కరీంనగర్‌ కింగ్‌ ఎవరు..? | The Karimnagar Lok Sabha is a Key Constituency in Telangana. | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ కింగ్‌ ఎవరు..?

Published Sun, Mar 31 2019 7:12 AM | Last Updated on Sun, Mar 31 2019 7:14 AM

The Karimnagar Lok Sabha is a Key Constituency in Telangana. - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ఉత్తర తెలంగాణలో కీలక నియోజకవర్గంగా కరీంనగర్‌ లోక్‌సభ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డిసెంబర్‌ 7న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పూర్తికాగా సరిగ్గా 125 రోజులకు అంటే ఏప్రిల్‌ 11న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ సరళిలో లేదా ఓటర్ల తీర్పులో మార్పు ఉంటుందా? రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు, సీఎంను ఎన్నుకునే విషయంలో ఒక విధంగా, ప్రధానిని ఎన్నుకునే విషయంలో మరోలా ప్రజలు స్పందిస్తారా అనేది ఇప్పుడు కరీంనగర్‌ విషయంలో ఆసక్తికరంగా మారింది. అదీగాకుండా ఇటీవల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రావడంతో, మొత్తం మూడు ఎమ్మెల్సీ సీట్లలో రెండు కరీంనగర్‌ పరిధిలో ఉండడంతో లోక్‌సభ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది చర్చనీయాంశమైంది.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో భారీ మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. టీఆర్‌ఎస్‌ పక్షాన ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌కుమార్‌ బరిలో నిలిచారు. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో వీరి మధ్య త్రిముఖపోరు నెలకొంటుందా లేక టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ లేదా టీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య ద్విముఖ పోటీగా మారుతుందా అనేది వేచిచూడాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో గతంతో పోలిస్తే తమ జీవితాలు మెరుగ్గానే ఉన్నాయని, ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు, రైతులను ఆదుకునేందుకు మరిన్ని చర్యలు కావాలని ప్రజలు కోరుతున్నారు.

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇదీ పరిస్థితి
సిరిసిల్ల: ఇది టీఆర్‌ఎస్‌కు పెట్టని కోట. సంస్థాగతం గా బలంగా ఉంది. గతంలో సిరిసిల్ల నుంచి గెలిచిన వారెవరూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించలేదు. 2014లో గెలిచి కేటీఆర్‌ మంత్రి అయ్యాక విస్తృతం గా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లు, వంతెనలు, ఇతర పనుల రూపంలో గత ఐదేళ్లలో రూ. వేలాది కోట్ల మేర నిధులు ఖర్చుచేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకున్నారు. ఇక్క డ కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నాయకులు కరువయ్యా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి నిరుత్సాహంతో ఉన్నారు. బీజేపీ పరిస్థితీ ఏమంత మెరుగ్గా లేదు.

వేములవాడ: ఇది టీఆర్‌ఎస్‌కు బలమైన సెగ్మెంట్‌. గతంతో పోలిస్తే ఇక్కడ మంచినీటి సరఫరా మెరుగుపడింది. వేసవిలో తరచుగా ఎదురయ్యే సమస్యలు అంతగా లేవని స్థానికులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిరిసిల్ల, వేములవాడ ఇతర నియోజకవర్గాలు ప్రయోజనం పొందనున్నాయి. మిషన్‌ భగీరథ ద్వారా ఇప్పటికే 60 నుంచి 70 శాతం దాకా తాగునీరు సరఫరా అవుతోంది. ఎమ్మెల్యే  చెన్నమనేని రమేష్‌ ఇప్పుడు అందుబాటులో ఉంటున్నారని ప్రజలు అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ ప్రభావం కొంత ఉంటుంది. లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు ఇక్కడి వారితో అనుబంధం ఉంది. బీజేపీ ప్రభావం

అంతంత మాత్రమే.
హుజూరాబాద్‌: రాజకీయంగా టీఆర్‌ఎస్‌ బలంగానే ఉంది. మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్లో అభివృద్ధి పనులు బాగానే చేపట్టారు. 2014తో పోలిస్తే గత ఎన్నికల్లో తన మెజారి టీ కొంత మేర తగ్గడంపై ఇటీవల కార్యకర్తల సమావేశంలో ఈటల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి లక్ష మెజా రిటీని సాధించడం ద్వారా దానిని భర్తీచేయాలని టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి కొంత మేర మద్దతు దొరికే అవకాశాలున్నాయి.

ఆ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ సామాజిక వర్గం వారు ఇక్కడ ఎక్కువమంది ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్‌ నుంచి జమ్మికుంట మార్కెట్‌ కమిటీ మాజీచైర్మన్‌ తుమ్మిడి సమ్మిరెడ్డి, వి.రవీందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడి యువకులు కొందరిపై వీహెచ్‌పీ, బజ్‌రంగ్‌దళ్‌ ప్రభావం ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో లోక్‌సభ అభ్యర్థి సంజయ్‌ కుమార్‌కు అనుకూల ప్రచారం సాగుతోంది.

చొప్పదండి: అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ ఇక్కడ పటిష్టంగానే ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో భారీ గా చేరికలు సాగాయి. కాంగ్రెస్‌ ఇంకా పూర్తిస్థాయి లో పుంజుకోవాల్సి ఉంది. ప్రధాని మోదీ ప్రభావం యువతపై కొంత మేర ఉండే అవకాశాలున్నాయి. హిందుత్వ భావజాలం కారణంగా బీజేపీ అభ్యర్థిపై ఇక్కడి యువకులు ఆకర్షితులవుతున్నట్టు చెబుతున్నారు. 

కరీంనగర్‌: ఇక్కడ టీఆర్‌ఎస్‌కు సానుకూలత ఉంది. కాంగ్రెస్, బీజేపీ కంటే టీఆర్‌ఎస్‌ ఆశీర్వాద సభలు, రోడ్‌షోలు, కుల సంఘాల సమావేశాలతో ప్రచారం లో ముందుంది. వరస విజయాలతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు స్థానికంగా సంబంధాలు మరింత మెరుగయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసిన బండి సంజయ్, పొన్నం ప్రభాకర్‌ రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు. వీరిద్దరూ కూడా కరీంనగర్‌ పట్టణవాసు లు కావడంతో వారి మద్దతుదారులు పెద్దసంఖ్య లోనే ఉన్నారు.

వీరికి బీసీ సామాజికవర్గాల ఓట్లు పడే అవకాశాలున్నాయి. సంస్థాగతంగా కాంగ్రెస్‌ ఇక్కడ బలంగానే ఉంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలొచ్చాక కాంగ్రెస్‌ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇది కాంగ్రెస్‌కు ప్రతికూలం కావచ్చు. హిందూ అనుకూల ఓటుబ్యాంక్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన సంజయ్‌ లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశమైంది. 

మానకొండూరు:  ఇక్కడి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ప్రజలతో సంబంధాలు బాగానే ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ కేడర్‌ బలంగానే ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఓడిన  సీనియర్‌ నేత ఆరేపల్లి మోహన్‌ తాజాగా టీఆర్‌ఎస్‌ లో చేరడం కాంగ్రెస్‌ పార్టీపై కొంత మేర ప్రభావం చూపొచ్చునని చెబుతున్నారు. సీనియర్‌నేత కవ్వం పల్లి సత్యనారాయణకు సముచిత స్థానం కల్పించడం ద్వారా ఆ నష్టం భర్తీకి పొన్నం చర్యలు తీసుకుంటున్నారు. హిందువుల కోసం పోరాడే వ్యక్తిగా సంజయ్‌కు ఇక్కడి యువతలో గుర్తింపు ఉంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌–బీజేపీల మధ్య పోటా పోటీగా ఉండొచ్చునని అంచనావేస్తున్నారు.

హుస్నాబాద్‌: ఈ నియోజకవర్గాన్ని అన్నీ తానై మా జీ మంత్రి టి.హరీశ్‌రావు నడిపించారు. ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌తో పాటు తాను జవాబుదారీగా ఉం టూ ఇక్కడి ప్రజల్లో నమ్మకం కలిగించారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లోని కొంత భాగం కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాలో ఉంది. టీఆర్‌ఎస్‌కు స్థానిక నాయకులు, కార్యకర్తల మద్దతుంది. కాంగ్రెస్‌కు ఇక్కడ మద్దతుదారులున్నా పార్టీని చురుకుగా నడిపించే నాయకులు లేరు. ఇక్కడ కొంతమేర సీపీఐ ప్రభావం ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ  పెద్దగా కేడర్‌ లేదు.

అభివృద్ధే ఎజెండా
రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందు కెళుతున్నాం. ప్రచారానికి వెళ్లినపుడు ప్రజల్లో స్పందన బాగుంటోంది. ఓటర్లు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో జాతీయస్థాయిలో తమ ఎంపీ ఉండాలని కరీంనగర్‌ ప్రజలు కోరుకుంటున్నారు. ఐదేళ్లలో రాష్ట్ర ఎంపీలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాం. నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు, మంజూర్లు పొందగలిగాం. కేంద్ర ప్రభుత్వంలో కూడా టీఆర్‌ఎస్‌కు పాత్ర ఉంటే ఇంకా సాధిస్తాం. విభజన చట్టంలో పేర్కొన్న తెలంగాణలోని ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయి. ఈసారి దానిని సాధించేందుకు కృషి చేస్తాం. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి 4,5 వార్డుల్లో ప్రభావం చూపగలుగుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఆ పార్టీకి రావు. అందువల్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులెవరూ నాకు పోటీ కాదు.
– బోయినపల్లి వినోద్‌కుమార్, టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ

ఆయన ఓడినా నష్టమేం లేదు..
స్థానికుడిని. ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటాను. 2009–14 మధ్యకాలంలో ఎంపీగా సాధించిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఢిల్లీలో పోషించిన కీలకపాత్ర నన్ను గెలిపిస్తాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడినా ప్రజలకొచ్చే పెన్షన్లు, రైతుబంధు ఇతర సంక్షేమ పథకాలు ఆగిపోవు. రాష్ట్ర ప్రభుత్వంపై ఏ ప్రభావం పడదు. హిందూ–ముస్లింల మధ్య వైషమ్యాలు పెంచడం ద్వారా ఇక్కడ రాజకీయంగా లాభపడాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఈ ప్రయత్నాలు ఫలించవు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయడం పొరబాటు. కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోని మిగతా 6 నియోజకవర్గాలను కవర్‌ చేశాక, చివరకు కరీంనగర్‌ అసెంబ్లీపై దృష్టి పెడదామనుకున్నా. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావడంతో అధిష్టానం ఆదేశాలతో పోటీ చేయాల్సి వచ్చింది. పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుకగా, కరీంనగర్‌ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసే వ్యక్తిగా ప్రజలు ఈసారి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, ఇతర జిల్లాల బుద్ధిజీవులు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పే ఎంపీ ఎన్నికలపుడు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇస్తారని ఆశిస్తున్నాను.
– పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్‌ అభ్యర్థి

నన్ను గెలిపించే ఆలోచనలో ఉన్నారు..
మరోసారి నరేంద్రమోదీని ప్రధానిని చేసేందుకు ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీగా నన్ను పంపించాలనే అభిప్రాయంతో ఇక్కడి ప్రజలున్నారు. నేను గెలిస్తే స్వయంగా ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసి, నియోజకవర్గ అభివృద్ధికి నేరుగా నిధులు తెచ్చే అవకాశం ఉంది. అదే టీఆర్‌ఎస్‌ నాయకుల విషయానికొస్తే వారు సీఎం కేసీఆర్‌నే కలిసే పరిస్థితే ఉండదు. లోక్‌సభ ఎన్నికలు జాతీయ రాజకీయాలకు సంబంధించినవి కాబట్టి ప్రజలు భిన్నమైన తీర్పునిస్తారనే నమ్మకముంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు ఓటేసినా ఎంఐఎంకు వేసినట్టే.

కాంగ్రెస్‌కు వేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లే. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడింది. బీజేపీకి గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని భావిస్తున్నాను. రెండు సార్లు అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చెందాననే సానుభూతి ప్రజల్లో ఉంది. ఏడు సెగ్మెంట్లలో బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. గతంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు అవకాశమిచ్చినందున ఈసారి నన్ను గెలిపిద్దామనే ఆలోచనతో ప్రజలున్నారు. మాకు సైలెంట్‌ ఓటింగ్‌ పడుతుంది. 
– బండి సంజయ్‌కుమార్, బీజేపీ అభ్యర్థి

లోక్‌సభ ఓటర్లు
పురుషులు :8,07,233
మహిళలు : 8,25,565
ఇతరులు : 26
మొత్తం ఓటర్లు : 16,32,824

2018 అసెంబ్లీ ఎన్నికలు
లోక్‌సభ పరిధిలో పార్టీలకు పోలైన ఓట్లు
టీఆర్‌ఎస్‌    6,91,885
కాంగ్రెస్‌      3,45,149
బీజేపీ        1,02,014
మొత్తం పోలైన ఓట్లు        15,42,685 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement