కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడి ఏడెనిమిది నెలలవుతున్నా అదింకా దారికి రాలేదు. మన దేశంతోపాటు ప్రపంచ దేశాలన్నిటా ఇప్పటికీ ఆ వైరస్ దోబూచులాడుతూనే వుంది. ఈలోగా అన్ని దేశాలూ తమ తమ ఆర్థిక వ్యవస్థలను చక్కబరుచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 2.65 లక్షల కోట్ల విలువైన ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.
ఆమె దీన్ని ఆత్మనిర్భర్ ప్యాకేజీ 3.0 అని నామకరణం చేశారు. లోగడ వెలువరించిన రెండు ఉద్దీపన ప్యాకేజీలనూ కలుపుకుంటే ఇంతవరకూ కరోనా అనంతర ఆర్థిక వ్యవస్థను చక్క దిద్దడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 29 లక్షల 87వేల 641 కోట్ల మొత్తాన్ని వ్యయం చేస్తున్నట్టవుతుందని(జీడీపీలో 15శాతం) ఆమె లెక్క చెప్పారు. ఇందులో ప్రభుత్వం వాటా 9 శాతంకాగా, రిజర్వ్‌బ్యాంకు వాటా 6శాతం. ఇది బహుశా 2021–22 బడ్జెట్‌కు ముందు ప్రకటించిన చివరి ఉద్దీపన అయివుండొచ్చు.
మన ఆర్థిక వ్యవస్థ స్వల్పంగానైనా కోలుకుంటున్న సూచనలు కనబడుతున్నాయని ఆర్థిక నిపుణులు కొందరు సంతోషపడుతున్నారు. విద్యుత్ వాడకం పెరగడం, రైల్వేల్లో సరుకు రవాణా, ఈ–వే బిల్లులు పుంజుకోవడం, బొగ్గు ఉత్పత్తి పెరగడం, జీఎస్‌టీ వసూళ్ల ముమ్మరం వంటివి అందుకు ఉదాహరిస్తున్నారు. మన ఆర్థికవ్యవస్థ దాదాపు కరోనా ముందునాటి పరిస్థితికి చేరుకుంటోందని వారి అంచనా. మన ఆర్థిక వ్యవస్థకు తగిలే దెబ్బపై గతంలోని అంచ నాలను అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఈమధ్యే స్వల్పంగానైనా సవరించుకున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే కేంద్రం ప్రకటించిన తాజా ప్యాకేజీ వారిని సంతృప్తిపరిచి వుండొచ్చు. ఈ ఉద్దీపనలు పట్టణ ప్రాంతాల్లో కార్మికుల సంఖ్యను పెంచడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, రుణలభ్యత కోసం ఇబ్బందులు పడుతున్న రంగాలను ఆదుకోవడానికి, దేశీయ తయారీరంగం పుంజుకోవడానికి, స్థిరాస్తి రంగం మళ్లీ పరుగులెత్తడానికి తోడ్పడతాయని కేంద్రం చెబుతోంది. రైతులకు ఎరువుల సబ్సిడీగా రూ. 65,000 కోట్ల మేర ప్రకటించారు. ఇదికూడా గ్రామీణ ఉపాధికి ఆసరాగా నిలుస్తుందని భావిస్తోంది.
అయితే ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీ అయినా, లోగడ ప్రకటించినవైనా ప్రభుత్వ దృష్టి ఎంతసేపూ ఉత్పత్తి వైపున్నది తప్ప గిరాకీ వైపులేదన్నది స్పష్టమవుతోంది. కొత్తగా చేర్చుకునే ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్ మొత్తాన్ని రెండేళ్లపాటు కేంద్రమే చెల్లించడం...చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారుల కోసం ఇంతకు ముందు ప్రకటించిన అత్యవసర రుణ వితరణ హామీ పథకాన్ని పొడిగించడం, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ప్రోత్సాహకాలు కల్పించడం, గ్రామీణ ఉపాధి హామీకి అదనపు నిధులివ్వడం, స్థిరాస్తి రంగంలోని బిల్డర్లకూ, కొనుగోలుదారులకూ ఆదాయ పన్ను ఉపశమనం వంటివన్నీ ఈ మాదిరివే.
ఇందువల్ల ఆయా సంస్థలు పెద్దయెత్తున ఉద్యోగ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటాయని... ఆరకంగా జనంలో కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా. ఇందులో తప్పుబట్టవలసింది ఏమీ లేదు. కానీ తాము ఉత్పత్తి చేసే సరుకుకు బయట డిమాండు వుంటుందన్న హామీ వుంటే తప్ప ఏ సంస్థా రుణాలు తీసుకోవడానికి ముందుకు రాదు. ఒక్కసారి వెనక్కెళ్లి చూస్తే కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడటానికి ముందు కూడా ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా వున్న వైనాన్ని గమనించి ఎవరూ రుణాలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. తీసుకునేవారున్నా రుణాలివ్వడానికి బ్యాంకులు భయపడే పరిస్థితులున్నాయి.
బయట గిరాకీ పెద్దగా లేదని తెలిసినపుడు అప్పులిచ్చేవారికీ, తీసుకునేవారికీ కూడా ఇలాంటి భయాలు సహజమే. పైగా తాజా ఉద్దీపనలో కార్పొరేట్ రంగానికి, విదేశాల నుంచి వచ్చే కంపెనీలకు పెద్ద పీట వేశారని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన వివిధ సంఘాల కన్సార్షియం సీఐఏ ఆరోపిస్తోంది. గత ప్యాకేజీల్లో ఇచ్చిన రుణ వితరణ వెసులుబాట్లకు సంబంధించిన గడువు పొడిగించడం మినహా కొత్తగా చేసిందేమిటని ప్రశ్నిస్తోంది.
లక్షలాదిమందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లకు ప్రకటించిన రుణ వితరణ పథకాల వినియోగం తగినంతగా లేదని వస్తున్న కథనాలు ఆందోళన కలిగిస్తాయి. అందుకుగల అడ్డంకులేమిటో పాలకులు గమనించారా? లేదని ఆ సంస్థలు చెబు తున్నాయి. ఆ రుణాలకు సవాలక్ష నిబంధనలు పెడుతున్నారని ఆమధ్య కొన్ని సంస్థలు వాపోయాయి. కార్మికులకు ఉపాధి కల్పించలేకపోవడానికి కేవలం వారి ఈపీఎఫ్ మొత్తం చెల్లించే స్థోమత లేకపోవడంవల్లనేనని, రెండేళ్ల రాయితీతో అంతా సర్దుకుంటుందని కేంద్రం భావించడం సరికాదు.
ఈఎంఐలపై మారటోరియం గడువు ముగిశాక మొన్న సెప్టెంబర్‌లో 21 శాతం చెక్కులు వెనక్కొచ్చాయని సీఐఏ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. మున్ముందు ఇదింకా పెరగొ చ్చని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. జనం కొనుగోలు శక్తి పెరిగితే ఉత్పత్తయిన సరుకుకు గిరాకీ ఏర్పడుతుంది. అందుబాటులో తగినంత మొత్తం వుంటే తమ అవసరాలు తీర్చుకోవడానికి జనం వెనకాడరు. మన ఆర్థిక వ్యవస్థకైనా, ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలకైనా ఇదే వర్తిస్తుంది. ప్రజానీకానికి నగదు బదిలీ చేస్తే పొదుపుచేస్తారు తప్ప ఖర్చు చేయరని కొందరు ఆర్థికవేత్తలు పెదవి విరుస్తున్నారు.
కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం సైతం ఆమాటే అన్నారు. ప్రపంచంలో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు మొదలుకొని కొన్ని చిన్న దేశాల వరకూ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి నగదు బదిలీని ఒక మార్గంగా ఎంచుకున్నారు. అందువల్ల ఫలితాలు కనబడుతున్నాయి కూడా. ఉద్యోగ కల్పనకు సమాంతరంగా దాన్నికూడా అమలు చేస్తే మంచిది. అది అసలైన ఆత్మనిర్భరతకు తోడ్పడుతుంది. ఆ దిశగా కేంద్రం ఆలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment