యథేచ్ఛగా నాసిరకం చెనక్కాయల సరఫరా
చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
అనంతపురం అగ్రికల్చర్ : ఎంతమంది ఎన్ని రకాలుగా ఆదేశాలు జారీ చేసినా.. అనంతపురం జిల్లాకు మాత్రం నాసిరకం చెనక్కాయలు సరఫరా అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే 30 లారీల నాసిరకం కాయలను వెనక్కిపంపారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వల్లే ఈ తంతు యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలున్నాయి. ఈ ఖరీఫ్‌లో పంపిణీ చేయడానికి జిల్లాకు 3.90 లక్షల క్వింటాళ్లు కేటాయించారు. ఇందులో కే-6 రకం 3.10 లక్షల క్వింటాళ్లు, కే-9, ధరణి రకాలు 40 వేల క్వింటాళ్ల చొప్పున ఉన్నాయి. సేకరణ, నిల్వ బాధ్యతలను ఏపీసీడ్స్, మార్క్‌ఫెడ్ సంస్థలకు అప్పగించారు. ఏజెన్సీలు మన జిల్లాతో పాటు కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి విత్తనకాయలను మండల కేంద్రాలకు సరఫరా చేస్తున్నాయి. ఇప్పటికే 1.60 లక్షల క్వింటాళ్లు నిల్వ ఉంచాయి. ఈనెల మూడో వారం నుంచి ఆధార్‌బేస్డ్ బయోమెట్రిక్ పద్ధతిలో పంపిణీ మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు. ఇంకా ధరలు, రాయితీలు ఖరారు కావాల్సివుంది.
ఎన్ని చర్యలు తీసుకున్నా...
ఈ సారి నాసిరకానికి తావులేదని మంత్రులు మొదలుకుని కలెక్టర్, జేడీఏ తదితరులు పలుమార్లు ప్రకటనలు గుప్పించారు. అయినా దందా ఆగడం లేదు. చెనక్కాయలు బాగోలేవని 20 మండలాల నుంచి 30 లారీల వరకు వెనక్కిపంపించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతుండటమే ఇందుకు నిదర్శనం. దీనికి సంబంధించి కచ్చితమైన వివరాలు ఇవ్వడానికి అధికారులు వెనకాడుతున్నారు. నిబంధనల మేరకు మొలకశాతం (జర్మినేషన్) 70 శాతం, ఫిజికల్ ప్యూరిటీ 96 శాతం, వ్యర్థాలు 4 శాతం, తేమశాతం 9 వరకు ఉండాలి. కానీ... ఎక్కడా ఈ నిబంధనలు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు.
నాసిరకాన్ని అరికట్టేందుకు ఈ సారి జిల్లాలోని విత్తనకాయల శుద్ధి కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 10 మంది వ్యవసాయాధికారులను నియమించినా, ఫలితం లేదు. గతంలో నాసిరకం విత్తనకాయలు సరఫరా చేసినా వారిపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ తంతు నిరాటంకంగా కొనసాగుతోంది. ఇదే విషయాన్ని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు పీవీ శ్రీరామమూర్తి దృష్టికి తీసుకెళ్లగా.. ‘నాణ్యతలో రాజీపడవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఇక నుంచి తిప్పి పంపకుండా సీజ్ చేసి కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నా’మని చెప్పారు.