కొడుకు చదువు కోసం ఓ తండ్రి సాహసం
ముంబై: ఆకలి రుచి ఎరుగదు అంటారు. ఆకలి ప్రాణాలను కూడా లెక్కచేయదు అనుకోవాల్సి వస్తుంది దబేశ్ ఖనాల్ చేసిన సాహసం గురించి తెలుకుంటే. 500 రూపాయల కోసం అతడు తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న దబేశ్ తన కొడువు చదువు కోసం ప్రాణాలకు తెగించి నదిలోకి దూకాడు. పోలీసుల సాయంతో చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు.
నేపాల్ కు చెందిన అతడు ముంబైలో రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు. వారం రోజులుగా పని దొరక్కపోవడంతో తినడానికి డబ్బుల్లేకపోవడంతో స్వచ్ఛంద సంస్థలు పెడుతున్న భోజనంతో కడుపు నింపుకుంటున్నాడు. అయితే తన కొడుకు చదువుకు డబ్బులు అవసరమవడంతో 41 ఏళ్ల ఖనాల్ ఈ సాహసానికి పూనుకున్నాడు. సబర్మతి నదిలో ఈత కొట్టే పందానికి ఒప్పుకున్నాడు. నదిలోకి దూకి కొంతదూరం ఈతకొట్టిన తర్వాత నీటిలో మునిగిపోబోతూ కేకలు పెట్టాడు. అతడిని పోలీసులు కాపాడడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
'కేటరింగ్ లో రోజువాలి కూలీగా పనిచేస్తున్నాను. రోజంతా కష్టపడితే రూ.400 ఇస్తారు. వారం రోజులుగా పనిలేకపోవడంతో ఖాళీగా ఉన్నాను. నా కుమారుడి చదువు కోసం రూ.500 అప్పుకావాలని సాగర్ తపా అనే స్నేహితుడిని అడిగాను. సబర్మతీ నదిలో ఈత కొడితే రూ.500 ఇస్తానని అతడు పందెం కాయడంతో ఈ సాహసం చేశాను' అని ఖనాల్ చెప్పాడు. ఆరేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో బతుకుతెరువు కోసం అతడు ముంబైకి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో బీఎస్సీ చదువును మధ్యలోనే ఆపేసిన ఖనాల్ పలుచోట్ల పనిచేశాడని వెల్లడించారు.