
హామీల అమలులో కేంద్రం విఫలం
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం ప్రభుత్వం విఫలమైందని ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు.
మండిపడ్డ ఎంపీ వినోద్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం ప్రభుత్వం విఫలమైందని ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు, హైకోర్టు విభజన, అసెంబ్లీ స్థానాల పెంపులాంటి హామీలు విభజన చట్టంలో ఇచ్చిన కేంద్రం వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు కావస్తున్నా కేంద్రం ఇప్పటికీ హైకోర్టు విభజన చేయలేదన్నారు. పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ ఓటింగ్‌కు వచ్చేముందైనా ఎయిమ్స్‌పై ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్ర నిర్లక్ష్య ధోరణికి నిరసనగా పార్లమెంటు సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. సమావేశంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.