మాట్లాడుతున్న ఎంపీ వినోద్‌కుమార్
-
అనవసర భూసేకరణ చేయం
-
ప్రతిపక్షాలది స్వార్థబుద్ధి
-
అందుకే రాద్ధాంతం : ఎంపీ వినోద్
తిమ్మాపూర్ : రాష్ట్రప్రభుత్వం వ్యవసాయరంగానికి వెన్నుదన్నుగా నిలుస్తోందని, అందుకే ప్రతి ఎకరాకూ నీరు అందించి సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికతో ముందుకెళ్తోందని ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం తిమ్మాపూర్‌లో మహాత్మజ్యోతిబాపూలే బాలికల గురుకుల కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేజీబీవీ పాఠశాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మూడునెలల్లో వెయ్యి టీఎంసీల నీరు కాళేశ్వరం మీదుగా వృథాగా సముద్రం పాలయ్యాయని, ఆ నీటిని నిల్వ చేసేందుకే మేడిగడ్ద వద్ద ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని, దీనిని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ప్రాజెక్టులను అడ్డుకునేప్రయత్నం మంచిదికాదని హితవుపలికారు. ప్రాజెక్టులు అవసరమున్న చోటే భూసేకరణ చేస్తామని, అనవసరంగా ఒక్క ఎకరా తీసుకోబోమని స్పష్టం చేశారు. రైతులకు నీరందితే తమకు భవిష్యత్తు ఉండదని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఎన్‌సీడీసీ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పథకం కింద జిల్లాకు రూ.60కోట్లు వచ్చాయన్నారు. పంటల నష్టం, రైతుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీపీ ప్రేమలత, జెడ్పీటీసీలు పద్మ, శరత్‌రావు, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ గోగూరి నర్సింహారెడ్డి, వైస్ ఎంపీపీ భూలక్ష్మీ, సర్పంచ్ మాతంగి స్వరూప, ఎంపీటీసీ సుగుణమ్మ, ఎంపీడీవో పవన్‌కుమార్, తహసీల్దార్ కోమల్‌రెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నాగభూషణచారి, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.