వెంటిలేటర్‌ మీద టీఆర్‌ఎస్‌ సర్కారు: సంజయ్‌ | Telangana BJP Chief Bandi Sanjay Comments On CM KCR | Sakshi
Sakshi News home page

వెంటిలేటర్‌ మీద టీఆర్‌ఎస్‌ సర్కారు: సంజయ్‌

Jul 3 2022 1:36 AM | Updated on Jul 3 2022 1:36 AM

Telangana BJP Chief Bandi Sanjay Comments On CM KCR - Sakshi

నడ్డాకు జ్ఞాపికను అందజేస్తున్న సంజయ్, డీకే అరుణ 

సాక్షి, హైదరాబాద్‌: ‘టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎటెటో పోతున్నరట. రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్‌ మీద ఉంది. దాన్ని కాపాడుకోవడంపై సీఎం కేసీఆర్‌దృష్టి పెడితే మంచిది’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ జాతీయ సమావేశాల్లో పాల్గొన్న ఆయన హెచ్‌ఐసీసీలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించాలని కేసీఆర్‌కు సవాల్‌విసిరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడే ర్యాలీలు తీయని కేసీఆర్‌ రాష్ట్రపతి ఎన్నికలప్పుడు ర్యాలీలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రపతి ఎన్నికలను అగౌరవపరిచేలా కేసీఆర్‌నడుచుకుంటున్నారని సంజయ్‌ ధ్వజమెత్తారు. ప్రచార ర్యాలీలు నిర్వహించడానికి రాష్ట్రపతి ఎన్నికలు ఏమైనా.. పబ్లిక్‌ఎన్నికలా, ఈ ఎన్నికల సందర్భంగా దేశంలో ఎక్కడైనా ఫ్లెక్సీలు కట్టారా.. అని ప్రశ్నించారు. ‘‘విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా గెలిచేది లేదు, ఏమీలేదు.

ర్యాలీలతో ఆర్భాటం చేయడం అవసరమా? అదేమైనా సర్పంచ్‌ఎన్నిక అనుకున్నవా కేసీఆర్‌?’’అని వ్యాఖ్యానించారు. పంజాబ్‌పోయి రైతులకు రూ.3 లక్షలు ఇచ్చిన కేసీఆర్‌ తెలంగాణ రైతులకు ఎందుకు సాయం చేయడంలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయని, మోదీని ఎవరేం చేయలేరని టీఆర్‌ఎస్‌ పార్టీ స్ట్రాటజిస్ట్‌ చెప్పారని సంజయ్‌ అన్నారు.  

క్షీణించిన శాంతిభద్రతలు
టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్ర శాంతిభద్రతలు క్షీణించాయని, హైదరాబాద్‌ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ విచ్చలవిడితనం ఎక్కువైందని, డ్రగ్‌ మాఫియా, భూదందా, మైనింగ్‌ మాఫియా ఇక్కడనే వేళ్లూనుకొందని అన్నారు. మైనర్ల మీద అత్యాచారాలు జరిగినా పట్టించుకునేవాళ్లులేరని, ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ నేతల పిల్లలను వెనుకేసుకు వస్తున్నారని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సంజయ్‌ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement