Chief Ministers meet
-
Narendra Modi: దేశ పురోభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉంది: మోదీ
చండీగఢ్: బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) దేశ పురోగతికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి అంకితభావంతో కృషి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. పేదలు, దిగువవర్గాల అభ్యున్నతికి, సాధికారతకు కట్టుబడి ఉన్నామన్నారు. హరియాణా సీఎం నయాబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం మోదీ ఇక్కడి ఫైవ్‌స్టార్ హోటల్లో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంతులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. మొత్తం 17 మంది సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మోదీ ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘సుపరిపాలన అందించడం, ప్రజలు జీవితాలను మెరుగుపర్చడంపై సు దీర్ఘంగా చర్చించాం. దేశ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, పేదలు, అట్టడుగువర్గాలకు సాధికారతను కల్పించడానికి ఎన్డీయే కట్టుబడి ఉంది’ అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తదితర ఎన్డీయే మిత్ర పక్షాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హరియాణా విజయా న్ని సానుకూలంగా మలచుకొని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలను ఎదుర్కొనాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మొత్తం ఆరు తీర్మానాలను ఆమోదించినట్లు జేపీ నడ్డా తెలిపారు. ఎమర్జెన్సీ ఖండిస్తూ అమిత్ షా తీర్మానం పెట్టగా, రాజ్యంగం అమృతమహోత్సవంపై రాజ్‌నాథ్ తీర్మానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. -
ఆదివారం నుంచి టీకా ఉత్సవం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలను కోరారు. వైరస్ నియంత్రణలో రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దేశంలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం వర్చువల్‌గా సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల పెరుగుదల, కోవిడ్ 19 నిబంధనల అమలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలపై వారు చర్చించారు. రానున్న 2 – 3 వారాలు అత్యంత కీలకమని, అందువల్ల కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు అన్ని రకాలుగా కృషి చేయాలని సీఎంలను ప్రధాని కోరారు. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విధిస్తున్న నైట్ కర్ఫ్యూ పేరును ‘కరోనా కర్ఫ్యూ’గా పేర్కొనాలని సూచించారు. నైట్ కర్ఫ్యూని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ‘రాత్రి మాత్రమే కరోనా ప్రభావశీలంగా ఉంటుందా?’ అన్న ‘మేథో చర్చ’ను ప్రధాని తోసిపుచ్చారు. రాత్రి కర్ఫ్యూ వల్ల కరోనా ముప్పుపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు ప్రజల దైనందిన కార్యక్రమాలకు అంతరాయం కలగదని వివరించారు. అలాగే, ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14 వరకు టీకా ఉత్సవం నిర్వహించాలని, తద్వారా అర్హులైన వారికి పెద్ద సంఖ్యలో టీకా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 11 సామాజిక సంస్కర్త జ్యోతిరావు ఫులే జయంతి అని ప్రధాని గుర్తు చేశారు. టీకాతో పాటు మాస్క్, భౌతిక దూరం, పరిశుభ్రత తదితర నిబంధనలను కూడా కచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. టీకా ఇచ్చేందుకు నిర్ధారించిన 45 ఏళ్ల వయో పరిమితిని ప్రధాని గట్టిగా సమర్ధించారు. ఈ విషయంపై కొందరు రాజకీయం చేస్తున్నారని, ఆ వివాదంలోకి తాను దిగబోనని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిపై పోరులో కేంద్రంతో కలిసిరావాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. కరోనా టీకా తీసుకునేందుకు ప్రస్తుతం ఉన్న 45 ఏళ్ల వయో పరిమితిని 18 ఏళ్లకు తగ్గించాలని మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు ‘మైక్రో కంటైన్మెంట్ జోన్’ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ప్రధాని ముఖ్యమంత్రులకు సూచించారు. కరోనా ముప్పుపై అవగాహన పెంచడం, నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్(3టీ)ను పకడ్బందీగా చేపట్టాలని కోరారు. గతంలో ఇదే విధానాన్ని అవలంబించడం ద్వారా క్రియాశీల కేసుల సంఖ్యను 10 లక్షల నుంచి 1.25 లక్షలకు తగ్గించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. కరోనాపై కచ్చితంగా విజయం సాధిస్తామని, ఇప్పుడు మన వద్ద టీకాతో పాటు మరింత అనుభవం, మెరుగైన వసతులు ఉన్నాయన్నారు. ఒక వ్యక్తి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తరువాత 72 గంటల్లోగా ఆ వ్యక్తికి సంబంధించిన కనీసం 30 మంది క్లోజ్ కాంటాక్ట్‌లను గుర్తించి పరీక్షించాలన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంపై ఆందోళన వద్దని, టెస్ట్‌ల సంఖ్యను పెంచాలని కోరారు. మొత్తం పరీక్షల్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు కనీసం 70% ఉండేలా చూడాలన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు కరోనా నిబంధనలను పాటించడం లేదని, అక్కడి ప్రభుత్వ యంత్రాంగంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ యంత్రాంగం తీరులో మార్పు రావాలి. ఏడాది నుంచి నిరాకంటంగా పోరాడుతుండడంతో అలసిపోయి ఉంటారు. కానీ రానున్న రెండు, మూడు వారాలు చాలా ముఖ్యం. అలసత్వం వీడి, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన అన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది’ అన్నారు. మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లతో పాటు మరి కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. కరోనాపై, వ్యాక్సిన్‌పై అవగాహన పెంచేందుకు గవర్నర్లు, సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులతో అఖిలపక్ష సమావేశాలను నిర్వహించాలని ప్రధాని సూచించారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ముంబై, ఢిల్లీ, నోయిడా, లక్నో సహా పలు ప్రాంతాల్లో స్థానిక అధికారులు నైట్ కర్ఫ్యూని విధించిన విషయం తెలిసిందే. ‘నైట్ కర్ఫ్యూ స్థానంలో కరోనా కర్ఫ్యూ అనే పదం వాడాలి. తద్వారా అవగాహన పెరుగుతుంది’ అని సీఎంలకు ప్రధాని సూచించారు. ‘కరోనా రాత్రి మాత్రమే వస్తుందా? అని కొందరు మేథో చర్చ చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూ ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ప్రయోగం. దాంతో ప్రజల్లో కరోనా ముప్పు తొలగిపోలేదన్న అవగాహన కలుగుతుంది. అలాగే, రాత్రి 9 లేదా 10 గంటలకు ప్రారంభించి ఉదయం 5 లేదా 6 గంటలకు ఈ కర్ఫ్యూని ముగిస్తే మంచిది’ అని వ్యాఖ్యానించారు. ఈ వర్చువల్ సమావేశానికి పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ హాజరు కాలేదు. ఆమెకు బదులుగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ హాజరయ్యారు. -
కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్త!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. రెండో వేవ్‌గా పేర్కొంటున్న ఈ పెరుగుదలను అడ్డుకునేందుకు తక్షణమే నిర్ణయాత్మకంగా స్పందించాలని కోరారు. ‘టెస్ట్, ట్రేస్, ట్రీట్’ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ బుధవారం వర్చువల్‌గా సమావేశమై, కరోనా పరిస్థితిని, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించారు. కరోనా వైరస్‌ను అడ్డుకునే శక్తిమంతమైన ఆయుధం టీకాయేనని, అందువల్ల రాష్ట్రాలు టీకా కేంద్రాల సంఖ్యను భారీగా పెంచాలని ప్రధాని సూచించారు. మహారాష్ట్ర, పంజాబ్‌ల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. గత రెండు వారాల్లో దేశవ్యాప్తంగా 70 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 150 శాతానికి పైగా పెరిగిందని ప్రధాని ఆందోళన వెలిబుచ్చారు. దీన్ని అడ్డుకోనట్లయితే, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడే ప్రమాదముందన్నారు. గతంలో కరోనా కేసులు అత్యంత కనిష్టంగా నమోదైన రెండో, మూడో స్థాయి పట్టణాల్లోనూ ప్రస్తుతం కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందన్నారు. కరోనా మహమ్మారిని భారత్ విజయవంతంగా ఎదుర్కోవడానికి కారణం, ఆ వైరస్ గ్రామాలకు చేరకపోవడమేనన్న ప్రధాని.. ఇప్పుడు పట్టణాల ద్వారా గ్రామాలకు ఆ వైరస్ వ్యాపించే ప్రమాదముందన్నారు. అలా జరిగితే, వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతమున్న యంత్రాంగం సరిపోని పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించారు. వైరస్‌ను నిర్ధారించేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్షలనే ఎక్కువగా చేయాలని, మొత్తం పరీక్షల్లో ఆర్టీపీసీఆర్ వాటా 70 శాతానికి పైగా ఉండేలా చూడాలని రాష్ట్రాలను కోరారు. చత్తీస్‌గఢ్, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువగా యాంటిజెన్ టెస్ట్‌లపై ఆధారపడుతున్నాయని, ఇది సరికాదని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ను సీరియస్‌గా తీసుకోవాలని, అదే సమయంలో టీకాలు వృధా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో 10% వరకు టీకాలు వృధా అవుతున్నాయని, యూపీలోనూ అదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చినవారిపై, వారిని కలిసిన బంధుమిత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ‘కరోనాను ఎదుర్కోవడంలో దేశం చూపిన ఆత్మవిశ్వాసం అతివిశ్వాసంగా.. వైరస్‌పై సాధించిన విజయం నిర్లక్ష్యంగా మారకుండా చూసుకోవాలి’ అని సూచించారు. దేశంలో చాలా చోట్ల మాస్క్‌లను ధరించడం లేదన్నారు. ‘దవాయి భీ.. కడాయి భీ’(వైద్యంతో పాటు జాగ్రత్త చర్యలు కూడా) మంత్రాన్ని గుర్తు చేస్తూ.. మాస్క్‌లను ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. అదే సమయంలో, ప్రజల్లో భయాందోళనలు పెరగకుండా చూసుకోవాలని కోరారు. వైరస్ వేరియంట్లను గుర్తించేందుకు వీలుగా శాంపిల్స్‌ను ల్యాబ్స్‌కు పంపించాలని కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని, ఇటీవల ఒకే రోజులో30 లక్షల టీకాలను ఇచ్చారని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన జిల్లాల జాబితాను కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితిని ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరించారు. పశ్చిమబెంగాల్, చత్తీస్గఢ్సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరు కారణాలతో ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన తరువాత ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ కావడం ఇదే ప్రథమం. -
తొలి దశలో.. టీకా ఖర్చు కేంద్రానిదే
న్యూఢిల్లీ: కరోనా టీకాను తొలిదశలో 3 కోట్ల మందికిపైగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమం ప్రారంభ దశలో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొనవద్దని సూచించారు. ప్రధాని మోదీ సోమవారం రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై చర్చించారు. భారత్‌లో కొన్ని నెలల్లోనే 30 కోట్ల మందికిపైగా ప్రజలకు ఈ టీకా ఇస్తామని వెల్లడించారు. సైంటిస్టుల మాటే ఆఖరి మాట ఇప్పటికే అనుమతి లభించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌తోపాటు మరో నాలుగు కరోనా వ్యాక్సిన్లు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని మోదీ వివరించారు. ప్రజలకు సమర్థవంతమైన వ్యాక్సిన్ ఇచ్చేందుకు సైంటిస్టులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వ్యాక్సిన్ అంశంలో సైంటిస్టుల మాటే ఆఖరి మాట అని తాను మొదటినుంచీ చెబుతూనే ఉన్నానని గుర్తుచేశారు. మీ వంతు వచ్చేదాకా వేచి చూడండి తొలి దశలో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకే కరోనా టీకా అందుతుందని, వారు మినహా ఇతరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవద్దని నరేంద్రమోదీ కోరారు. ప్రామాణికమైన ప్రొటోకాల్ ప్రకారం అందరికీ టీకా ఇస్తారని, తమ వంతు వచ్చేవరకు వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారిపై పోరాటంలో మనం ముందంజలో ఉన్నప్పటికీ అజాగ్రత్త పనికిరాదని హెచ్చరించారు. కరోనా వ్యాక్సినేషన్‌పై వదంతులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. బూత్‌లెవల్ వ్యూహం సైంటిస్టులు, నిపుణుల సూచనల ప్రకారం కరోనా టీకా ఇవ్వాల్సిన ప్రాధాన్యతా జాబితాను రూపొందిస్తామని చెప్పారు. తొలి దశలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికులు, పోలీసులు, పారామిలటరీ సిబ్బంది, హోంగార్డులు, విపత్తు నిర్వహణ స్వచ్ఛంద కార్యకర్తలు, సైనిక జవాన్లు, సంబంధ రెవెన్యూ సిబ్బందికి టీకా అందుతుందని, వీరంతా కలిపి 3 కోట్ల మందికిపైగా ఉంటారని తెలిపారు. బూత్ లెవెల్ వ్యూహాన్ని అమలు చేస్తామన్నారు. కో–విన్ అనే డిజిటల్ వేదిక ఏర్పాటు చేశామన్నారు. టీకా తొలిడోస్ తీసకున్నాక వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుందని, రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో ఈ సర్టిఫికెట్ అప్రమత్తం చేస్తుందని వివరించారు. ఓటర్ జాబితాతో.. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి కరోనా టీకా ఇచ్చిన తర్వాత 50 ఏళ్ల వయసు దాటిన వారికి, 50 ఏళ్లలోపు వయసుండి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. 50 ఏళ్లు దాటిన వారిని గుర్తించడానికి చివరిసారిగా జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితాను ఉపయోగించుకోనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని మోదీ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వారితో విస్తృతంగా చర్చించనున్నారు. కరోనా టీకా సరఫరా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనే టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన తర్వాత ప్రధాని మోదీ సీఎంలతో భేటీ అవుతుండడం ఇదే తొలిసారి. వ్యాక్సినేషన్ సన్నద్ధతలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు దఫాలు డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. మొదట కోటి మంది ఆరోగ్య సిబ్బందికి, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి డోసు ఇస్తామని ప్రకటించింది. అంటే కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్న 27 కోట్ల మందికి ముందుగా టీకా అందనుంది. -
సీఎంలతో సోమవారం ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం జరగనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. రెండు కోవిడ్ వ్యాక్సిన్లను ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించిన తరువాత ముఖ్యమంత్రులతో ఇదే ప్రధాని తొలిసమావేశం. ప్రధాని అప్పుడప్పుడు ముఖ్యమంత్రులతో కోవిడ్ సంక్షోభం గురించి మాట్లాడుతున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోన్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేస్తోన్న కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించడంతో దేశవ్యాప్తంగా భారీ టీకా కార్యక్రమానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కానున్నారు. నెగెటివ్ వచ్చినా క్వారంటైన్ తప్పదు యూకే నుంచి ఢిల్లీ చేరనున్న వారికి ప్రభుత్వం తప్పనిసరి క్వారంటైన్ విధించనున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. యూకేలో కొత్త స్ట్రెయిన్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చేవారికి చేసే కోవిడ్–19 పరీక్షలో నెగెటివ్ వచ్చినా ఏడు రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్ ఉండాల్సిందేనని చెప్పారు. అనంతరం మరో వారం పాటు హోం క్వారంటైన్లో ఉండాలని, ఈ కొత్త నియమాలు 14 వరకు ట్రయల్ రూపంలో జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. అందరికీ కరోనా టీకా న్యూఢిల్లీ/చెన్నై: కోవిడ్–19 వ్యాక్సినేషన్ సెకండ్ డ్రై రన్ శుక్రవారం దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 736 జిల్లాల్లో నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. కరోనా టీకా అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ టీకా అందుతుందని వెల్లడించారు. తొలుత ప్రాధాన్యతా వర్గాలకు టీకా అందజేస్తామన్నారు. ఆయన చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కరోనా టీకా డ్రై రన్‌ను పరిశీలించారు. వ్యాక్సిన్ లబ్ధిదారుల వివరాలను సేకరించడానికి కోవిడ్–19 వేదికను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వారికి ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్లు అందజేస్తున్నామని అన్నారు. తమిళనాడు చెంగల్పట్టులో ఉన్న హెచ్‌బీఎల్ ఇంటిగ్రేటెడ్ వ్యాక్సిన్ కాంప్లెక్స్‌లో కరోనా టీకాలు ఉత్పత్తి చేస్తామన్నారు. -
అది విశ్వాసఘాతుకమే!
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించడానికి కేంద్రం నిరాకరించడం విశ్వాసఘాతుకమని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ముఖ్యమంత్రుల భేటీని ఉద్దేశించి సోనియా బుధవారం ప్రసంగించారు. నేడు జీఎస్టీ మండలి భేటీ జరగనుండడం, సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశమున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జీఎస్టీ పరిహారం పొందడం రాష్ట్రాల హక్కు అని, దాన్ని నిరాకరించడం దేశ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడంతో సమానమేనని ఈ సందర్భంగా సోనియా వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో చేసిన చట్టాల ఆధారంగానే జీఎస్టీ పరిహారాన్ని నిర్ణయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో జీఎస్టీ ఏర్పాటయిందని, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పన్నుల విషయంలో తమ రాజ్యాంగబద్ధ హక్కులను కోల్పోయేందుకు రాష్ట్రాలు అంగీకరించినందువల్లనే జీఎస్టీ అమలు సాధ్యమైందని ఆమె వివరించారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రంపై కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పరిహార బకాయిలు పెరిగి రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కేంద్రం మాత్రం రాష్ట్రాలతో పంచుకోవడానికి వీల్లేని ఏకపక్ష సెస్‌లతో లాభాలు దండుకుంటోందని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో ఒకే విధంగా ఆలోచించే పక్షాలను సమన్వయపరిచే ఉద్దేశంతో ఈ భేటీ ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు మరిన్ని జరగాలన్నారు. ఇటీవల కేబినెట్ ఆమోదించిన నూతన విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. శాస్త్రీయ, ప్రగతిశీల, లౌకిక విలువలకు వ్యతిరేకంగా ఆ విధానముందన్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌పై తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ల వల్ల కనీస మద్దతు ధర విధానం, ప్రజా పంపిణీ వ్యవస్థ దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సృష్టించుకున్న ప్రభుత్వ రంగ సంపదలను ప్రభుత్వం అమ్మకానికి పెడ్తోందని విమర్శించారు. ముఖ్యమైన 6 విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగించారని, రైల్వేలోనూ ప్రైవేటుకు తలుపులు తీశా రని విమర్శించారు. దేశ ప్రయోజనాల కోసం వేరే రాష్ట్రాల సీఎంలతో మాట్లాడాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీని సోనియా కోరారు. మమతతో పాటు ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర), హేమంత్ సోరెన్ (జార్ఖండ్), అమరీందర్ సింగ్ (పంజాబ్), భూపేశ్ భఘేల్ (ఛత్తీస్‌గఢ్), అశోక్ గహ్లోత్ (రాజస్తాన్) సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రపతిని కలుద్దాం రాష్ట్రాల సమస్యలపై, నిధుల లేమిపై రాష్ట్రపతిని కానీ, ప్రధానిని కానీ సీఎంలంతా ఒక ప్రతినిధి బృందంగా కలుద్దామని రాజస్తాన్ సీఎం గహ్లోత్ ప్రతిపాదించారు. ఈ బృందానికి నేతృత్వం వహించాలని సోనియాను కోరారు. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు కేంద్రం ఎలాంటి సాయం అందించడం లేదన్నారు. భయమా.. పోరాటమా? కేంద్రానికి భయపడడమా? రాష్ట్రాల హక్కుల కోసం పోరాడడమా? తేల్చుకోవాలని ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. జీఎస్టీ మంచిదా? గత పన్ను వ్యవస్థ మంచిదా? అని ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉందని, ఈ సమయంలో విపక్షాలు కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని మమతా బెనర్జీ చెప్పారు. విపక్షాలపై కక్ష సాధింపునకు దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని భఘేల్ ఆరోపించారు. -
ప్రధాని నివాసంలో ముఖ్యమంత్రుల సమావేశం
-
ప్రధాని నివాసంలో సీఎంల సమావేశం
-
ప్రధాని నివాసంలో ముఖ్యమంత్రుల సమావేశం
న్యూఢిల్లీ: కొత్త ప్రణాళిక సంఘం ఏర్పాటు అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రణాళిక సంఘాన్ని పునర్వ్యవస్థీకరించడంపై చర్చించేందుకు ప్రధాని తన నివాసంలో ఆదివారం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాల వాదనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రులు కోరనున్నారు. ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నేరుగా నిధులనే అందించాలని తమ వాదన వినిపించేందుకు సన్నద్ధమయ్యారు. ఇదిలా ఉండగా కొత్త ప్రణాళిక సంఘ ఏర్పాటును వ్యతిరేకించే ఆలోచలనలో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు ఉన్నారు.