తొలి దశలో.. టీకా ఖర్చు కేంద్రానిదే | Centre to bear expenses for phase 1 of Covid vaccination | Sakshi
Sakshi News home page

తొలి దశలో.. టీకా ఖర్చు కేంద్రానిదే

Published Tue, Jan 12 2021 4:18 AM | Last Updated on Tue, Jan 12 2021 4:45 AM

Centre to bear expenses for phase 1 of Covid vaccination - Sakshi

న్యూఢిల్లీ: కరోనా టీకాను తొలిదశలో 3 కోట్ల మందికిపైగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమం ప్రారంభ దశలో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొనవద్దని సూచించారు. ప్రధాని మోదీ సోమవారం రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై చర్చించారు. భారత్‌లో కొన్ని నెలల్లోనే 30 కోట్ల మందికిపైగా ప్రజలకు ఈ టీకా ఇస్తామని వెల్లడించారు.

సైంటిస్టుల మాటే ఆఖరి మాట
ఇప్పటికే అనుమతి లభించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌తోపాటు మరో నాలుగు కరోనా వ్యాక్సిన్లు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని మోదీ వివరించారు. ప్రజలకు సమర్థవంతమైన వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సైంటిస్టులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వ్యాక్సిన్‌ అంశంలో సైంటిస్టుల మాటే ఆఖరి మాట అని తాను మొదటినుంచీ చెబుతూనే ఉన్నానని గుర్తుచేశారు.

మీ వంతు వచ్చేదాకా వేచి చూడండి
తొలి దశలో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకే కరోనా టీకా అందుతుందని, వారు మినహా ఇతరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవద్దని నరేంద్రమోదీ కోరారు. ప్రామాణికమైన ప్రొటోకాల్‌ ప్రకారం అందరికీ టీకా ఇస్తారని, తమ వంతు వచ్చేవరకు వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారిపై పోరాటంలో మనం ముందంజలో ఉన్నప్పటికీ అజాగ్రత్త పనికిరాదని హెచ్చరించారు. కరోనా వ్యాక్సినేషన్‌పై వదంతులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.

బూత్‌లెవల్‌ వ్యూహం
సైంటిస్టులు, నిపుణుల సూచనల ప్రకారం కరోనా టీకా ఇవ్వాల్సిన ప్రాధాన్యతా జాబితాను రూపొందిస్తామని చెప్పారు. తొలి దశలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికులు, పోలీసులు, పారామిలటరీ సిబ్బంది, హోంగార్డులు, విపత్తు నిర్వహణ స్వచ్ఛంద కార్యకర్తలు, సైనిక జవాన్లు, సంబంధ రెవెన్యూ సిబ్బందికి టీకా అందుతుందని, వీరంతా కలిపి 3 కోట్ల మందికిపైగా ఉంటారని తెలిపారు. బూత్‌ లెవెల్‌ వ్యూహాన్ని అమలు చేస్తామన్నారు. కో–విన్‌ అనే డిజిటల్‌ వేదిక ఏర్పాటు చేశామన్నారు. టీకా తొలిడోస్‌ తీసకున్నాక వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుందని, రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో ఈ సర్టిఫికెట్‌ అప్రమత్తం చేస్తుందని వివరించారు.

ఓటర్‌ జాబితాతో..
హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి కరోనా టీకా ఇచ్చిన తర్వాత 50 ఏళ్ల వయసు దాటిన వారికి, 50 ఏళ్లలోపు వయసుండి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. 50 ఏళ్లు దాటిన వారిని గుర్తించడానికి చివరిసారిగా జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓటర్‌ జాబితాను ఉపయోగించుకోనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement