
'ఉనికి కోసమే విమర్శలు'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అక్కసుతో, తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే విమర్శలు చేశారని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల హామీల అమలులో పూర్తి స్పష్టతతో ముందుకు వెళుతోందని ఆయన వివరించారు. ఈ మేరకు ఎంపీ వినోద్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో దిగ్విజయ్ సింగ్ విమర్శలను తిప్పి కొట్టారు. రాష్ట్ర విభజన సమయంలో చేసిన విద్యుత్ ఒప్పందాల వల్ల మోసపోయామని, అయినా ప్రాజెక్టుల రూపకల్పనలో విజయం సాధించామన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా మొదటి దశలో 10వేల గ్రామాలకు తాగునీరు అందించేందుకు ముందుకు వెళుతుంటే, సీఎంకు నీటి సరఫరా గురించి కంటే నీటి పైపుల మీదనే శ్రద్ధ ఉందని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేసేందుకు తాము కృషి చేస్తుంటే, దిగ్విజయ్ వంటి సీనియర్ నేత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని వినోద్‌కుమార్ విమర్శించారు.