gopalpeta
-
నాణ్యత.. నగుబాటు!
గోపాల్పేట : నాణ్యత నవ్వులపాలవుతోంది. పది కాలాలపాటు పదిలంగా.. రైతులకు అందుబాటులో ఉండాల్సిన ధాన్యం గోదాం నిర్మాణ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. సుమారు 5వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం నిల్వచేసే సామర్థ్యంతో మండల కేంద్రంలో రూ.3కోట్ల వ్యయంతో గోదాంను నిర్మిస్తున్నారు. అందులో రూ.1.50కోట్ల వ్యయంతో ఐరన్ పైకప్పు, మరో రూ.1.50కోట్లు వెచ్చించి గోడలు నిర్మిస్తున్నారు. పనులు సగానికిపైగా పూర్తికావస్తున్నా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కాంట్రాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో సూపర్వైజర్ ఇష్టానుసారంగా పనులు చేయిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతలేని ఇటుకలు, రాతిపొడి నిర్మాణాకి నాణ్యత లేని ఇటుకలు, రాతిపొడిని వాడుకుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. సమీపంలోని వ్యవసాయ బావి నుంచి నల్లాపైపు సాయంతో నామమాత్రంగా నీళ్లుపడుతూ క్యూరింగ్ చేస్తున్నారు. నీళ్లు సమపాళ్లలో పారకపోవడంతో గోడలు తడవడం లేదు. చుట్టుపక్కల లభించే నాణ్యత లేని ఇసుకలో తక్కువ మోతాదులో సిమెంట్‌ను కలిపి పనులు చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ అధికారులు అటువైపు వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. రైతులకు భరోసా ఉమ్మడి గోపాల్పేట మండలంలో ఖరీఫ్, రబీ సీజన్లో ఎక్కువగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, జొన్నలు, కందులు పండిస్తారు. గతేడాది మాత్రం వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పత్తి పండించారు. ఒక సీజన్లో టన్నులకొద్దీ ధాన్యం పండించినా నిల్వచేసేందుకు గోదాంలు లేవు. గోదాంలు ఉంటే అందులో నిల్వచేసుకుని ఆశించిన ధర వచ్చిన సమయంలో అమ్ముకోవడానికి వీలుండేది. గతంలో బుద్దారం, రేవల్లిలో రైతులు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం రేవల్లి గోదాములో వ్యవసాయ శాఖ వారు ఎరువులను నిల్వచేస్తున్నారు. బుద్దారంలో ఉన్న గోదాం శిథిలావస్థలో ఉంది. ప్రస్తుతం గోపాల్పేట మండల కేంద్రంలో రూ.మూడు కోట్ల వ్యయంతో గోదామును నిర్మిస్తున్నారు. దీన్ని ఖరీఫ్ నాటికి పూర్తిచేస్తే రైతులు ధాన్యం నిల్వచేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రైతుబంధు పథకం రుణం పొందే అవకాశం ఉంది. పర్యవేక్షిస్తున్నాం.. ఈ విషయమై మార్కెటింగ్ డీఈ నాగేంద్ర ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. తమ పర్యవేక్షణలోనే గోదాం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రెగ్యులర్‌గా ఇంజనీర్ వెళ్తున్నాడని, దీనిపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలిస్తారని వెల్లడించారు. పనులు నాణ్యవంతంగా లేకపోతే మళ్లీ చేయిస్తామని చెప్పారు. -
‘ఆంగ్లం’ బోధించలేం!
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో ఇంగ్లిష్ విద్య ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఓ పక్క కృషి చేస్తుంటే.. మరో పక్క ఉన్న సక్సెస్ స్కూల్లో ఆంగ్లం బోధించలేమంటూ ఉపాధ్యాయులు తేల్చిచెబుతున్నారు. డబుల్ ప్యాట్రన్ లేకపోయినా ఇన్నాళ్లూ పాఠశాలను నెట్టుకొచ్చాం.. ఇక మా వల్లకాదని చేతులెత్తేశారు ఏదుట్ల పాఠశాల ఉపాధ్యాయులు. - గోపాల్పేట మండలంలో రెండు సక్సెస్ స్కూళ్లు ఉండగా ఏదుట్ల హైస్కూల్లో ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియం అడ్మిషన్లు తీసుకోవడానికి ఉపాధ్యాయులు నిరాకరిస్తున్నారు. ఎనిమిదేళ్ల నుంచి కొనసాగుతు న్న ఆంగ్ల బోధనను ఉన్నపలంగా నిలిపివేస్తే మా పిల్లల భవిష్యత్ ఏం కావాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుండగా ప్రస్తుతం సక్సెస్ స్కూ ల్లో తె లుగు, ఇంగ్లిష్ మీడియంలో మొత్తం 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క ఇంగ్లిష్‌లోనే 122 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొత్తగా 6వ తరగతిలో ప్రవేశం కోసం 54 మంది విద్యార్థులు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇందులో స గం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చేరడానికే ఇష్టపడుతున్నారు. అ యితే ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియం కొనసాగిస్తే తమపై అదనపు భారం పడుతుందని ఉపాధ్యాయులు ఇందుకు ఇష్టపడడం లేదు. వచ్చిన విద్యార్థులను తె లుగు మీడియంలో చేర్చుకోవడానికి సిద్ధమవగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. మేం ఒప్పుకోం : గ్రామస్తులు ఎప్పటిలాగే సక్సెస్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియం కొనసాగించాల్సిందేనని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సర్పంచ్ నారాయణయాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పలుమార్లు ఉపాధ్యాయులను నిలదీశారు. ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులను ఎందుకు చేర్చుకోవడం లేదని జీహెచ్ఎం సీఎస్ రాజును ప్రశ్నించారు. అలాగే ఎమ్మెల్యేతోపాటు ఎంఈఓలకు వినతిపత్రాలు కూడా అందించారు. ఇన్నాళ్లు బాగానే బోధించిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మాలాంటి పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో వేలల్లో ఫీజులు చెల్లించి ఇంగ్లీష్ చదుకోలేరని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామంటే అవకాశం ఇవ్వడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఉపాధ్యాయులు అవసరం ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు తమపై అదనపు భారం పడుతుందని ఇంగ్లిష్ మీడియంపై ఆసక్తి కనబరచడంలేదు. డిప్యూటేషన్‌పై ఇద్దరు ఉపాధ్యాయులుకాని, విద్యావలంటీర్లను గాని ఏర్పాటు చేస్తే ఇంగ్లిష్ మీడియం కొనసాగించడానికి సాధ్యమవుతుంది. - రాజు, జీహెచ్ఎం, ఏదుట్ల పాఠశాల నా పరిధిలో లేదు ఏదుట్ల సెక్సెస్ హైస్కూల్లో ఇంగ్లీష్ మీడియం కొనసాగాలంటే ఉపాధ్యాయులు అవసరం. వారి నియామకం నా పరిధిలో లేదు. గ్రామస్తులు సహకరించి ఇద్దరు విద్యా వలంటీర్లను నియమించడానికి ఆర్థికంగా సహకరిస్తే ఇంగ్లిష్ మీడియం కొనసాగే వీలుంది. - సరస్వతీబాయి, ఎంఈఓ, గోపాల్పేట -
నిలిచిన ‘రామన్‌పాడు’ నీళ్లు
గోపాల్పేట: రామన్‌పాడు నీళ్లు మరోసారి నిలిచిపోయాయి. రక్షిత తాగునీటి పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఆదివారం రెండోరోజు సమ్మెబాట పట్టడంతో సుమారు 120 గ్రామాలకు సరఫరాకు బ్రేక్‌పడింది. వేతన బకాయిలు చెల్లించకపోవడంతో కార్మికులు చేసేదిలేక శుక్రవారం అర్ధరాత్రి నుంచి రామన్‌పాడు, గోపాల్పేట పంప్‌హౌస్‌ల్లో మోటార్లను ఆపివేసి విధులు బహిష్కరించారు. శనివారం కాంట్రాక్టర్ రాజశేఖర్ రూ.14 లక్షల చెక్కు ఇచ్చినా నగదు రూపంలో చెల్లించే దాకా సమ్మె కొనసాగిస్తామని కార్మికులు స్పష్టంచేశారు. దీంతో రెండుచోట్ల పంప్‌హౌస్‌లు మూతపడ్డాయి. మరోమారు కాంట్రాక్టర్ కార్మికసంఘం నాయకులతో చర్చించి సోమవారం నాటికి జీతాలు అందజేస్తామని నచ్చజెప్పారు. అయినా వారు వినకపోవడంతో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, డీఈతో చర్చించారు. నాలుగు నెలల వేతనాలకు గాను మార్చి మినహా ఏప్రిల్ నుంచి జూన్ వరకు చెల్లించనున్నట్లు డీఈ రాములుగౌడ్ తెలిపారు. కాంట్రాక్టర్ కాలపరిమితి మార్చితో ముగియడం, కొత్త టెండర్లు దాఖలయ్యే వరకు అతనికే మరో మూణ్నెళ్లు పొడగించామన్నారు. ఈ ఒప్పందం ఆలస్యమవడంతో సకాలంలో బిల్లు చేయలేకపోయామన్నారు. ‘రామన్‌పాడు’ ఉద్యోగుల ఆందోళన కొత్తకోట రూరల్ : నాలుగు నెలల వేతనం వెంటనే చెల్లించాలంటూ రామన్‌పాడు రక్షితనీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు ఆదివారం ఆందోళన చేపట్టారు. రామన్‌పాడు పరిధిలోని అచ్చంపేట పంప్వద్ద కూర్చుని కాంట్రాక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు ఆనంద్‌గౌడ్, అశోక్ మాట్లాడుతూ.. వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో వరుసగా మూడురోజుల సమ్మె అనంతరం ఈ నెల 5వ తేదీలోగా వేతనాలు అందజేస్తామని కాంట్రాక్టర్ అంగీకరించి ఆ తర్వాత పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినా తమకేమీ సంబంధం లేదంటున్నారని విచారం వ్యక్తం చేశారు. తమ సమ్మెతో ఇప్పటికే అచ్చంపేట, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని 120 గ్రామాలకు ‘రామన్‌పాడు’ తాగునీరు నిలిచిపోయిందన్నారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన బకాయి వేతనాలు, పెంచిన వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సిబ్బంది సత్యనారాయణ, కృష్ణయ్య, శేఖర్, మాసన్న, రమేష్, పాల్గొన్నారు.