కాళ్ల బేరం ఖరీదెంత? | Sakshi Editorial On Chandrababu And Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

కాళ్ల బేరం ఖరీదెంత?

Published Sun, Sep 3 2023 12:27 AM | Last Updated on Sun, Sep 3 2023 12:45 PM

Sakshi Editorial On Chandrababu And Nirmala Sitharaman

‘నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవిందా’ అంటారు. అది ఎగిరే రాబందుల గురించి మాత్రమే. వేలాది మందిని పీడించి పిప్పిచేసిన పెత్తందారీ రాబందుల సంగతి కాదు. లక్షలాది మంది మూలుగల్ని పీల్చేసిన రాజకీయ రాబందుల విషయం కాదు. ఈ రాబందులకు ఒక్క గాలివాన చాలదు. ఇంకో ప్రచండ మారుతం కావాలి. ఝంఝానిలం పరివ్యాప్తం కావాలి.

దావానలమై దహించాలి. కానీ, మొదటి గాలివాన లోంచే రానున్న ముప్పును ఆఘ్రాణించే నేర్పు వీటి నాసికలకున్నది. ఆ గ్రహింపు రాగానే వాటి రెక్కల పొగరు తాత్కాలికంగా ముడుచుకుపోతుంది. నక్క వినయాలు ఒంటబడతాయి. నంగినంగి మాట్లాడే కుటిలత్వం, వంగివంగి ప్రణమిల్లే అతి వినయం అలవాటవుతాయి.


ఆతడనేక స్కాములయందు ఆరియు తేరిన వృద్ధ రాజకీయ వృకోదరుడు. మొదటి తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిత్వంలోనే అవి నీతి కేసులపై 20 స్టేలు తెచ్చుకోగలిగిన తాంత్రికుడు. రెండో దఫా ఐదేళ్ల పాలనలో మరో డజన్‌ స్కాములకు వ్యూహకర్త. ఈసారి లెక్క లక్షల కోట్లలో! ఎందుకో మంత్రం పారట్లేదేమో నన్న అనుమానం మొదలైంది.

ముప్పు ముంచుకొస్తున్నదని ముక్కుపుటాలు హెచ్చరిస్తున్నవి. గుండె లోతుల్లోంచి తీతువు కూత వినిపిస్తున్నది. ఎక్కడో ఒక జంబూకం ఊళ వేస్తున్నది. సీనియర్‌ మోస్ట్‌ రాజకీయవేత్త వేగంగా స్పందించారు. ఎక్కడె క్కడో తీగలు కలిపారు. ఫలితంగా సమీప బంధువుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి లభించింది. ఆమె సహకారంతో మరోసారి ఢిల్లీ ‘పవర్‌’ హౌస్‌లో పాదం మోపారు.


ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎదుట వంగివంగి విన్నపాలు చేసుకున్నారు. తన కంటే ఎంతో చిన్నదైన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఎదుట చేతులు కట్టుకొని నిలుచున్నారు.. క్లాస్‌ టీచర్‌ ఎదుట పనిష్‌ మెంట్‌ కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్‌ మాదిరిగా! ఆదాయ పన్ను (ఐటీ) విభాగం ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటుందన్న విషయం తెలిసిందే!

ఇటీవల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ వారు చంద్రబాబుకు ఒక నోటీసు ఇచ్చారు. దీనిపై ఒక వార్త ‘హిందూస్థాన్‌ టైమ్స్‌’లో వచ్చింది. మరుసటి రోజున ‘దక్కన్‌ క్రానికల్‌’లో నోటీస్‌ కాపీతో సహా మరింత వివరంగా వార్త అచ్చయ్యింది. అయినా చంద్రబాబు నుంచి గానీ, ఆయన పార్టీ నుంచి గానీ ఎలాంటి స్పందనా లేదు.  యెల్లో మీడియా కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తున్నది. ఎందుకంటే బుకాయించడానికి ఇక్కడ ఆస్కారం లేదు. చడీచప్పుడు లేకుండా స్టే తెచ్చుకోవాలి. స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబుది గిన్నిస్‌ రికార్డు.


మొన్నటి నోటీసు కంటే ముందే ఐటీ శాఖ చంద్రబాబుకు ఇంకో నోటీసు ఇచ్చింది. రెండింటి సారాంశం ఒక్కటే. అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం కోసం కాంట్రాక్టులు పొందిన ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు అందుకు ముడుపుల కింద చెల్లించిన రూ.118 కోట్లు వివిధ మార్గాల ద్వారా చంద్రబాబుకు చేరాయి. ఈ ఆదాయాన్ని చంద్రబాబు వెల్లడించలేదు.

ఐటీ శాఖ వారు ముంబయ్‌లో మనోజ్‌ వాసు దేవ్‌ పార్ధసాని అసోసియేట్స్‌ సంస్థలో సోదా చేసినప్పుడు వారికి అనుకోకుండా చంద్రబాబు తీగ దొరికింది. ఆనవాయితీ ప్రకారం వారు చంద్రబాబుకు నోటీసు పంపించారు. తనకు ముడుపులు వచ్చాయా, లేదా అనే విషయాల జోలికి వెళ్లకుండా టెక్నికల్‌ అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ఐటీ శాఖకు సమాధానం ఇచ్చారు.



తనకు నోటీసు ఇచ్చిన అధికారి పరిధి లోకి తాను రాననే దబాయింపు తప్ప కేసు మెరిట్‌ జోలికి చంద్రబాబు వెళ్లలేదు. చంద్రబాబు తన మీద వచ్చిన అన్ని రకాల కేసుల్లోనూ ఇటువంటి టెక్నికల్‌ పాయింట్లను వాడు కోవడం, వ్యవస్థలను లిటిగేషన్లతో ప్రభావితం చేయడం వంటి పద్ధతుల ద్వారానే స్టేలు పొందుతూ వచ్చారు, అయితే ఈ కేసులో బాబు అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఐటీ శాఖ రెండో నోటీసు ఇచ్చింది.

ఈ 118 కోట్ల రూపాయల ముడుపులు అనేవి టిప్‌ ఆఫ్‌ ది ఐస్‌బర్గ్‌ మాత్రమే. వేరే కేసులో సోదాలు జరుపుతుండగా యథాలాపంగా దొరికింది మాత్రమే. దీనిమీద మరికొంత ముందుకెళ్లిన ఐటీ అధికారులకు విస్తుపోయే ఆధారాలు లభించినట్లు సమాచారం. అమరావతి తాత్కాలిక భవనాల నిర్మాణంలోనే బాబు అందుకున్న ముడుపులు వేల కోట్లలో ఉన్నాయట! వీటికి సంబంధించిన ఆధారాలన్నీ అధికారులు సేకరించారు.


నోటీసులకు సంబంధించిన 118 కోట్ల రూపాయలను వెల్లడించనందుకు గాను అంతకు రెట్టింపు మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాలి. పన్నెండు శాతం వడ్డీ అదనం. ఆదాయం పన్ను శాఖ నోటీసులను గౌరవించి చంద్రబాబు ఆ పెనాల్టీని చెల్లిస్తే ముఖ్యమంత్రిగా ఉండి లంచాలను తీసుకున్నట్టు అంగీకరించినట్టే! అలా అంగీకరించినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 8ఏ ప్రకారం అధికార పదవులకు అనర్హుడవుతాడు. దాంతోపాటు ఐపీసీ సెక్షన్‌ 409ని కూడా ప్రయోగించవచ్చు.

నేరపూరిత విశ్వాస ఘాతుకానికి గాను పదేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుంది. అవినీతి నిరోధక చట్టం కింద పదేళ్ల జైలు, జరిమానా వేయవచ్చు. మనీలాండరింగ్‌ చట్టాన్ని కూడా ప్రయోగించవచ్చు. ఈ లంచాల్లో భాగంగానే ఆయన జూబ్లీ హిల్స్‌ ఇంటిని నిర్మించినట్టు రుజువైతే బినామీ చట్టం కింద ఆ ఇంటి మార్కెట్‌ విలువలో 25 శాతం జరిమానా విధించవచ్చు. నోటీసులకు స్పందించకపోతే కూడా జైలుశిక్షకు ఆస్కారము న్నది. కనుక ముందుకు వెళ్లలేడు, వెనక్కు వెళ్లలేడు. ఇప్పుడాయ నకు కావలసింది స్టే!


చంద్రబాబు, ఆయన గురువు రామోజీల తిరుమంత్రం స్టే! సాంకేతిక కారణాలు చూపి దబాయించడం రామోజీకి పెన్నుతో పెట్టిన విద్య. దాన్ని ఆయన వెన్నతో పెట్టి చంద్రబాబుకు నేర్పించారు. ఆయన ఈ కళలో పరిపూర్ణత సంపాదించి వ్యవస్థలను నియంత్రించగలగడం దాకా ఎదిగారు.

తాజాగా చిట్‌ఫండ్స్‌ కేసులోనూ రామోజీది ఇదే వరస! చిట్‌ఫండ్స్‌ చట్టాన్ని రామోజీ దారుణంగా ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం ఆధారాలను చూపిస్తున్నది. రామోజీ మాత్రం చట్టాన్ని ఉల్లంఘించానని గానీ, ఉల్లంఘించలేదని గానీ చెప్పరు. ఎవరూ ఫిర్యాదు చేయందే కేసెట్లా పెడతారని వాదిస్తారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోతే చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించవచ్చనేది గురుశిష్యుల సిద్ధాంతం.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను ప్రలోభపెడుతూ చంద్రబాబు అడ్డంగా బుక్కయిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనతో బేరమాడుతూ చంద్రబాబు మనిషి రేవంత్‌రెడ్డి ఉన్నారు. అక్కడ డబ్బుల బ్యాగ్‌ చేతులు మారిన వీడియో ఉన్నది. చంద్రబాబును ఎమ్మెల్యేతో మాట్లాడించడం కోసం రేవంత్‌రెడ్డి ఫోన్‌ కలిపిన దృశ్యం ఉన్నది.

‘మావాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ’ అన్న బాబు కంఠస్వరం వినిపించింది. అంత చక్కటి ఇంగ్లిష్‌ ఈ దేశంలో బాబు తప్ప ఇంకెవ్వరూ మాట్లాడలేరని కేటీఆర్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌ కూడా ఉన్నది. అయినా సరే అసలు విషయాన్ని వదిలేసి ‘నా ఫోన్‌ను ఎట్లా ట్యాప్‌ చేస్తార’న్న బాబు దబాయింపు కూడా జ్ఞాపకం ఉన్నది.

ఇదే పద్ధతిలో ఇప్పటిదాకా ఆయన ఇరవై స్టేలు తెచ్చు కున్నారు. ఆయన అవినీతి మీద ఆధారాలతో సహా లక్ష్మీపార్వతి రెండుసార్లు వేసిన కేసుల్లో రెండు స్టేలు. ఐఎమ్‌జీ భారత్‌ అనే ఠికానా లేని కంపెనీకి అత్యంత ఖరీదైన ప్రాంతంలో 850 ఎకరాలు కేటాయించిన కేసులో స్టే. ఏలేరు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా తెచ్చుకున్న స్టే.

ఇంకా మద్యం ముడుపుల కేసు – వగైరాలు ఈ స్టేల జాబితాలో ఉన్నాయి. ఇప్పుడెందుకో తాజా ఐటీ కేసు కొంచెం భిన్నంగా తోస్తున్నది. ఈ నోటీసుల వ్యవహారం బయటకు రాకుండా, ఐటీ అధికారులు ఇంకా ముందుకు వెళ్లకుండా చేసేందుకు బాబు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకైతే ఫలితాలనివ్వలేదు.

ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇటువంటి ఐటీ నోటీసులు మరికొన్ని రావచ్చు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం ఇటువంటిదే! ఈ పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేసిన 371 కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా ప్రయాణం చేసి బాబు గారింటికి చేరుకున్నాయి. ఇక్కడ స్కిల్లూ లేదు, డెవలప్‌మెంటూ లేదు. ఇప్పటికే ఈడీ రంగప్రవేశం చేసి నలుగురిని అరెస్టు చేసింది. రాజధాని కుంభకోణాన్ని ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ స్కామ్స్‌’ అంటున్నారు.

ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి పురాణంగా ఈ స్కామ్‌ చరిత్ర పుటల కెక్కబోతున్నది. ల్యాండ్‌ పూలింగ్, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, పూలింగ్‌ పరిధి నుంచి తప్పించినందుకు క్విడ్‌ ప్రో కో ప్యాలెస్, అసైన్డ్‌ కుంభకోణం, సింగపూర్‌ కన్సా ర్టియం... ఇలా అనేక ఉప కుంభకోణాలతో కూడిన భారీ స్కామ్‌ ఇది. ఈ కేసుల్లోనే ఇరుక్కున్న సింగపూర్‌ మంత్రి, బాబు మిత్రుడు ఈశ్వరన్‌ ఇప్పటికే అరెస్టయ్యాడు. ఇంకో డజన్‌ స్కామ్‌లు విచారణ కోసం వెయిటింగ్‌ లిస్టులో ఉన్నాయి.

ఐటీ కేసు ముందుకు కదలడమంటే కేసుల తేనెతుట్టెను కదిలించినట్టే! కనుక అదిక్కడ ఆగాలి. స్టే మంత్రం ఫలించాలి. అందుకోసం ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఆంతరంగిక సమాచారం. ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని ఎవరూ తిట్టనన్ని తిట్లు తిట్టిన బాబు ఆ తర్వాత ఎవరూ పొగడని స్థాయిలో పొగుడుతున్న వైనాన్ని జనం గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్డీఏలో చేరిపోయి బీజేపీ – జనసేనల తోడ్పాటుతో అధికారంలోకి రాగలిగితే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని బాబు భావిస్తున్నట్టు విని కిడి. బీజేపీ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి.

దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థతో కేంద్రం చేయించిన సర్వేలో జగన్‌మోహన్‌రెడ్డికి 53 శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్టు వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో బాబు అవినీతి భారాన్ని మోయడం కంటే జనసేన – బీజేపీ కూటమిగా ఏర్పడితే 2029 ఎన్నికల నాటికి ప్రధాన ప్రత్యర్థి కూటమిగా అవతరించవచ్చని దాని ఆలోచనగా చెబుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఏ స్థాయికి తగ్గయినా సరే కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు.


బీజేపీ – జనసేనలకు కలిపి 75 అసెంబ్లీ సీట్లు, 12 లోక్‌సభ సీట్లను తాజాగా ప్రతిపాదించారట. పార్టీలోని విశ్వస నీయ వర్గాల ద్వారా ఇంకా ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తున్నది. ఆయన ఎంత నిస్పృహలో ఉన్నారంటే, ‘తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇస్తే, పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కూడా వెనకాడకపోవచ్చ’ని చెబుతున్నారు. ఇటువంటి దయనీయ స్థితి ఏర్పడితే దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని ఉన్న శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement