సాక్షి, నిజామాబాద్: గ్రూప్-1 విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ దుర్మార్గ జీవో ఇచ్చిందని, 29ని సడలించాలని నిరుద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారని తెలిపారు.
నిరుద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు దీరి ఏడాది కావస్తోందని.. ఇప్పటి వరకు ఇచ్చినా ఏ హామీ సరిగా అమలు కావడం లేదని మండిపడ్డారు.
‘ఏ రైతు అయినా రుణ మాఫీ కాకపోతే రెండు లక్షల రుణం తీసుకోండి రేవంత్ అన్నారు. నేను సీఎం కాగానే మాఫీ చేస్తామని అన్నారు. సూటిగా ఒకటే మాట అడుగుతున్నా. ప్రజా క్షేత్రంలో ఏం హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోండి. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని ప్రజలు భావిస్తున్నారు.
పెంచిన పింఛన్లు దేవుడెరుగు.. ఉన్న పింఛన్లు ఎత్తేస్తున్నారు. దేవుళ్ళ మీద ఒట్లు వేశారు. గట్టు మీద పెట్టేశారు. రిటైర్డ్ అయ్యిన ఉద్యోగులకు సెటిల్ మెంట్‌లు చేసే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నారు.’ అని ఈటల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment