
కొత్తకోటలోని విద్యుత్ కార్యాలయం
కొత్తకోట: ఇక నుంచి విద్యుత్ వినియోగదారులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కరెంట్ బిల్లులు చెల్లించలేదని కనెక్షన్ తొలగించాల్సిన పని లేదు. బిల్లులు కట్టండని విద్యుత్ అధికారులు హెచ్చరికలు జారీచేసే పరిస్థితి ఉండదు. సెల్‌ఫోన్ రిచార్జీ మాదిరిగానే విద్యుత్ బిల్లు రీచార్జ్ చేసుకునే నూతన విధానానికి ట్రాన్స్‌కో అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను ముక్కుపిండి వసూలు చేసేందుకే ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ముందు ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుచేసి ఆ తర్వాత ప్రైవేట్ సంస్థల్లో అమలుకు యోచిస్తున్నారు.
బకాయిల వసూలుకు శ్రీకారం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఎక్కువగా పేరుకుపోయాయి. ముఖ్యంగా పంచాయతీకార్యాలయాలు, వీధిలైట్లు, కలెక్టర్, డీఆర్‌ఓ, ఆర్డీఓ, తహసీల్దార్ తదితర కార్యాలయాల బకాయిలు బండగా మారాయి. 1,331 పంచాయతీలు, 3,256 నివాస ప్రాంతాల్లో ఏళ్ల తరబడి విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు కావడంతో విద్యుత్ అధికారులు ఎలాంటి ఒత్తిడి చేయలేకపోతున్నారు. వీటిని ఎలాగైనా వసూలు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
కొంత మేలు.. కొంత నష్టం
ఈ విధానం వస్తే కొంత మేలు జరిగినా అనేక అనార్థాలు వచ్చే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే బిల్లుల కోసం వచ్చే అధికారులతో విద్యుత్ వినియోగదారులు మొరపెట్టుకునేవారు. ఇక అధికారులే రాకపోతే సమస్యలు విన్నవించే అవకాశం ఉండదు. రెక్కాడితే గాని డొక్కాడని పేదలు రీచార్జీ విధానం ద్వారా చీకటి రాత్రులతో కాలం గడిపే పరిస్థితులు వస్తాయి. రీచార్జీ అయిపోయిన నిమిషంలోనే కరెంట్ పోతుంది. ఒకవేళ రాత్రి పూట రీచార్జీ అయిపోతే కరెంట్ ఉండదు. అక్ష్యరాస్యత తక్కువగా ఉన్న పాలమూరు జిల్లాలో ఈ విధానం అత్యంత లోపబూయిష్టంగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 10లక్షల కుటుంబాలు విద్యుత్‌ను వాడుకుంటున్నాయి. ఇందులో లక్షన్నరకు పైగా ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. వీరంతా ఒక బల్బు వేసుకుని సబ్సిడీ పొందుతున్నారు. రీచార్జీ విధానం వీరికి కష్టాలు తెచ్చిపెట్టనుంది.
వ్యవసాయపై ప్రభావం
ఉమ్మడి జిల్లాలో 3.50 లక్షల బోరుబావులు ఉన్నాయి. చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 400 పరిశ్రమలు ఉన్నాయి. ఇంకా ప్రాజెక్టులు, కోళ్లఫారాలు ఇలా అనేక రంగాలు కరెంట్ మీద ఆధారపడి పనిచేస్తున్నాయి. రీచార్జీ కార్డులైతే ఇక స్వీచ్ వేయాలంటేనే చేతులు వణికిపోయే అవకాశం ఉంది. కొత్త పద్ధతులను ఆహ్వానించాలో లేక తిరస్కరించాలో అర్థం కాక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విద్యుత్‌రంగంలో మార్పులు లాభం నష్టమే తెచ్చిపెడతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మొదటగా ప్రభుత్వ కార్యాలయాల్లో..
త్వరలోనే ప్రభుత్వం రీచార్జీ మీటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని ముందుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ విజయవంతమైతే నివాస ఇళ్లు, వ్యాపార సముదాయాలు, వాణిజ్య కంపెనీలకు అందజేయనున్నట్లు తెలుస్తోంది. – రామకృష్ణ, విద్యుత్ ఏఈ, కొత్తకోట
Comments
Please login to add a commentAdd a comment