
చంద్రబాబు అవినీతికి స్వేచ్ఛ కావాలా?
'ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు గొప్ప అర్థం ఉంది. టీడీపీ మంత్రులు మాట్లాడేది ఎలాంటి స్వేచ్ఛ గురించి? చంద్రబాబు విచ్చలవిడి అవినీతికి స్వేచ్ఛ కావాలా?' అని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: 'ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు గొప్ప అర్థం ఉంది. టీడీపీ మంత్రులు మాట్లాడేది ఎలాంటి స్వేచ్ఛ గురించి? చంద్రబాబు విచ్చలవిడి అవినీతికి స్వేచ్ఛ కావాలా?' అని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిలో తమ స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు గగ్గోలు పెట్టడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సెక్షన్- 8 అమలుచేయాల్సిన అవసరం లేదన్న వినోద్.. ఉమ్మడి రాజధానిలో విద్వేషాలు హెచ్చరిల్లినప్పుడుగానీ, పౌర హక్కులకు భంగం వాటిల్లడంకానీ, ఆస్తుల విధ్వంసం లేదా ఇతరత్రా హింసాయుత పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే విభజన చట్టంలోని సెక్షన్- 8 అమలుచేయాల్సి వస్తుందని, అదికూడా తెలంగాణ మంత్రివర్గాన్ని సంప్రదించిన తర్వాతే గవర్నర్ తుదినిర్ణయం తీసుకోవాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు.
ఓటుకు నోటు వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందికాబట్టి తెలంగాణ ఏసీబీ బాబుపై చర్య తీసుకోదని ఏపీ మంత్రులు వ్యాఖ్యానించడం వారి అజ్ఞానానికి నిదర్శనమని వినోద్ అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోవడం సహజమన్నారు.