నిలిచిన ‘రామన్‌పాడు’ నీళ్లు
గోపాల్‌పేట: రామన్‌పాడు నీళ్లు మరోసారి నిలిచిపోయాయి. రక్షిత తాగునీటి పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఆదివారం రెండోరోజు సమ్మెబాట పట్టడంతో సుమారు 120 గ్రామాలకు సరఫరాకు బ్రేక్‌పడింది. వేతన బకాయిలు చెల్లించకపోవడంతో కార్మికులు చేసేదిలేక శుక్రవారం అర్ధరాత్రి నుంచి రామన్‌పాడు, గోపాల్‌పేట పంప్‌హౌస్‌ల్లో మోటార్లను ఆపివేసి విధులు బహిష్కరించారు.
శనివారం కాంట్రాక్టర్ రాజశేఖర్ రూ.14 లక్షల చెక్కు ఇచ్చినా నగదు రూపంలో చెల్లించే దాకా సమ్మె కొనసాగిస్తామని కార్మికులు స్పష్టంచేశారు. దీంతో రెండుచోట్ల పంప్‌హౌస్‌లు మూతపడ్డాయి. మరోమారు కాంట్రాక్టర్ కార్మికసంఘం నాయకులతో చర్చించి సోమవారం నాటికి జీతాలు అందజేస్తామని నచ్చజెప్పారు. అయినా వారు వినకపోవడంతో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, డీఈతో చర్చించారు. నాలుగు నెలల వేతనాలకు గాను మార్చి మినహా ఏప్రిల్ నుంచి జూన్ వరకు చెల్లించనున్నట్లు డీఈ రాములుగౌడ్ తెలిపారు. కాంట్రాక్టర్ కాలపరిమితి మార్చితో ముగియడం, కొత్త టెండర్లు దాఖలయ్యే వరకు అతనికే మరో మూణ్నెళ్లు పొడగించామన్నారు. ఈ ఒప్పందం ఆలస్యమవడంతో సకాలంలో బిల్లు చేయలేకపోయామన్నారు.
‘రామన్‌పాడు’ ఉద్యోగుల ఆందోళన
కొత్తకోట రూరల్ : నాలుగు నెలల వేతనం వెంటనే చెల్లించాలంటూ రామన్‌పాడు రక్షితనీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు ఆదివారం ఆందోళన చేపట్టారు. రామన్‌పాడు పరిధిలోని అచ్చంపేట పంప్‌వద్ద కూర్చుని కాంట్రాక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు ఆనంద్‌గౌడ్, అశోక్ మాట్లాడుతూ.. వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గత నెలలో వరుసగా మూడురోజుల సమ్మె అనంతరం ఈ నెల 5వ తేదీలోగా వేతనాలు అందజేస్తామని కాంట్రాక్టర్ అంగీకరించి ఆ తర్వాత పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినా తమకేమీ సంబంధం లేదంటున్నారని విచారం వ్యక్తం చేశారు. తమ సమ్మెతో ఇప్పటికే అచ్చంపేట, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని 120 గ్రామాలకు ‘రామన్‌పాడు’ తాగునీరు నిలిచిపోయిందన్నారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన బకాయి వేతనాలు, పెంచిన వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సిబ్బంది సత్యనారాయణ, కృష్ణయ్య, శేఖర్, మాసన్న, రమేష్, పాల్గొన్నారు.