రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ  | Note For Vote Case Hearing In Supreme Court On April 18th | Sakshi
Sakshi News home page

రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ 

Published Wed, Apr 17 2024 3:34 PM | Last Updated on Wed, Apr 17 2024 4:54 PM

Note For Vote Case Hearing In Supreme Court On April 18th - Sakshi

సాక్షి, ఢిల్లీ: రేపు(గురువారం) సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రబాబు న్యాయవాది సిద్దార్థ లుత్రా గత విచారణలో వాయిదా కోరారు. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం విచారణ జరపనుంది.

2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. స్టీఫెన్‌సన్‌ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు. ఫోన్‌లో మాట్లాడిన ఆడియో ఏసీబీ బయటపెట్టింది. "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్‌ నిర్ధారించింది.

అందుకే సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఈ కేసుపై ఎమ్మెల్యే ఆర్కే.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని పిటిషన్‌ వేశానని తెలిపారు. దర్యాప్తును సైతం సీబీఐకి అప్పగించాలని పిటిషన్‌లో పేర్కొన్నానని ఆయన తెలిపారు. 2015లో ఓటుకు నోటు కేసు జరిగింది. 2017లో సుప్రీం కోర్టులో కేసు వేశాను. గత ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో కేసు వాయిదా కోరారు. రేపు కేసు విచారణ జరగబోతుంది’’ అని తెలిపారు.

అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది. ఏడేళ్లయినా విచారణ  జరగకపోతే ఇక సామాన్యులకు న్యాయం అందుతుందా?. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు. తెలంగాణ ఏసీబీ ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదు. అందుకే సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి. ఇవి కాక మరో మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మత్తయ్య, సెబాస్టియన్ కూడా దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలాగే మాజీ మంత్రులు జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు. ఈ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇన్ని కేసులున్నా, చంద్రబాబు సిగ్గు లజ్జా లేకుండా బుకయిస్తున్నారు’’ అని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు.

ఏడేళ్లయినా చిన్న కారణాలతో సాగదీస్తున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆడియో, వీడియోలో దొరికినా దొరలా తిరుగుతున్నారు. నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ సీఎం అయ్యారు. నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు ఆలస్యం అయితోంది. ముద్దాయి ఎవరో అందరికీ తెలిసినా దర్జాగా తిరుగుతున్నారు. ఇకనైనా న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సంకేతాలు ఉండాలి. ఓటుకి నోటు కు సంబంధించి ఐదు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఐదు కోట్లకి బేరం కుదుర్చుకుని, యాభై లక్షలు రేవంత్ ఇస్తూ పట్టుబడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ కేసులో ఆలస్యం చేసింది. ఇప్పుడు మాత్రం కేసు బదిలీ అడుగుతున్నారు. రాజకీయ స్వార్థంతో కేసు గురించి పట్టించుకోలేదు’’ అని ఆర్కే పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement