
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘అవిశ్వాస తీర్మానం ఎవరిని అడిగి పెట్టారు? వారెందుకు పెట్టారో, ఏం కారణాలు చెబుతున్నారో చూసి మేం చర్చలో మాట్లాడతాం’’అని టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్ అన్నారు. బుధవారమిక్కడ ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘వారు అవిశ్వాసం పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా మాకు సంబంధం లేదు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నాం’’అని వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజు ఉన్న వాతావరణమే ఈ 18 రోజులు ఉండి బిల్లులు ఆమోదం పొందుతాయని అనుకుంటున్నాం. హైకోర్టు విభజన చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం.
హైకోర్టు విభజనకు గతంలోనే కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. దాన్ని అమలుకు సభలో కోరతాం. బయ్యారం ఉక్కు కర్మాగారం అంశాన్ని లేవనెత్తుతాం. కాళేశ్వరం ఆపాలని, అనుమతులు రద్దు చేయాలని ఏపీ సీఎస్ మూడు పేజీల లేఖ రాశారు. వాళ్ల(ఏపీ) ఆలోచనలు, మా ఆలోచనలు వేరు’’ అని అన్నారు.
మాకు నచ్చలేదు: సీతారాం నాయక్
‘‘కాళేశ్వరాన్ని అడ్డుకోవడం ఏపీకి తగదు. ఓవైపు ప్రాజెక్టులను అడ్డుకుంటూ మరోవైపు అవిశ్వాసానికి మా మద్దతు అడగడం నచ్చలేదు. చర్చలో పాల్గొంటం. కేంద్రం ద్వంద్వ వైఖరిని నిలదీస్తాం’’ అని సీతారాం నాయక్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment