ఆదివారం నుంచి టీకా ఉత్సవం | PM Modi to hold virtual meet with CMs to review Covid-19 situation | Sakshi
Sakshi News home page

ఆదివారం నుంచి టీకా ఉత్సవం

Published Fri, Apr 9 2021 4:35 AM | Last Updated on Fri, Apr 9 2021 4:35 AM

PM Modi to hold virtual meet with CMs to review Covid-19 situation - Sakshi

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలను కోరారు. వైరస్‌ నియంత్రణలో రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దేశంలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం వర్చువల్‌గా సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల పెరుగుదల, కోవిడ్‌ 19 నిబంధనల అమలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలపై వారు చర్చించారు.

రానున్న 2 – 3 వారాలు అత్యంత కీలకమని, అందువల్ల కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు అన్ని రకాలుగా కృషి చేయాలని సీఎంలను ప్రధాని కోరారు. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విధిస్తున్న నైట్‌ కర్ఫ్యూ పేరును ‘కరోనా కర్ఫ్యూ’గా పేర్కొనాలని సూచించారు. నైట్‌ కర్ఫ్యూని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ‘రాత్రి మాత్రమే కరోనా ప్రభావశీలంగా ఉంటుందా?’ అన్న ‘మేథో చర్చ’ను ప్రధాని తోసిపుచ్చారు. రాత్రి కర్ఫ్యూ వల్ల కరోనా ముప్పుపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు ప్రజల దైనందిన కార్యక్రమాలకు అంతరాయం కలగదని వివరించారు. అలాగే, ఏప్రిల్‌ 11 నుంచి ఏప్రిల్‌ 14 వరకు టీకా ఉత్సవం నిర్వహించాలని, తద్వారా అర్హులైన వారికి పెద్ద సంఖ్యలో టీకా వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఏప్రిల్‌ 11 సామాజిక సంస్కర్త జ్యోతిరావు ఫులే జయంతి అని ప్రధాని గుర్తు చేశారు. టీకాతో పాటు మాస్క్, భౌతిక దూరం, పరిశుభ్రత తదితర నిబంధనలను కూడా కచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. టీకా ఇచ్చేందుకు నిర్ధారించిన 45 ఏళ్ల వయో పరిమితిని ప్రధాని గట్టిగా సమర్ధించారు. ఈ విషయంపై కొందరు రాజకీయం చేస్తున్నారని, ఆ వివాదంలోకి తాను దిగబోనని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిపై పోరులో కేంద్రంతో కలిసిరావాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. కరోనా టీకా తీసుకునేందుకు ప్రస్తుతం ఉన్న 45 ఏళ్ల వయో పరిమితిని 18 ఏళ్లకు తగ్గించాలని మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు ‘మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌’ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ప్రధాని ముఖ్యమంత్రులకు సూచించారు.

కరోనా ముప్పుపై అవగాహన పెంచడం, నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్‌(3టీ)ను పకడ్బందీగా చేపట్టాలని కోరారు. గతంలో ఇదే విధానాన్ని అవలంబించడం ద్వారా క్రియాశీల కేసుల సంఖ్యను 10 లక్షల నుంచి 1.25 లక్షలకు తగ్గించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. కరోనాపై కచ్చితంగా విజయం సాధిస్తామని, ఇప్పుడు మన వద్ద టీకాతో పాటు మరింత అనుభవం, మెరుగైన వసతులు ఉన్నాయన్నారు. ఒక వ్యక్తి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తరువాత 72 గంటల్లోగా ఆ వ్యక్తికి సంబంధించిన కనీసం 30 మంది క్లోజ్‌ కాంటాక్ట్‌లను గుర్తించి పరీక్షించాలన్నారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడంపై ఆందోళన వద్దని, టెస్ట్‌ల సంఖ్యను పెంచాలని కోరారు.

మొత్తం పరీక్షల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు కనీసం 70% ఉండేలా చూడాలన్నారు.  కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు కరోనా నిబంధనలను పాటించడం లేదని, అక్కడి ప్రభుత్వ యంత్రాంగంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ యంత్రాంగం తీరులో మార్పు రావాలి. ఏడాది నుంచి నిరాకంటంగా పోరాడుతుండడంతో అలసిపోయి ఉంటారు. కానీ రానున్న రెండు, మూడు వారాలు చాలా ముఖ్యం. అలసత్వం వీడి, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన అన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది’ అన్నారు. మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లతో పాటు మరి కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య  పెరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. కరోనాపై, వ్యాక్సిన్‌పై అవగాహన పెంచేందుకు గవర్నర్లు, సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులతో అఖిలపక్ష సమావేశాలను నిర్వహించాలని ప్రధాని సూచించారు.

కరోనా కేసులు పెరుగుతుండడంతో ముంబై, ఢిల్లీ, నోయిడా, లక్నో సహా పలు ప్రాంతాల్లో స్థానిక అధికారులు నైట్‌ కర్ఫ్యూని విధించిన విషయం తెలిసిందే. ‘నైట్‌ కర్ఫ్యూ స్థానంలో కరోనా కర్ఫ్యూ అనే పదం వాడాలి. తద్వారా అవగాహన పెరుగుతుంది’ అని సీఎంలకు ప్రధాని సూచించారు.  ‘కరోనా రాత్రి మాత్రమే వస్తుందా? అని కొందరు మేథో చర్చ చేస్తున్నారు. నైట్‌ కర్ఫ్యూ ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ప్రయోగం. దాంతో ప్రజల్లో కరోనా ముప్పు తొలగిపోలేదన్న అవగాహన కలుగుతుంది. అలాగే, రాత్రి 9 లేదా 10 గంటలకు ప్రారంభించి ఉదయం 5 లేదా 6 గంటలకు ఈ కర్ఫ్యూని ముగిస్తే మంచిది’ అని వ్యాఖ్యానించారు. ఈ వర్చువల్‌ సమావేశానికి పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ హాజరు కాలేదు. ఆమెకు బదులుగా రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ హాజరయ్యారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement