ఉత్సవాలకు ముస్తాబైన ఎర్రకోట
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండడంతో ఢిల్లీ ఎర్రకోటలో ఇవాళ జరిగే 74వ స్వాతంత్య్ర దిన వేడుకలకు రక్షణ శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. జాతీయ పతాకం ఎగుర వేయడం దగ్గర్నుంచి, ప్రధాని ప్రసంగం, జాతీయ గీతాలాపన వరకు ప్రతీ కార్యక్రమంలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు, పీపీఈ కిట్లు ధరించేలా మార్గదర్శ కాలను రూపొందించింది. ఎర్రకోట పరిసరా ల శానిటైజేషన్ దగ్గర్నుంచి హాజరయ్యే అతిథుల పాటించే భౌతిక దూరం వరకు ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంది.
పోలీసు సిబ్బందితో వివిధ అంచెల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ప్రతీ ఏడాది జరిగే పంద్రాగస్టు వేడుకలకి, ఈసారి జరిగే వేడుకలు ఎలా భిన్నమో వివరిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరసగా ఏడోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఎర్రకోట వేదికగా ఆయన శనివారం చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. కోవిడ్ సంక్షోభం, చైనాతో ఉద్రిక్తతలు, ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడతారని ఆసక్తిగా చూస్తున్నారు.
► ఈసారి వేడుకలకి దౌత్యప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు కలిపి 4 వేల మందికి ఆహ్వా నం అందింది. ఏటా హాజరయ్యే వారిలో ఇది 20% మాత్రమే.
► పాఠశాల విద్యార్థులకు బదులుగా ఎన్‌సీసీ సిబ్బంది ఈసారి వేడుకల్లో పాల్గొంటారు
► ఇద్దరి అతిథుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీట్ల ఏర్పాటు. అతిథులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
► ఎర్రకోట లోపలికి వచ్చే ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు. కరోనా లక్షణాలున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేలా అంబులెన్స్‌లు సిద్ధం.
► భద్రత విధుల్లో పాల్గొనే పోలీసులందరికీ పీపీఈ కిట్లు.
► ఈసారి వేడుకల్ని చూసే అవకాశం కరోనా వైరస్‌తో పోరాడి విజేతలైన 1,500 మందికి కల్పించారు. వారిలో 500 మంది పోలీసు సిబ్బంది.
Comments
Please login to add a commentAdd a comment