సాక్షి, హైదరాబాద్ : కాజీపేట నుంచి కరీంనగర్‌కు నేరుగా రైల్వేలైన్ నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. ప్రస్తుతం కాజీపేట నుంచి కరీంనగర్ వెళ్లేందుకు పెద్దపల్లి మార్గంలో రైల్వే లైన్ ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. కాజీపేట నుంచి వయా హుజురాబాద్ మీదుగా కరీంనగర్‌కు రైల్వేలైన్ నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అధ్యయనం చేయనున్నట్లు ఎంపీ వినోద్ పేర్కొన్నారు.
సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్‌తో తెలంగాణ ఎంపీలు బుధవారం సమావేశమై కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ర్టానికి రైల్వే కేటాయింపుల ప్రాధాన్యాలు, పెండింగ్ పనులపై చర్చించారు. ఈ సమావేశానికి ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, కే కేశవరావు, నగేష్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పసునూరి దయాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి హాజరయ్యారు.
రైల్వే జీఎంతో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలని నెరవేర్చాలని రైల్వే జీఎంను కోరినట్లు వినోద్ తెలిపారు. తెలంగాణలో మూడు రైల్వే లైన్లు మాత్రమే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్తపల్లి - మనోహరాబాద్ పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్‌ను ఎలక్ట్రిఫికేషన్ చేయాలని కోరామని తెలిపారు. ఇందుకు టెండర్లు కూడా పిలిచినట్లు లిఖితపూర్వంగా రైల్వే జీఎం సమాధానం ఇచ్చారని చెప్పారు. ఈ మార్గాన్ని ఎలక్ట్రిఫికేషన్ చేస్తే మెమో, లోకల్ రైళ్లు తిరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణలో జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తక్కువగా ఉన్నాయని వినోద్ తెలిపారు. ఈ క్రమంలో రైల్వే లైన్ల కిలోమీటర్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ... దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో ముందు ఉందని పేర్కొన్నారు. కానీ సమస్యల పరిష్కారంలో దక్షిణ మధ్య రైల్వే ఆలస్యం చేస్తున్నదని తెలిపారు. 1997లో నల్లగొండ - మాచర్ల మధ్య లైన్ మంజూరైనప్పటికీ.. 20 ఏండ్లు అయినా పనులు ప్రారంభం కాలేదని ఎంపీ గుర్తు చేశారు. పగిడిపల్లి - నల్లపాడు డబ్లింగ్ పనుల గురించి అడిగితే కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. జగ్గయ్యపేట - మేళ్లచెర్వు గూడ్స్ మార్గాన్ని ప్యాసింజర్ లైన్‌గా మార్చాలని రైల్వే జీఎంకు విజ్ఞప్తి చేశామని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment