సాక్షి ప్రతినిధి, కరీంనగర్: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కంచుకోట కరీంనగర్ స్థానం బీజేపీ వశమైంది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ తన సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌పై 89,508 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం తరువాత 2004 నుంచి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి ఇక్కడ రెండో ఓటమి కాగా, రెండుసార్లు వినోద్‌కుమారే ఓడిపోవడం గమనార్హం. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో 11,47,824 ఓట్లు పోల్ కాగా, విజేతగా నిలిచిన సంజయ్‌కి 4,98,276 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కు 4,08,768 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ 1,79,258 ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. నోటాకు 7,979 ఓట్లు రాగా, బీఎస్‌పీ, ఇతర రిజిస్టర్ పార్టీలు,స్వతంత్రులు ఎవరికీ డిపాజిట్ దక్కలేదు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో గురువా రం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లను లెక్కించిన పోలింగ్ సిబ్బంది 28 రౌం డ్లపాటు లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లను లెక్కించారు. సంజ య్‌కుమార్ కరీంనగర్ ఎంపీగా విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రకటించారు.
తొలి రౌండ్ నుంచే ఆధిక్యత
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా పోస్టల్ ఓట్ల లెక్కింపు నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యంలో కొనసాగారు. పోస్టల్ బ్యాలెట్లలో 814 ఓట్లు బీజేపీకి పోలు కాగా, 208 ఓట్లు టీఆర్‌ఎస్‌కు, 118 ఓట్లు కాంగ్రెస్‌కు పోలయ్యాయి. అనంతరం మొదలైన ఈవీఎం ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే బండి సంజయ్ ఆధిక్యత కొనసాగింది. 19వ రౌండ్ నుంచి స్వల్పంగా మెజారిటీ తగ్గినప్పటికీ, ఆధిక్యత కొనసాగింది.
నాలుగు అసెంబ్లీల్లో భారీ ఆధిక్యత
కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగింట బీజేపీకి భారీగా ఓట్లు పోలయ్యాయి. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, మానకొండూరులలో టీఆర్‌ఎస్ కన్నా బీజేపీకి భారీ మెజారిటీ రావడంతో హుజూరాబాద్, హుస్నాబాద్‌లలో మూడో స్థానంలో నిలిచినప్పటికీ బీజేపీ ఆధిక్యత తగ్గలేదు. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంటులో పోలైన 1,92,614 ఓట్లకు గాను ఏకంగా 1,10,689 ఓట్లు(57.46 శాతం) సాధించిన బీజేపీ చొప్పదండి, మానకొండూరు, వేములవాడల్లో 50 శాతానికి పైగానే ఓట్లను సాధించడంతో విజయం నల్లేరు మీద నడకలా సాగింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో బీజేపీ కన్నా టీఆర్‌ఎస్ 5,713 ఓట్లు అదనంగా సాధించింది.
సత్తా చాటుకున్న ఈటల
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ హుజూరాబాద్, హుస్నాబాద్‌లలోనే స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ తరువాత స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఉండడం గమనార్హం. మూడోస్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నిలిచారు. దీంతో కేవలం హుజూరాబాద్‌లోనే బీజేపీ కన్నా టీఆర్‌ఎస్ 50వేల పైచిలుకు ఓట్లు ఆధిక్యంలో నిలిచింది. ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ 77,211 ఓట్లు సాధించగా, బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం 25,176, కాంగ్రెస్‌కు 46,689 ఓట్లు లభించాయి. హుస్నాబాద్‌లో కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచినప్పటికీ, బీజేపీ కన్నా వెయ్యి ఓట్లే అధికంగా సాధించడం గమనార్హం. ఇక్కడ టీఆర్‌ఎస్ 66,885 ఓట్లు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 44,123, బీజేపీ 43,144 ఓట్లు సాధించాయి.
ప్రభావం చూపని పొన్నం ప్రభాకర్
స్థానికుడిగా, మాజీ ఎంపీగా విజయం కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేక పోయారు. 2009లో కరీంనగర్ ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించిన పొన్నం ప్రభాకర్ తెలంగాణ సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అయినా 2014 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తరువాత మూడో స్థానంలో నిలవడం గమనార్హం. అయినా ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడా బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై ఆధిక్యత ప్రదర్శించలేదు. హుజూరాబాద్, హుస్నాబాద్‌లలో రెండోస్థానంలో నిలవడంతో డిపాజిట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment