
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలిచ్చారు. చెప్పిన మాట వినకపోతే ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సాయం నిలిపివేస్తామని హెచ్చరించారు. గతవారం రష్యా అధినేత పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గంటకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతిని నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్రంప్ స్పష్టంచేశారు.
ట్రంప్ పోద్బలంతో ఉక్రెయిన్–రష్యా మధ్య జరిగే శాంతి చర్చల్లో యూరప్ భాగస్వామ్యం ఉండబోదని అమెరికా ప్రతినిధి కీథ్ కెల్లాగ్ తేలి్చచెప్పారు. ఈ పరిణామాలన్నీ యూరప్ దేశాలకు మింగుడుపడడం లేదు. విజేత ఎవరో తేలకుండానే యుద్ధం ముగించాలన్న ప్రతిపాదనను కొన్ని ఐరోపా దేశాలు పరోక్షంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ తమను లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అంశంలో చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చించడానికి అత్యవసరంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సోమవారం ఈ సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తోంది. యూరప్ జాతీయ భద్రతకు ఈ భేటీ చాలా ముఖ్యమని యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ చెప్పారు. అమెరికా, యూరప్ మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ దిశగా తమవంతు కృషి చేస్తున్నామని వెల్లడించారు. తమ కూటమిలో విభజనలను అంగీకరించబోమని పేర్కొన్నారు.
ఉక్రెయిన్–రష్యా వ్యవహారంలో ఐరోపా దేశాలు ఒంటరవుతున్నాయని, అమెరికాకు దూరంగా జరుగుతున్నాయన్న వాదనను ఆయన ఖండించారు. మరోవైపు ఉక్రెయిన్‌కు మద్దతుగా నూతన చర్యలతో ముందుకు రాబోతున్నట్లు యూరోపియన్ యూనియన్(ఈయూ) ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కెల్లాస్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూరప్ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. అయితే, యూరప్ ఆదేశాల అధినేతల అత్యవసర భేటీని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఇంకా ధ్రువీకరించారు. ఆయన ప్రతినిధుల సైతం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, భేటీ కచ్చితంగా జరుగుతుందని యూరోపియన్ అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment