దేశీయంగా ఆయుధ సేకరణ కోసం రక్షణరంగానికి చేసిన భారీ కేటాయింపు.. భారత రక్షణ పారిశ్రామిక పునాదిని విస్తృతపరుస్తుందని, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలను ప్రోత్సహించడంపై బహువిధ ప్రభావం వేస్తుందని రక్షణమంత్రి ఘనంగా ప్రకటించారు. ఎంచుకున్న లక్ష్యాలను చూస్తే ఆయన ప్రకటనను తప్పుపట్టలేం. కానీ చేదు నిజం ఏమిటంటే, దేశీయంగా రక్షణ కొనుగోళ్లకు కేటాయించిన రూ. 70,221 కోట్లలో అధికభాగం గతంలో రక్షణశాఖ హామీపడిన చెల్లింపులకు ఖర్చు కావడమే. అంటే పాత చెల్లింపులు పోతే కొత్త కొనుగోళ్లకు మిగిలేది అత్యంత తక్కువ మొత్తమేనని అర్థమవుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన భారీ మొత్తాన్ని పూర్తిగా స్థానిక రక్షణ విక్రేతలకు, నూతన ఒప్పందాల కింద ఆయుధాలు, పరికరాల సరఫరాదారులకు చెల్లిస్తారని భ్రమలు పెట్టుకోవలసిన పనిలేదు.
రక్షణ సామగ్రి అవసరాల్లో ఆత్మనిర్భర్ లేక స్వావలంబన సాధించటానికి అధికశాతం ఆయుధ సామగ్రిని దేశీయంగానే సేకరించబోతున్నట్లు కేంద్రప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనలో స్థానికతకు ఏమాత్రం చోటు లేదనిపిస్తోంది. ఈ ప్రతిపాదనలో కొత్త విషయమూ లేదు. అలాగని అసాధారణమైన అంశమూ లేదు. దీర్ఘకాలంగా వాయిదాలో ఉంటున్న ఈ లక్ష్య సాధనకు తోడ్పడటానికి రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయిస్తున్న ఆర్థిక కేటాయింపుల్లో అతి స్వల్పమాత్రంగానే పెంచడం అనే గత కాలపు ధోరణికి కేంద్రప్రభుత్వ తాజా ప్రకటన ఒక కొనసాగింపే తప్ప దీంట్లే మరే కొత్త విషయమూ లేదు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి దేశ రక్షణకోసం రూ.70,221 కోట్లు లేదా మొత్తం మూలధన కొనుగోలు బడ్జెట్‌లో 63 శాతం వరకు త్రివిధ దళాలకు దేశీయంగా సేకరించిన రక్షణ సామగ్రిపైనే వెచ్చించనున్నట్లు గత నెలలో రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దిగుమతులను బాగా తగ్గిం చుకుని మేక్ ఇన్ ఇండియా అనే ప్రభుత్వ భావనను బలోపేతం చేసే లక్ష్యం నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,35,061 కోట్ల మూలధన వ్యయంలో రక్షణ రంగంలో కొనుగోలు బడ్జెట్ కింద కేటాయించిన రూ.1,11,714 కోట్ల మొత్తం చిన్న భాగం మాత్రమే. ప్రస్తుత సంవత్సరం సవరించిన రక్షణ కొనుగోళ్ల వ్యయంలో వాస్తవానికి రూ. 2,551 కోట్లను తగ్గించడం గమనార్హం. ప్రధానంగా యుద్ధవిమానాలు, ఏరో ఇంజిన్లు, భారీ, మధ్యతరహా సైనిక వాహనాలతోపాటు త్రివిధ దళాలకు ఇతర పరికరాలను కొనడానికి ఈ మొత్తాన్ని కేటాయించారు. అనేక అధునాతన రక్షణ ప్లాట్‌ఫాంలు, వాటితో ముడిపడిన ప్రోగ్రామ్‌లు, భారతీయ వాయుసేనకు చెందిన ఇతర ప్రత్యేక ప్రాజెక్టుల కొనుగోలుకోసం ఈ కేపిటల్ అక్విజిషన్ బడ్జెట్ (సీఏబీ) నుంచి నిధులు కేటాయిస్తారు.
ఈ రక్షణ కొనుగోలు బడ్జెట్ నుంచి చిన్న మొత్తాన్ని దేశీయంగా ఆయుధాల సేకరణపై వెచ్చించడం అనేది అసాధారణం కాదు. ఉదాహరణకు 2014–15 నుంచి 2018–19 (డిసెంబర్ 2019 వరకు) మధ్య కాలంలో రక్షణ రంగంపై చేసిన వ్యయం సీఏబీలో 60 శాతంగా ఉండిందని గ్రహించాలి. న్యూఢిల్లీలో ఈ సంవత్సరం ఒక వెబినార్ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన మొత్తం కంటే ఇది 3 శాతం మాత్రమే తక్కువ. ఈ కేటాయింపు భారత రక్షణ పారిశ్రామిక పునాదిని విస్తృతపర్చడంపై, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలను ప్రోత్సహించడంపై బహువిధ ప్రభావం వేస్తుందని రక్షణమంత్రి ఘనంగా ప్రకటించారు. అలాగే రక్షణ రంగ అవసరాలను తీర్చే స్టార్టప్‌లు, దేశీయ ఉపాధి అవకాశాలను కూడా ఇది గణనీయంగా పెంచుతుందని మంత్రి పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాలను చూస్తే రక్షణమంత్రి ప్రకటనను తప్పుపట్టలేం. కానీ ప్రకటిత ఉద్దేశాలకు, అసలు వాస్తవానికి మధ్య కాస్త అంతరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే చేదు నిజం ఏమిటంటే, దేశీయంగా రక్షణ కొనుగోళ్లకు కేటాయించిన రూ. 70,221 కోట్లలో అధికభాగం గతంలో రక్షణశాఖ హామీపడిన చెల్లింపులకు ఖర్చు కావడమే. లేదా గతంలో కొన్న రక్షణ ప్లాట్‌ఫాం, ఆయుధాల కొనుగోళ్లకు చెల్లించాల్సిన అసలు చెల్లింపులకు ఈ కేటాయింపులో అధిక భాగం సరిపోవచ్చు.
విశ్వసనీయ అంచనా ప్రకారం ఇలా గతంలోని కొనుగోళ్లకు చెల్లించాల్సిన మొత్తం ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రక్షణ కొనుగోళ్ల మొత్తంలో 80 నుంచి 90 శాతం వరకు ఉండటమే. అంటే పాత చెల్లింపులు పోతే కొత్త కొనుగోళ్లకు మిగిలేది అత్యంత తక్కువ మొత్తమేనని మనకు అర్థమవుతుంది. అంటే కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన రూ. 70,221 కోట్ల మొత్తాన్ని పూర్తిగా స్థానిక రక్షణ విక్రేతలకు, నూతన ఒప్పందాల కింద ఆయుధాలు, పరికరాల సరఫరాదారులకు చెల్లిస్తారని భ్రమలు పెట్టుకోవలసిన పనిలేదు.
ఈ వాస్తవ పరిస్థితి గురించి మన త్రివిధ బలగాలకు స్పష్టంగా తెలుసు. 2018 సంవత్సరంలోనే అప్పటి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ నాటి రక్షణరంగంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి స్పష్టంగా ఒక విషయం తెలిపారు. సీఏబీలో భారత సాయుధ బలగాలకు కేటాయించిన అతి స్వల్ప మొత్తం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరానికి గానూ, చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఆధునీకరణ ప్రక్రియపై భారత సైన్యం పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా హరీమన్నాయని ఆయన తేల్చిచెప్పారు. భారత సైనిక అవసరాలకు కేటాయించిన ఆర్థిక పొడిగింపు అనేది ద్రవ్యోల్బణాన్ని, పన్నుల పెంపుదలను తటస్థీకరించడానికి మాత్రమే సరిపోతుందని, మేకిన్ ఇండియా ప్రాజెక్టులకు, మౌలిక వనరుల అభివృద్ధికి, సైన్యం చెల్లించాల్సిన చెల్లింపులకు చాలా కొద్దిమొత్తమే మిగులుతుందని నాటి లెఫ్టినెంట్ జనరల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి మొరపెట్టుకున్నారు. అంతకుమించి పొరుగు దేశంతో నిత్య ఘర్షణల నేపథ్యంలో జరూరుగా అవసరమైన మందుగుండు సామగ్రి, ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సమర్థ నిర్వహణకు ఇది తూట్లు పొడుస్తుందని శరత్ చంద్ వాపోయారు.
అలాగే, సైన్యం వద్ద ఉన్న ఆయుధాల్లో 68 శాతం వరకు పురాతన కేటగిరీలో ఉంటున్నాయని, సమకాలీన అవసరాలకు సరిపోయే ఆయుధాలు 28 శాతం మాత్రమే ఉన్నాయని, అందులోనూ అత్యధునాతన ఆయుధ సామగ్రి 8 శాతం మాత్రమే భారత సైన్యం వద్ద ఉందని, ఈ పరిస్థితుల్లో రక్షణ రంగానికి కేటాయింపులు క్షీణిస్తూ పోతే భారత సాయుధ బలగాల ఆధునీకరణ ప్రక్రియనే అది సవాలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేది రక్షణ మంత్రి వెబినార్ సమావేశంలో పేర్కొనలేదు. రక్షణ శాఖ వద్ద ఈ సమాచారం ఉన్నప్పటికీ, పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీకి ఈ విషయం ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నప్పటికీ చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేది రక్షణ శాఖ బహిరంగపర్చలేదు. రక్షణ బడ్జెట్లలో చెల్లింపులకు తక్కువ కేటాయింపులను చేస్తూ పోవడం వల్ల ఒక దశలో రక్షణ శాఖ ఇకేమాత్రం చెల్లింపులు చేయలేని స్థితికి దిగజారిపోవచ్చని రక్షణపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవలి నివేదికలో హెచ్చరించింది కూడా. దీంతో ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ రక్షణ పరిశ్రమను ప్రోత్సహించడానికి అతి తక్కువ మాత్రమే కేటాయించాల్సి వచ్చింది.
భారతీయ, విదేశీ రక్షణరంగ పరిశ్రమాధిపతులకు కూడా భారత రక్షణ శాఖ బడ్జెట్ వాస్తవాల గురించిన అవగాహన ఉంది. వెబినార్‌లో తాజాగా రక్షణశాఖ ప్రకటన వీరిలో కాస్త ఉత్సాహాన్ని కలిగించిందంటే దానికి కారణం.. సైనిక సామగ్రి కోసం ప్రపంచ మార్కెట్లో పనిచేస్తున్న ఆయుధాల విక్రేతలు భారతీయ రక్షణరంగ చీకటి జోన్‌లో ఏదో ఒకరకంగా మనుగడ సాగించాల్సి ఉండటమే. వీరి పరిస్థితి ఎలా ఉంటుం దంటే ద్రవరూప ఆక్సిజన్‌లో వీరు కూరుకుపోయినట్లు ఉంటుంది. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే ద్రవరూప ఆక్సిజన్ వీరిని బతకనీయదు. ఆదే సమయంలో ఆక్సిజన్ వీరిని చావనివ్వదు. ఎందుకంటే జారీ చేసిన టెండర్లు, బహుకరించిన కాంట్రాక్టుల కోసం వీరు నిరంతరం వేచి ఉండాల్సి ఉంటుంది.
దశాబ్దాలుగా రక్షణ రంగ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఎలాంటి సత్ప్రయత్నాలు జరగటం లేదు. పైగా ఈ వ్యవస్థలో ఉంటున్న ప్రతి ఒక్కరూ యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఉండిపోయారు. ఓ ఒక్కరి ఆచరణలోనూ సాహసోపేతమైన అడుగులు వేయలేదు. వీరిలో చాలామంది రంగం నుంచి తప్పుకున్నారు. పరస్పర ఆరోణలతో మంత్రిత్వ శాఖలోని పౌర సైనిక విభాగాలను మరింత నిరంకుశత్వం వైపు నెట్టేశారు. ప్రతిసారీ లక్ష్య సాధనవైపు అడుగేయడం, లోపభూయిష్టమైన పథకంతో కుప్పగూలడం.. దీంతో సర్వత్రా అనిశ్చితి రాజ్యమేలడం.. జరుగుతూ వస్తున్న క్రమం ఇదే మరి.
అమిత్ కౌషిశ్, ఆర్థిక సలహాదారు
రాహుల్ బేడీ, సీనియర్ జర్నలిస్ట్
ఆయుధాల నవీకరణకు నిధులేవి?
Published Thu, Mar 4 2021 1:58 AM | Last Updated on Thu, Mar 4 2021 2:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment