తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచాలి
కేంద్ర మంత్రి సదానంద గౌడకు ఎంపీ వినోద్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను గురువారం తెరాస ఎంపీ వినోద్ కుమార్ కలుసుకొని తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, తెలంగాణ కు ప్రత్యేక హైకోర్టు, హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తుల వాటా తదితర అంశాలపై చర్చించారు. అసెంబ్లీ స్థానాల పెంపునకు అనువుగా ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ చట్ట సవరణల బిల్లు ఈ నెల 25 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు బిల్లుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని వినోద్ కోరారు.
కేంద్ర మంత్రితో సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 26 లో చేయాల్సిన సవరణపై కేంద్ర మంత్రితో చర్చించామని వినోద్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 26 లో చేసే చిన్న సవరణ ద్వారా రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు పెంచే ఆస్కారం ఉందన్నారు. ఈ సవరణ కు సంబంధించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గతంలోనే లేఖలు రాశారని వినోద్ గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఒకటి, రెండు రోజుల్లో తమ మంత్రిత్వ శాఖ తగు నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారని వినోద్ చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఉన్నందున న్యాయమూర్తుల ఎంపికలో తెలంగాణ కు దక్కాల్సిన వాటాపై చర్చించామన్నారు. ఈ విషయంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు.