గోపాల్‌పేట సమీపంలో నిర్మిస్తున్న గోదాం
గోపాల్‌పేట : నాణ్యత నవ్వులపాలవుతోంది. పది కాలాలపాటు పదిలంగా.. రైతులకు అందుబాటులో ఉండాల్సిన ధాన్యం గోదాం నిర్మాణ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. సుమారు 5వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం నిల్వచేసే సామర్థ్యంతో మండల కేంద్రంలో రూ.3కోట్ల వ్యయంతో గోదాంను నిర్మిస్తున్నారు.
అందులో రూ.1.50కోట్ల వ్యయంతో ఐరన్ పైకప్పు, మరో రూ.1.50కోట్లు వెచ్చించి గోడలు నిర్మిస్తున్నారు. పనులు సగానికిపైగా పూర్తికావస్తున్నా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కాంట్రాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో సూపర్‌వైజర్ ఇష్టానుసారంగా పనులు చేయిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
నాణ్యతలేని ఇటుకలు, రాతిపొడి
నిర్మాణాకి నాణ్యత లేని ఇటుకలు, రాతిపొడిని వాడుకుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. సమీపంలోని వ్యవసాయ బావి నుంచి నల్లాపైపు సాయంతో నామమాత్రంగా నీళ్లుపడుతూ క్యూరింగ్ చేస్తున్నారు. నీళ్లు సమపాళ్లలో పారకపోవడంతో గోడలు తడవడం లేదు. చుట్టుపక్కల లభించే నాణ్యత లేని ఇసుకలో తక్కువ మోతాదులో సిమెంట్‌ను కలిపి పనులు చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ అధికారులు అటువైపు వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి.
రైతులకు భరోసా
ఉమ్మడి గోపాల్‌పేట మండలంలో ఖరీఫ్, రబీ సీజన్‌లో ఎక్కువగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, జొన్నలు, కందులు పండిస్తారు. గతేడాది మాత్రం వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పత్తి పండించారు. ఒక సీజన్‌లో టన్నులకొద్దీ ధాన్యం పండించినా నిల్వచేసేందుకు గోదాంలు లేవు. గోదాంలు ఉంటే అందులో నిల్వచేసుకుని ఆశించిన ధర వచ్చిన సమయంలో అమ్ముకోవడానికి వీలుండేది. గతంలో బుద్దారం, రేవల్లిలో రైతులు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్నారు.
ప్రస్తుతం రేవల్లి గోదాములో వ్యవసాయ శాఖ వారు ఎరువులను నిల్వచేస్తున్నారు. బుద్దారంలో ఉన్న గోదాం శిథిలావస్థలో ఉంది. ప్రస్తుతం గోపాల్‌పేట మండల కేంద్రంలో రూ.మూడు కోట్ల వ్యయంతో గోదామును నిర్మిస్తున్నారు. దీన్ని ఖరీఫ్ నాటికి పూర్తిచేస్తే రైతులు ధాన్యం నిల్వచేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రైతుబంధు పథకం రుణం పొందే అవకాశం ఉంది.
పర్యవేక్షిస్తున్నాం..
ఈ విషయమై మార్కెటింగ్ డీఈ నాగేంద్ర ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. తమ పర్యవేక్షణలోనే గోదాం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రెగ్యులర్‌గా ఇంజనీర్ వెళ్తున్నాడని, దీనిపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలిస్తారని వెల్లడించారు. పనులు నాణ్యవంతంగా లేకపోతే మళ్లీ చేయిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment