qualityless
-
నాణ్యత.. నగుబాటు!
గోపాల్పేట : నాణ్యత నవ్వులపాలవుతోంది. పది కాలాలపాటు పదిలంగా.. రైతులకు అందుబాటులో ఉండాల్సిన ధాన్యం గోదాం నిర్మాణ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. సుమారు 5వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం నిల్వచేసే సామర్థ్యంతో మండల కేంద్రంలో రూ.3కోట్ల వ్యయంతో గోదాంను నిర్మిస్తున్నారు. అందులో రూ.1.50కోట్ల వ్యయంతో ఐరన్ పైకప్పు, మరో రూ.1.50కోట్లు వెచ్చించి గోడలు నిర్మిస్తున్నారు. పనులు సగానికిపైగా పూర్తికావస్తున్నా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కాంట్రాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో సూపర్వైజర్ ఇష్టానుసారంగా పనులు చేయిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతలేని ఇటుకలు, రాతిపొడి నిర్మాణాకి నాణ్యత లేని ఇటుకలు, రాతిపొడిని వాడుకుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. సమీపంలోని వ్యవసాయ బావి నుంచి నల్లాపైపు సాయంతో నామమాత్రంగా నీళ్లుపడుతూ క్యూరింగ్ చేస్తున్నారు. నీళ్లు సమపాళ్లలో పారకపోవడంతో గోడలు తడవడం లేదు. చుట్టుపక్కల లభించే నాణ్యత లేని ఇసుకలో తక్కువ మోతాదులో సిమెంట్‌ను కలిపి పనులు చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ అధికారులు అటువైపు వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. రైతులకు భరోసా ఉమ్మడి గోపాల్పేట మండలంలో ఖరీఫ్, రబీ సీజన్లో ఎక్కువగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, జొన్నలు, కందులు పండిస్తారు. గతేడాది మాత్రం వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పత్తి పండించారు. ఒక సీజన్లో టన్నులకొద్దీ ధాన్యం పండించినా నిల్వచేసేందుకు గోదాంలు లేవు. గోదాంలు ఉంటే అందులో నిల్వచేసుకుని ఆశించిన ధర వచ్చిన సమయంలో అమ్ముకోవడానికి వీలుండేది. గతంలో బుద్దారం, రేవల్లిలో రైతులు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం రేవల్లి గోదాములో వ్యవసాయ శాఖ వారు ఎరువులను నిల్వచేస్తున్నారు. బుద్దారంలో ఉన్న గోదాం శిథిలావస్థలో ఉంది. ప్రస్తుతం గోపాల్పేట మండల కేంద్రంలో రూ.మూడు కోట్ల వ్యయంతో గోదామును నిర్మిస్తున్నారు. దీన్ని ఖరీఫ్ నాటికి పూర్తిచేస్తే రైతులు ధాన్యం నిల్వచేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రైతుబంధు పథకం రుణం పొందే అవకాశం ఉంది. పర్యవేక్షిస్తున్నాం.. ఈ విషయమై మార్కెటింగ్ డీఈ నాగేంద్ర ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. తమ పర్యవేక్షణలోనే గోదాం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రెగ్యులర్‌గా ఇంజనీర్ వెళ్తున్నాడని, దీనిపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలిస్తారని వెల్లడించారు. పనులు నాణ్యవంతంగా లేకపోతే మళ్లీ చేయిస్తామని చెప్పారు. -
నాణ్యతకు తిలోదకాలు.!
తాండూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం తాండూర్ మండలంలో అభాసుపాలవుతుంది. ఇష్టారీతిన, నిబంధనలు పాటించకుండా ట్యాంక్‌ల నిర్మాణం చేపడుతుండడంతో ప్రభుత్వ చేరేలా కనిపించడం లేదు. ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణంలో నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని ఏడు పంచాయతీల పరిధిలో ప్రభుత్వం మిషన్ భగీరథ పనులు చేపట్టింది. మొత్తం 49 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణంతో పాటు పైప్‌లైన్ నిర్మాణ పనులను ప్రారంభించింది. 49 నీటి ట్యాంకులలో ఇప్పటికీ 15 ట్యాంకుల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఈ 15లో ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదు. పనుల్లో కనిపించని నాణ్యత... ట్యాంకుల నిర్మాణ పనులు నాణ్యత లేకుండా సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం ఇసుక వాడకం, క్యూరింగ్ సరిగా చేపట్టడం లేదు. దీంతో నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనబడుతుంది. నిర్మాణ పనులకు కాం ట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే సాకుతో అధికారులు సైతం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు బాహటంగా విమర్శిస్తున్నారు. పనుల్లో నాణ్య త పాటించక పోవడం, క్యూరింగ్ చేపట్టక పోవడంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేసిన సంఘటనలు ఉన్నా యి. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. అధికారులు నిర్లిప్త ధోరణిని అవలంబిస్తుండడంతో ప నులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేకు ఫిర్యాదు.. మిషన్ భగీరథ పథకంలో జరుగుతున్న పనుల్లో నాణ్యత పాటించడం లేదని పేర్కొంటూ కొందరు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి సైతం తీసుకువెళ్లారని సమాచారం. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మండల పరిధిలో రూ.13.81 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపడుతున్నారు. ఇందులో రూ.8.36 కోట్లతో ట్యాంక్‌ల నిర్మాణం, రూ. 6.95 కోట్లతో అంతర్గత పైప్లైన్లు, నల్లా కనెక్షన్ల పనులు చేపడుతున్నారు. ఇంత భారీగా నిధులు వెచ్చించి చేపడుతున్న పనుల్లో నాణ్యత కనిపించ డం లేదు. చివరకు నిధులు దుర్వినియోగమయ్యే అవకాశముందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు పర్యవేక్షణ జరిపి నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరుతున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం మిషన్ భగీరథ ట్యాంక్‌ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. పనుల నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. క్యూరింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. నాసిరకంగా పనులు చేపతితే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. – దివ్య, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, తాండూర్ -
పురుగుల అన్నంపై హాస్టల్ విద్యార్థుల ఆందోళన
వనస్థలిపురం : నాణ్యత లోపించిన భోజనం పెడుతున్నారని హాస్టల్ విద్యార్థులు అందోళనకు దిగిన సంఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో బుధవారం జరిగింది. తమకు నాణ్యమైన భోజనం అందించాల్సి ఉండగా వార్డెన్ అవినీతికి పాల్పడుతూ పురుగుల అన్నం, పాడైన కూరగాయలతో వండిన వంట పెడుతున్నారని బీసీ హాస్టల్ విద్యార్థులు ఆందోళన దిగారు. వార్డెన్ సస్పెండ్ చేయాలని రోడ్డుపై ధర్నా చేశారు. విద్యార్థుల ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. -
30 లారీలు వెనక్కి!
యథేచ్ఛగా నాసిరకం చెనక్కాయల సరఫరా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు అనంతపురం అగ్రికల్చర్ : ఎంతమంది ఎన్ని రకాలుగా ఆదేశాలు జారీ చేసినా.. అనంతపురం జిల్లాకు మాత్రం నాసిరకం చెనక్కాయలు సరఫరా అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే 30 లారీల నాసిరకం కాయలను వెనక్కిపంపారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వల్లే ఈ తంతు యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలున్నాయి. ఈ ఖరీఫ్‌లో పంపిణీ చేయడానికి జిల్లాకు 3.90 లక్షల క్వింటాళ్లు కేటాయించారు. ఇందులో కే-6 రకం 3.10 లక్షల క్వింటాళ్లు, కే-9, ధరణి రకాలు 40 వేల క్వింటాళ్ల చొప్పున ఉన్నాయి. సేకరణ, నిల్వ బాధ్యతలను ఏపీసీడ్స్, మార్క్‌ఫెడ్ సంస్థలకు అప్పగించారు. ఏజెన్సీలు మన జిల్లాతో పాటు కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి విత్తనకాయలను మండల కేంద్రాలకు సరఫరా చేస్తున్నాయి. ఇప్పటికే 1.60 లక్షల క్వింటాళ్లు నిల్వ ఉంచాయి. ఈనెల మూడో వారం నుంచి ఆధార్‌బేస్డ్ బయోమెట్రిక్ పద్ధతిలో పంపిణీ మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు. ఇంకా ధరలు, రాయితీలు ఖరారు కావాల్సివుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా... ఈ సారి నాసిరకానికి తావులేదని మంత్రులు మొదలుకుని కలెక్టర్, జేడీఏ తదితరులు పలుమార్లు ప్రకటనలు గుప్పించారు. అయినా దందా ఆగడం లేదు. చెనక్కాయలు బాగోలేవని 20 మండలాల నుంచి 30 లారీల వరకు వెనక్కిపంపించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతుండటమే ఇందుకు నిదర్శనం. దీనికి సంబంధించి కచ్చితమైన వివరాలు ఇవ్వడానికి అధికారులు వెనకాడుతున్నారు. నిబంధనల మేరకు మొలకశాతం (జర్మినేషన్) 70 శాతం, ఫిజికల్ ప్యూరిటీ 96 శాతం, వ్యర్థాలు 4 శాతం, తేమశాతం 9 వరకు ఉండాలి. కానీ... ఎక్కడా ఈ నిబంధనలు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. నాసిరకాన్ని అరికట్టేందుకు ఈ సారి జిల్లాలోని విత్తనకాయల శుద్ధి కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 10 మంది వ్యవసాయాధికారులను నియమించినా, ఫలితం లేదు. గతంలో నాసిరకం విత్తనకాయలు సరఫరా చేసినా వారిపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ తంతు నిరాటంకంగా కొనసాగుతోంది. ఇదే విషయాన్ని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు పీవీ శ్రీరామమూర్తి దృష్టికి తీసుకెళ్లగా.. ‘నాణ్యతలో రాజీపడవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఇక నుంచి తిప్పి పంపకుండా సీజ్ చేసి కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నా’మని చెప్పారు.