
ప్రజాభీష్టం మేరకే కొత్త జిల్లాలు
ఎంపీ వినోద్
సాక్షి, హైదరాబాద్: ప్రజల అభీష్టం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయని, ఇందులో రాజకీయకోణం లేదని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. ప్రజలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సిరిసిల్ల, జనగామ, గద్వాల జిల్లాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కోరామని చెప్పారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌లతో కలసి ఆయన సోమవారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం పది జిల్లాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారని చెప్పారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ సరైన ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇవ్వలేదని, స్పీకర్ దానిని చెత్తబుట్టలో వేస్తారని, అసలు అది రాజీనామానే కాదని అన్నారు.
ఎంపీ సుమన్ మాట్లాడుతూ డీకే అరుణ గద్వాల ప్రజల పక్షాన నిలబడలేదని, దానికి ఆమె రాజీనామా చేసిన ఫార్మాటే సాక్ష్యమని అన్నారు. కరీంనగర్ జిల్లాను నాలుగు జిల్లాలు చేయమని జిల్లా నేతలమంతా సీఎంను కోరినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగానే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోందని, రాజ్యాంగానికి లోబడే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలైందన్నారు. తెలంగాణ కన్నా చిన్న రాష్ట్రాల్లో ఎక్కువ జిల్లాలు ఉండి అభివృద్ధి చెందుతున్నాయనే విషయాన్ని గత పాలకులు గ్రహించలేకపోయారని అన్నారు. ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ పారదర్శకంగా సమస్యలపై చర్చించి సీఎం సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని, సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. విలేకరుల సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు కూడా పాల్గొన్నారు.