అలంపూర్‌: అధికార పార్టీలోనే గ్రూపు రాజకీయాలు.. గెలుపు సాధ్యమేనా? | Mahabubnagar: Who Next Incumbent In Alampur Constituency | Sakshi
Sakshi News home page

అలంపూర్‌: సతమతమవుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే... కాంగ్రెస్‌, బీజేపీ ఇలా

Published Tue, Aug 8 2023 5:33 PM | Last Updated on Tue, Aug 29 2023 10:08 AM

Mahabubnagar: Who Next Incumbent in Alampur Constituency - Sakshi

5వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్‌లో గ్రూపు రాజకీయాలు కలవరపెడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరటంతో అక్కడి రాజకీయ ముఖచిత్రం మారుతుంది. ఇక్కడ బీఎస్‌పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ బరిలో దిగుతారనే ప్రచారం జోరందుకోవటంతో బహుముఖపోటీ అనివార్యం కానుంది.

నియోజకవర్గం: అలంపూర్ (ఎస్సీ రిజర్వుడ్)
మండలాల సంఖ్య: 7 (అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, రాజోలి, వడ్డేపల్లి, ఐజ, ఇటిక్యాల )
పెద్ద మండలం: ఐజ
మున్సిపాలిటీలు: అలంపూర్, వడ్డేపల్లి, ఐజ
మొత్తం పంచాయతీలు: 125
అత్యంత ప్రభావితం చూపే పంచాయితీ: ఐజ
మొత్తం ఓటర్ల సంఖ్య:  222463

పురుషులు: 111024 మహిళలు: 111439 

సతమతమవుతున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్  ఎస్సీ రిజర్వు నియోజకవర్గం. అలంపూర్ ఎస్సీ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం వర్గపోరుతో సతమతమవుతున్నారు. సౌమ్యుడిగా పేరున్న ఆయనపై సొంతపార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఘటనలు ఉన్నాయి. గ్రామాలకు వెళ్తే అడ్డుకున్న సందర్భాలు చోటుచేసుకున్నాయి. 2009 ఎన్నికల్లో అబ్రహాం కాంగ్రేస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ రాకపోవటంతో టీడీపీ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ అబ్రహం రెండవ స్దానంలో నిలవగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మంద జగన్నాథం తనయుడు మందా శ్రీనాథ్ మూడవ స్దానానికే పరిమితమయ్యారు. తర్వాత అబ్రహం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచే 2018లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే అదే నియోజకవర్గానికి చెందిన మాజీఎంపీ,ఢిల్లీలో ప్రభుత్వం ప్రత్యేక  ప్రతినిధి మందా జగన్నాథ్ మధ్య విబేధాలు ఉన్నాయి. 

దీంతో నియోజకవర్గాలో రెండు వర్గాలుగా పార్టీ నేతలు, కార్యకర్తలు విడిపోయారు. గెలిచిన కొన్నాళ్లు  ఎమ్మెల్యే అబ్రహాం బాగానే ఉన్నా తర్వాత పార్టీ నేతలు,కార్తకర్తలతో పొసగలేదు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని తమను పట్టించుకోవటం లేదని పలు సందర్భాల్లో బహిరంగంగానే విమర్శించారు. కొన్ని గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలకు వెళ్తే అడ్డుకున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందనే బలమైన ఆరోపణ అయనపై ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో తన వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, కమీషన్లు వసూలు చేస్తున్నారని  స్వంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారు. వందపడకల ఆస్పత్రి అలంపూర్లో కాకుండా చౌరస్తాలో ఏర్పాటు చేయటంతో అక్కడి నేతలు సైతం ఆయనపై గుర్రుగా ఉన్నారు. అయితే అబ్రహాం ఈసారి తన తనయుడు అజయ్ కుమార్‌కు సీటు ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన తండ్రికంటే నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. 

ఇది కూడ పార్టీలోని ఇతర నేతలకు రుచించటం లేదు. ఇక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నీటిమూటలే అయ్యాయని ఆరోపిస్తున్నారు. స్దానికులు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పరిధిలోని వల్లూరు,మల్లంకుంట రిజర్వాయర్ పనులు చేపట్టలేదు. నియోజకవర్గంలో ఒక్కరికి కూడ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ జరగలేదు. తెలంగాణలో ఏకైక శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ ఆలయం అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకురాలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయనపై ఈసారి జనాలు గుర్రుగా ఉన్నారు. ఆయన అనుచరుడు యువజన నాయకుడు  ఆర్.కిశోర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మంద జగన్నాథం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట.. ఇవి తనకు చివరి ఎన్నికలనే ఉద్దేశ్యంతో ఉన్నారట అందుకే ఆయన తన ప్రయత్నాలు తీవ్రం చేసినట్టు ప్రచారం సాగుతుంది.

అధికార పార్టీ కొంపముంచేట్టుగా గ్రూపు రాజకీయాలు
ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతతో పాటు గ్రూపు రాజకీయాలు కొంపముంచే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఇటీవలే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఈయనకు ఎమ్మెల్యే అబ్రహంకు మద్య చాలా గ్యాప్ ఉంది. చల్లా పార్టీలో చేరిన తర్వాత అలంపూర్ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చల్లా ఆశీస్సులు ఉన్నవారికే సీటు వస్తుందని...వారే గెలుస్తారనే నమ్మకం ఉండటంతో ఇప్పుడు నియోజకవర్గంలో అన్ని పార్టీల్లోని తన అనుచరులు, ద్వితీయశ్రేణి నేతలు ఇప్పుడు చల్లా చుట్టు తిరుగుతున్నారు. మరి ఆయన ఎవరికి మద్దతు తెలుపుతాడోననే చర్చ ఆసక్తికరంగా మారింది. అయితే అబ్రహంకు మాత్రం సీటురాకుండా అడ్డుకుంటారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది.

కాంగ్రెస్‌ అలా
2014లో అలంపూర్ నుంచి కాంగ్రేస్ అభ్యర్ది సంపత్‌ మార్ గెలిచారు. 2018లో ఓడిపోయారు.ఆ నియోజకవర్గంలో ఆయనకు పోటీగా సీటుకోసం ప్రయత్నం చేసే నాయకుడు లేకపోవటంతో పాటు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న నేపధ్యంలో ఆయనకు సీటు విషయంలో ఇబ్బంది లేదు. ఇప్పటికే సంపత్కుమార్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎమ్మెల్యే వైఖరిపై విమర్శలు చేస్తూ జనాలను ఆకర్శించే ప్రయత్నంచేస్తున్నారు. కాని చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రేస్ పార్టీ వీడి బీఆర్ఎస్లో చేరటం సంపత్కుమార్కు పెద్దదెబ్బగా భావిస్తున్నారు. పార్టీలో చల్లా అనుచరులు కూడ ఆయన వెంటే వెళ్లటం సంపత్కుమార్కు సంకటంగా మారనుంది. టీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు,ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని సంపత్వర్గీయులు భావిస్తున్నారు. అయితే సంపత్ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి చుట్టపుచూపుగానే వచ్చిపోతారనే విమర్శకూడ ఉంది. నియోజకవర్గంలో కాంగ్రేస్ పార్టీని జనాలు నమ్మె పరిస్దితి లేదనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.

బీజేపి ఇలా..
అలంపూర్ సెగ్మెంట్ జనరల్ సీటుగా ఉన్నప్పుడు  బీజేపీకి మంచి పట్టుండేది.ఇక్కడి నుంచి మూడు సార్లు బీజేపీ అభ్యర్దులు ఎమ్మెల్యేలుగా గెలిచారు.ఎస్సీ రిజర్వేషన్ మారిన తర్వాత బలమైన నాయకత్వం లేకపోవటంలో పార్టీ చతికిల పడింది.ఇక్కడి నుంచి ఇద్దరు అభ్యర్దులు సీటుకోసం ప్రయత్నిస్తున్నారు.నాగర్కర్నూల్లో 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీని పోటీ చేసి ఓడిపోయిన బంగారు శృతి,ఎస్పీ మోర్చ రాష్ట్రనాయకుడు బంగి లక్ష్మణ్ కూడ పార్టీ సీటు కోసం యోచిస్తున్నారు.బంగి లక్ష్మణ్ 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు.వీరంత  నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పెద్దగా కృషి చేస్తున్న దాఖలాలు లేవు.మరి రానున్న రోజుల్లో బీజేపీ ఏ మేరకు పుంజుకుంటుందో చూడాలి.

నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు:
అలంపూర్ నియోజకవర్గ కృష్ణా, తుంగభద్రా రెండు నదుల మధ్యలో ఉండి నడిగడ్డ ప్రాంతంగా పిలవబడుతుంది. ఇటు ఏపీ,అటు కర్ణాటక సరిహద్దులు కలిగిన నియోజకవరం కావటంతో అక్కడి రాజకీయ పరిస్దితుల ప్రభావం ఇక్కడ కూడ ఉండే అవకాశం ఉంటుంది.44 జాతీయ రహదారికి ఇరువైపుల విస్తరించి ఉంది.నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా వ్యవసాయమే జీవనోపాధిగా జీవిస్తున్నారు.పత్తి,మిర్చి,పప్పుశెనగను వాణిజ్య పంటగా రైతులు సాగుచేస్తారు.ఆర్డీఎస్ ద్వారా ఇక్కడ పంటపొలాలకు సాగునీరు అందాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement