‘రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తున్నాం’
హైదరాబాద్‌సిటీ: తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డిలపై కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఈటెల ప్రజల మనిషి అని, సమర్ధుడు కాబట్టే సీఎం కేసీఆర్ ఆర్ధిక, పౌరసరఫరాల శాఖలు ఇచ్చారన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం జీఎస్‌టీ మీటింగ్‌లో ఈటెలను అభినందించారని తెలిపారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం నుంచి రాబట్టేందుకు ఈటెల చక్కగా కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన చేస్తున్న కృషి పేద ప్రజలకు తెలుసు, కానీ రేవంత్ రెడ్డి లాంటి పెద్దోళ్ళకు ఎం తెలుసు ? అని ఎద్దేవా చేశారు. ఈటెల సంక్షేమ హాస్టల్‌లో చదువుకున్న వ్యక్తి అని, కులవృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడాన్ని కొందరు బీసీ నాయకులు తప్పు పట్టడం దురదృష్టకరమని ఎంపీ వినోద్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీలో మాట్లాడొచ్చు. మంత్రులను దోషులనడం సమంజసం కాదన్నారు.