విజయ సంకల్ప సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, రాజ్‌నాథ్‌సింగ్, గడ్కరీ, బండి సంజయ్, జేపీ నడ్డా, అమిత్ షా, డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: ‘‘కోటి ఆకాంక్షల సాధన కోసం త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలనతో భ్రష్టు పట్టింది. స్వరాష్ట్రంలో కలలు సాకారమవుతాయనుకున్న తెలంగాణ ప్రజలు ఎనిమిదేళ్లుగా ద్రోహానికి గురవుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంతో ఒక కుటుంబం మాత్రమే లబ్ధి పొందింది. కొత్త రాష్ట్రం లో ఏర్పాటైన ప్రభుత్వం ఒక రాజ వంశాన్ని శాశ్వతంగా నిలబెట్టేందుకే పనిచేసినట్టు కనిపిస్తోంది..’’అని బీజేపీ కార్యవర్గ భేటీ మండిపడింది.
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో రెండు రోజులుగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గం తెలంగాణలో పరిస్థితులు, జరుగుతున్న ఘటనలపై ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. దానిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చదివి వినిపించారు. ప్రకటనలోని ప్రధానాంశాలు ఇవీ..
కలగానే ఆ మూడు నినాదాలు
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో తెలంగాణ ఉద్యమం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా ఇప్పటికీ ఈ మూడు అంశాలు కలగానే మిగిలిపోయా యి. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం వ్యయాన్ని మూడింతలు పెంచింది. ఆ పెంపు ఎవరికి లబ్ధి చేకూర్చిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కాలయాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇతర నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
అత్యంత వెనుకబడిన దక్షిణ తెలంగాణలోని 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు నెట్టెంపాడు, డిండి తదితర ప్రాజెక్టులు అధోగతి పాలయ్యాయి. తెలంగాణ ఏర్పాటైనప్పుడు రూ.369 కోట్ల రెవెన్యూ మిగులుతో ధనిక రాష్ట్రంగా ఉండేది.
ఇప్పుడు రూ.16,500 కోట్ల రెవెన్యూ లోటుతో దాదాపు రూ.3.20 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి ఉంది. నియామకాల విషయంలో నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. ఇంటికో ఉద్యోగం అన్న టీఆర్‌ఎస్.. అడపాదడపా ప్రకటనల తో నిరుద్యోగులను నిరాశలో ముంచేసింది.
అడుగడుగునా అధికార దుర్వినియోగం
తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఏర్పాటైన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ముఖ్యమంత్రి తనయుడు మొదలు కుటుంబ సభ్యులంతా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాష్ట్ర పాలనంతా కుటుంబం చుట్టూ కేంద్రీకృతం కావడంతో భారీగా అవినీతి జరిగింది. చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ భాష అభ్యంతరకరంగా, అసహ్యంగా ఉం దని ప్రజలే చెబుతున్నారు.
సీఎం, ఆయన మంత్రివర్గ సహచరుల నిరుత్సాహం చూ స్తుంటే రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందన్న విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు, వారి అధికార భాగస్వాములు, వారి తోబుట్టువులు దారుణమైన నేరాలకుపాల్పడ్డారు. ప్రతిపక్షాలపై తప్పు డు కేసులు పెట్టేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ఎమ్మెల్యే పిల్లలు కీచకులుగా మారారు.
సరైన నిఘా లేకపోవడంతో మాదకద్రవ్యాల సంస్కృతి విచ్చలవిడిగా పెరిగింది. లైంగిక నేరాలు, బాలల రక్షణ చట్టం కింద తెలంగాణలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. నిరంకుశ ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతం చూపిస్తోంది. నేడు తెలంగాణలో మనం చూస్తున్న పరిస్థితులు 1946 నాటి అనుభవాలను గుర్తు చేస్తున్నాయి.
కేంద్రం ఊతమిచ్చినా..
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకారం అందించింది. భారీగా నిధులు ఇచ్చింది. కానీ రాష్ట్రంలో వాటి వినియోగం అవినీతిమయమైంది. కాంగ్రెస్ హయాంలో మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 2015లో మోదీ ప్రభుత్వం తిరిగి ప్రారంభించి రూ.6,400కోట్లు ఇచ్చింది. తెలంగాణలో గతంలో మొత్తంగా 2,511 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులు ఉంటే.. ఇప్పుడు 4,996 కిలోమీటర్లకు పెరిగాయి.
రీజనల్ రింగ్ రోడ్డును రూ.8,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తోంది. తెలంగాణలో 2014–21లో 321 కిలోమీటర్ల కొత్త రైల్వేలైన్లు, డబ్లింగ్ ప్రాజెక్టులను ప్రారంభించింది. రూ.9 వేల కోట్ల విలువైన బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఉచితంగా పంపిణీ చేసింది. ప్రధాన మంత్రి స్వానిధి కింద వీధి వ్యాపారులకు రూ.433.34 కోట్ల ఆర్థిక సాయం అందించింది.
స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31.43 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 11.11 లక్షల మంది మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. ఎనిమిదేళ్లలో తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రూ.1,613.64 కోట్లు విడుదల చేసింది. కేంద్రం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని తమ ఖాతాలో వేసుకుంటోంది.
పథకాల పేరిట సంక్షేమానికి కొర్రీలు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకొస్తున్నట్టు చెబుతూ.. ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలకు మంగళం పాడుతోంది. రైతుబంధును అమలు చేస్తున్నట్టు గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదు. బీసీ, ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగ యువత సంక్షేమాన్ని గాల్లో దీపంలా మార్చింది. నిధుల కేటాయింపులోనూ తీవ్ర పక్షపాత వైఖరిని ప్రదర్శించి పలు వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉంది.
కోవిడ్–19 తర్వాతైనా ఆరోగ్య రంగం పట్ల ప్రభుత్వ వైఖరిలో సమగ్ర మార్పు వస్తుందనుకున్నా ఏమాత్రం పురోగతి లేదు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో 70శాతం ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment