అంబేద్కర్ స్టేడియం సుందరీకరణకు రూ.10 లక్షలు
-
పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే
-
అథ్లెటిక్ పోటీలను విజయవంతం చేయాలి
కరీంనగర్ స్పోర్ట్స్ : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో అక్టోబర్ 4, 5 తేదీల్లో జరిగే సౌత్ ఇండియా అథ్లెటిక్ పోటీలను అట్టహాసంగా నిర్వహించాలని ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. జిల్లా కీర్తిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేయాలని, స్టేడియం సుందరీకరణకు ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. స్టేడియంలో అథ్లెటిక్ పోటీలు జరగనున్న నేపథ్యంలో వారు స్టేడియాన్ని సోమవారం పరిశీలించారు. అథ్లెటిక్ ట్రాక్, స్టేడియంలోని మైదానాలు చూశారు. స్టేడియానికి కావాల్సిన వాటిపై నివేదికలు ఇవ్వాలని డీఎస్డీఓకు సూచించారు. మైదానంలో నీరు నిలుస్తున్నందున డ్రెయినేజీ వ్యవస్థను బాగా చేయించుకుని సుందరంగా తీర్చిదిద్దేలా చేయాలన్నారు. సింథటిక్ ట్రాక్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రూ.10లక్షలతో గ్యాలరీలకు రంగులు వేయాలని, మరమ్మతు పనులకు వినియోగించాలని డీఎస్డీఓ శివకుమార్‌కు సూచించారు.
అథ్లెటిక్ పోటీలను విజయవంతం చేయాలి
రాష్ట్ర, జిల్లా అథ్లెటిక్ సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ 4,5 తేదీల్లో జరగనున్న దక్షిణ భారతస్థాయి అథ్లెటిక్ పోటీలను విజయవంతంచేయాలని పోటీల నిర్వహణ కమిటీ చీఫ్ ప్యాట్రన్, ఎంపీ వినోద్ కుమార్, చైర్మన్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. స్టేడియం పరిశీలించిన అనంతరం వారు విలేకరులకు పోటీల వివరాలను వెల్లడించారు. అండర్ 16, 18, 20, 22 బాలబాలికలకు నిర్వహించే ఈ పోటీలకు 7రాష్ట్రాల నుంచి సుమారు 900 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని తెలిపారు. క్రీడాకారులకు ఉచితభోజన వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ మేయర్, పోటీల అధ్యక్షుడు రవీందర్ సింగ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు, పోటీల నిర్వహణ కార్యదర్శి నందెల్లి మహిపాల్, డీఎస్డీవో శివకుమార్, యోగా సంఘం కార్యదర్శి సిద్దారెడ్డి పాల్గొన్నారు.