాటు ఎంపీడీఓ జయరాం కలిసి సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయమై ఎంపీడీఓ జయరాంను వివరణ కోరగా.. శ్రీనివాస్ డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని, రాకొండ పంచాయతీ కార్యదర్శి బదిలీ కావడంతో మరొకరికి బాధ్యతలు అప్పగించామన్నారు. బండి నర్సింలుకు ఇద్దరు భార్యలు ఉండటంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి సర్టిఫికెట్ ఇవ్వాలని కార్యదర్శికి సూచించినట్లు చెప్పారు. బాధితులు పంచాయతీ కార్యదర్శికి ఫామ్ నంబర్ – 2 ఇవ్వకపోవడంతో ఆలస్యం జరిగిందన్నారు. నిబంధనల మేరకు ఫామ్ తీసుకొని సర్టిఫికెట్ అందజేశామని స్పష్టం చేశారు.
కేసు నమోదు
డెత్ సర్టిఫికేట్ కోసం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం నేరమని, దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment