న్యూఢిల్లీ: భారత్‌లోనూ రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరిగిపోతోంది. వరసగా 8వ రోజు కేసుల సంఖ్య పెరిగింది. దేశ రాజధానిఢిల్లీలో ఒమిక్రాన్ వేరియెంట్ విస్తృతంగా వ్యాపిస్తూ ఉండడంతో శని, ఆదివారాల్లో కర్ఫ్యూ విధించాల ని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్టుగా ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం తెలిపారు. బస్సులు, మెట్రో రైళ్లు తిరిగి 100 శాతం సామర్థ్యంతో పని చేస్తాయన్నారు. బస్సులు, మెట్రోల కోసం వేచి చూసే వారు సూపర్ స్ప్రెడర్లుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలో పాజిటివిటీ రేటు 8.37%కు చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటూ ఉండడంతో కరోనా సోకింది. మరోవైపు పంజాబ్ రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలన్నీ మూసివేసింది. సినిమా హాల్స్, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. యూపీలో జనవరి 15 వరకు విద్యాసంస్థలను మూసివేశారు.
1892కి చేరుకున్న ఒమిక్రాన్ కేసులు
గత 24 గంటల్లో దేశంలో 37,379 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య 1,892కి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment