గాడ్‌ఫాదర్ నవల ఎపిగ్రాఫ్... బిహైండ్ ఎవ్రీ ఫార్చూన్, దేర్ ఈజ్ ఎ క్రైమ్! (ప్రతి అదృష్టం వెనుక నేరమో, ఘోరమో ఉంటుందని తాత్పర్యం.) ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి రెండు దారులుంటాయి. ఒకటి: స్వయంకృషి, రెండు: అదృష్టం. మొదటి దారిలో వెళ్లడానికి పట్టుదల కావాలి. ప్రతిభ ఉండాలి. ఏళ్లకేళ్లు నిరీక్షించాలి. కష్టాల కొలిమిలో సానబట్టు కోవాలి. అడ్డంకులను ఓర్పుగా అధిగమించగలగాలి. హై రిస్క్ రోడ్!
రెండో దారి అదృష్టం. కొంతమందికి యథాలాపంగా లాటరీ మాదిరిగా తగలొచ్చు. వీరి సంఖ్య బహుస్వల్పం. కోటి కొక్కరు ఉండవచ్చు. అదృష్టవంతుల్లో అత్యధికులు అక్ర మార్కులే! మాకియవెలీ శిష్యులే. మోసం, కపటం వారి స్వభావం. చట్టం, న్యాయం వీరికి పట్టవు. నిత్యం ఉషోదయంతోపాటు ఓ అసత్యాన్ని వెలిగిస్తారు. వక్రమార్గదర్శులు వీరు.
అరవయ్యేళ్ల కింద ఈ రెండో దారిలో బయల్దేరిన ఒక పెద్దమనిషి నమ్మకం అనే మాట గొంతు నులిమి, విశ్వస నీయతకు శిలువేసి, మెట్టుమెట్టుకూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పైస్థాయికి చేరి స్వార్థశక్తులకు మార్గదర్శిగా నిలబడిపోయారు.
నేర సామ్రాజ్యాల అంతిమ లక్ష్యం ‘పవర్’ మీద పట్టు బిగించడమే! ఈ మార్గదర్శి కూడా అదే బాటలో పయనించారు. పిడికిట్లోకి ‘పవర్’ను తెచ్చుకున్నారు. చట్టాలను కాలదన్నారు. జనం సొమ్ముతో వేలకోట్లకు పడగెత్తారు. పైకి మాత్రం ధర్మ ప్రబోధకుడి మాదిరిగా ఫిలిం సిటీలో పీఠం వేసుకొని కూర్చు న్నారు. ఒక దశలో ముక్కోటి దేవతలను కూడా తన కాంపౌండ్‌లోకే తెచ్చేసుకుందామని ఆలోచించారు. ‘ఓం సిటీ’ పేరుతో ఓ ప్రణాళిక తయారుచేసుకున్నారు. దైవకార్యంగా భావించి ఇంకో నాలుగొందల ఎకరాలను కేటాయించాలని తెలంగాణ ప్రభు త్వానికి అర్జీ పెట్టుకున్నారు. కానీ, దైవకృప లేకపోవడం వల్ల అది అక్కడే ఆగిపోయింది.
రామోజీ కొందరికి స్వామీజీ. కొందరికి కులగురువు. రాజకీయ, వ్యాపార రంగాల్లోని స్వార్థశక్తులకు గాడ్‌ఫాదర్. ఈ గాడ్‌ఫాదర్‌కు పట్టిన ప్రతి అదృష్టం వెనుక నేరం ఉంది. ఘోరం ఉంది. అసత్యముంది. మోసం, దగా దాగున్నాయి. ఎన్టీ రామా రావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని స్వార్థశక్తుల రాజకీయ వేదికగా మార్చడంలో కీలకపాత్ర రామోజీదే! ఇందుకు ఆయ నకు కలిసొచ్చిన అస్త్రం చంద్రబాబు. వ్యాపార రంగంలోని తన లక్షణాలను రాజకీయ రంగంలో కలిగి వున్న అపూర్వ సహో దరునిగా ఆయనకు బాబు కనిపించారు.
ఇద్దరూ సుందోపసుందుల వలె కలిసిపోయారు. మీడియాను మాఫియాగా మార్చి పారేశారు. గోబెల్స్ ప్రచారాలతో చెలరేగిపోయారు. ముప్పయ్యే ళ్లుగా తెలుగునాట వీరు సృష్టించిన రాజకీయ కాలుష్యపు విష ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలనకు వ్యతిరేకంగా ఈ ముఠా సృష్టిస్తున్న అసత్య ప్రచారం, కల్పిస్తున్న కట్టుకథలు, సృష్టిస్తున్న విద్వేషం, కక్కుతున్న విషం... ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకున్నది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల నిర్వహణలో రామోజీరావు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించిన అంశాలు ఒక్కొక్కటిగా బయట కొస్తున్నాయి. ఇంతకాలం రామోజీని మీడియా మొఘల్‌గా, పద్మభూషణుడిగా అమాయకంగా నమ్మిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన అరవయ్యో దశకంలో వేసిన తొలి అడుగే వంచన, ద్రోహచింతన అనే థీమ్‌తో పడింది. తొలి భాగం ‘రామోజీ: ది రైజ్’ నమ్మకద్రోహంతోనే మొదలైంది.
చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం రెండో భాగం ‘రామోజీ: ది రూల్’ నడిచింది. ఇప్పుడిక ఆఖరిభాగం ‘రామోజీ: ది ఫాల్’ విడుదలకు సిద్ధంగా ఉన్నది. అందుకే పతన భయం రామోజీ మీడియాను వణికిస్తున్నది. అదుపు తప్పిన ఉన్మాదంతో అది ఊరేగుతున్నది. అన్ని విలువలనూ విప్పేసి నగ్నంగా నర్తిస్తున్నది.
కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన జీజే రెడ్డి అనే ఆయన ఆరోజుల్లో ఢిల్లీలో చక్రం తిప్పుతుండేవాడు. 1960, 70 దశ కాల్లో అధికార, రాజకీయ వర్గాల్లో ఆయన పలుకుబడి పతాక స్థాయిలో ఉండేది. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ఢిల్లీకి వెళ్లిన రామోజీ సొంత జిల్లావాడైన జీజే రెడ్డి దగ్గర గుమాస్తాగా కుదురుకున్నాడు. మార్గదర్శి, ఈనాడు పత్రికల స్థాపన జీజే రెడ్డి ఆలోచనే అని అప్పటి రామోజీ సహచరులు చెబుతున్నారు. మార్గదర్శిలో పెద్దమొత్తంలో పెట్టుబడులు కూడా ఆయనవే! రామోజీ ప్రారంభ వాటా 10 రూపాయలు మాత్రమే! ‘ఈనాడు’కు ఆదిలో పెట్టుబడిని సమకూర్చింది కూడా జీజే రెడ్డేనని చెబుతారు.
విశాఖ ఎడిషన్ కోసం తన పలుకుబడితో తూర్పు జర్మనీ నుంచి సెకండ్ హ్యాండ్ ప్రింటింగ్ మిషన్ కూడా ఆయన తెప్పించారట. జీజే రెడ్డి ద్వారా ఢిల్లీలోని పలుకుబడి గల నాయకులతో రామోజీ కూడా పరిచయాలు పెంచుకున్నాడు. తర్వాత కాలంలో తన వ్యాపార సామ్రాజ్య విస్తరణకు ఈ పరిచయాలు పనికొచ్చాయి. 1977లో జీజే రెడ్డి మీద దేశద్రోహం కేసు నమోదైంది. కేసును విచారించిన ఢిల్లీ కోర్టు ఆయనను ద్రోహిగా నిర్ధారించింది. ఆయన ఆస్తులన్నీ జప్తు చేయాలని ఆదేశించింది.
ఆయన దేశం విడిచి పారిపోయారు. ఆస్తులన్నీ జప్తు చేశారు. కానీ రామోజీ సంస్థల్లో ఉన్న అధికారిక షేర్లను ఆయన ప్రభుత్వానికి సరెండర్ చేయలేదు. జీజే రెడ్డి పారిపోయే నాటికి డైరెక్టర్ హోదాలో ‘మార్గదర్శి’లో ఆయనకున్న షేర్లు ప్రభుత్వానికి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకనో ప్రభుత్వం కూడా చొరవ చూపలేదు. ఆ తర్వాత కాలంలో జీజే రెడ్డి కుమారుడు ఆస్తుల విషయంలో రామోజీని కలిశాడట! కానీ రామోజీ మాత్రం అతడిని చీకొట్టి పంపించాడని తెలిసింది. అలా మొదలైంది ‘రామోజీ: ది రైజ్’.
‘ఈనాడు’ను మొదట విశాఖపట్నం నుంచి ప్రారంభించారు. అందుకోసం సీతమ్మధారలో 2.78 ఎకరాల స్థలాన్ని,అందులో 40 వేల అడుగుల్లో నిర్మితమైన భవనాలను నెలకు మూడు వేల చొప్పున 33 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నారు. భూమి యజమాని పేరు మంతెన ఆదిత్యవర్మ. గడువు ముగిసిన తర్వాత వర్మ ఖాళీ చేయమని అడిగినా రామోజీ అంగీకరించలేదు. దానితో ఆయన కేసు వేశారు. ఇదిలా ఉండగా అందులో ఉత్తర భాగంలో కొంత భూమిని రోడ్డు వేయడానికి ప్రభుత్వం తీసుకున్నది.
ఇందుకు బదులుగా వెనుక వైపున్న స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. లెక్కప్రకారం ప్రభుత్వం ఇచ్చే స్థలం భూయజమాని ఆదిత్యవర్మకు చెందాలి. కానీ పలుకుబడితో రామోజీ తన కొడుకు పేరు మీద రిజిస్టర్ చేశారు. వర్మ దాని మీద కూడా కేసు వేశారు. అసలు రోడ్డుకు తాను స్థలమే ఇవ్వలేదనీ, ముందునుంచే అక్కడ రోడ్డు ఉన్నదనీ జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను ఫోర్జరీ చేసి రామోజీ కోర్టుకు సమర్పించారు. అది ఫోర్జరీ డాక్యుమెంట్‌గా కోర్టులో నిర్ధారణ అయింది.
కుట్ర, ఫోర్జరీ, మోసపూరిత చర్యల కింద రామోజీపై కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇదీ రామోజీ ఘనచరిత. ‘ఈనాడు’ విజయవాడ, హైదరాబాద్ స్థలాల విషయంలోనూ యజమానులను రామోజీ ముప్పతిప్పలు పెట్టాడు. విజయవాడ స్థలం స్వయానా ఆయన తోడల్లుడు ‘డాల్ఫిన్’ అప్పారావుకు చెందినది. రామోజీ మోసపూరిత చర్యల గురించి అప్పారావు పలుమార్లు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ఆయనకు మానవత్వం లేశమాత్రమైనా లేదనీ, ఆయనొక పయోముఖ విషకుంభమనీ అప్పారావు తీవ్రంగా విమర్శించారు.
రామోజీ ఫిలిం సిటీలోని భూముల విషయంలో జరిగిన అక్రమాలకు లెక్కేలేదు. అసైన్డ్ భూములను, చెరువు భూములను, పోరంబోకు భూములను కబ్జా చేశారు. అవే కాకుండా ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని దారుణంగా ఉల్లంఘించారు. ఫిలిం సిటీలో 1,363 ఎకరాలు సీలింగ్ చట్టానికి మించి ఉన్నదని రెవిన్యూ అధికారులు సర్వే చేసి నిర్ధారించారు. నోటీసులిచ్చారు. కథ అక్కడే ఆగిపోయింది.
రామోజీ ఆక్రమించిన భూముల్లో 500 మంది స్థానిక పేదలకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇళ్లస్థలాలు మంజూరు చేసింది. వాటిని లబ్ధిదారులకు ఇప్పించడంలో అధికారులు, స్థానిక నేతలు ఇప్పటికీ చొరవ చూప లేకపోతున్నారు. ఫిలింసిటీలో చిట్‌ఫండ్ కంపెనీకి కూడా 137 ఎకరాల భూమి ఉన్నది. ఇది చందాదారుల సొమ్ముతో కొన్నారా? కమీషన్ సొమ్ముతో కొన్నారా? అనే అంశంపై క్లారిటీ లేదు.
నాన్‌బ్యాంకింగ్ సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదన్న ఆర్‌బీఐ చట్టాన్ని ఉల్లంఘించి మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరు మీద సుమారు 2,600 కోట్ల డిపాజిట్లు వసూలు చేశారు. అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ కేంద్ర ఆర్థికశాఖ, ఆర్‌బీఐలకు ఫిర్యాదు చేశారు. రామోజీ చేసిన వితండవాదాన్ని ఆర్‌బీఐ అంగీకరించలేదు.
సంస్థపై కేసు నమోదు చేయాలని సూచించింది. ఆమేరకు కేసు పెట్టారు. డిపాజిట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించేస్తానని ఆర్‌బీఐకి రామోజీ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. హడావిడిగా ఫైనాన్షియర్స్ సంస్థను మూసేశారు. కేసు దర్యాప్తులో ఉండగా అలా మూసేయడం కూడా నేరం. చేసిన తప్పుల తాలూకు ఆధారాలు దొరక్కుండా ఆయన ఆ నేరానికి ఒడిగట్టారు. డిపాజిటర్ల జాబితాను కూడా ఈనాటికీ విడుదల చేయలేదు. అది విడుదల చేస్తే తప్ప అది నల్లధనమో, తెల్లధనమో నిర్ధారణ కాదు. తాజాగా ఏపీ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ల చొరవతో జాబితా వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏం చేస్తారో చూడాలి!
ఫైనాన్షియర్స్‌ను మూసివేసినా ఆ తరహా వ్యాపారాన్ని చిట్‌ఫండ్స్ ముసుగులో కొనసాగిస్తున్నారని వెల్లడవుతున్నది. 1982 కేంద్ర చట్టం ప్రకారం చిట్‌ఫండ్ సంస్థలు ఇతర వ్యాపారాలు చేయరాదు. కానీ, చిట్‌ఫండ్ కంపెనీ తన చందా దారుల సొమ్మును ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లోకి, మార్గదర్శి చిట్‌ఫండ్స్ కర్ణాటక, తమిళనాడు విభాగాల్లోకి అక్ర మంగా తరలించి వ్యాపారాలు చేస్తున్నది. కేవలం కమీషన్ సొమ్ముతో ఉషాకిరణ్ మీడియాలో 88.50 శాతం వాటా చిట్‌ఫండ్స్‌కు దాఖలా పడటం సాధ్యం కాదు.
ఉషాకిరణ్ మీడియా పేరు మీద ఫిలింసిటీలో వందల ఎకరాల భూములు, ఆ భూముల్లో వెలసిన నిర్మాణాలున్నాయి. మరి మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులకు ఆ భూముల్లో గానీ, అక్కడి వ్యాపారంలో గానీ వాటా ఉండాలా వద్దా అనే విషయం కూడా ఆలోచించాలి. చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఏపీ సీఐడీ అధికారుల దర్యాప్తు జరుగుతున్నది. ఇంకెన్ని అక్రమాలు బయటపడతాయో చూడాలి.
ఇవి కొన్ని మాత్రమే. ఒక నేర సామ్రాజ్యపు దుర్నీతికి సంబంధించిన శాంపుల్స్ మాత్రమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నందు వలన దాని కుదుళ్లు కదులు తున్నాయి. ఫైనాన్షియర్స్ డిపాజిటర్ల జాబితా వెల్లడయితే అజ్ఞాతంలో ఉన్న ఇంకొందరు అవినీతి చక్రవర్తుల భాగోతం కూడా బయటపడవచ్చు. రాజధాని భూముల బినామీల వెనుక దాక్కున్న వారి బండారం కూడా ఇంకా బయటపడాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ రాజకీయ – వ్యాపార ముఠా బెంబేలెత్తిపోతున్నది.
ముఠా చేతిలో ఉన్న మీడియాను విచ్చల విడిగా దుర్వినియోగపరుస్తున్నది. కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిపై ముసుగులు వేయాలని తాపత్రయపడుతున్నది. అభూతకల్పనలతో కూడిన రసాయన బాంబులను ప్రయోగి స్తున్నది. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో నిల బడినట్టు ప్రాజెక్ట్స్ టుడే సర్వేలో వెల్లడైతే యెల్లో మీడియా కళ్లు మూసుకుంది.
జీడీపీ వృద్ధిరేటులో 11.43 శాతంతో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంటే అది వారికి అసలు వార్తే కాదు. ఆహార ధాన్యాల దిగుబడిలో 20 శాతం వృద్ధిని నమోదుచేసి రికార్డు సృష్టిస్తే ఆ వార్తనూ తొక్కేశారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి దేశంలో అత్యుత్తమ పంటల బీమా స్కీమ్‌గా గౌరవం లభిస్తే వారి చెవికెక్కలేదు. ఆర్బీకే తరహా సేవలను తమ రాష్ట్రాల్లో అమలుచేయడానికి ఇప్పటికే అరడజను రాష్ట్రాలు ముందుకొస్తే వారికి కనిపించలేదు. తమ అక్రమాలను, అరాచ కాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ఆ కూటమి ఏకైక ఎజెండా. అందుకోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధం!
చెత్త కాగితాల గుట్ట ‘ఈనాడు’, గోబెల్స్‌ను తలదన్నిన రామోజీ: ఎన్టీఆర్
‘‘రామోజీ దుర్మదాంధుడు, స్వార్థపరుడు. నాపై కర్ర పెత్తనం చేయాలని చూశాడు. అసత్యాన్ని అందలమెక్కించడమే అతని లక్ష్యం. తిమ్మిని బమ్మిని చేయడమే అతని నైజం. ఇక చరిత్ర పెంట కుప్పల్లోనే మిగులుతాడు. జనం నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదు. పత్రిక చేతిలో ఉందని చెత్తరాతలు రాస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.’’
(వెన్నుపోటు అనంతరం ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్)
అనారోగ్యంతో మంచం మీద ఉంటే కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు: సుమన్
‘‘ఆస్పత్రిలో ఉన్నాను. రేడియేషన్ జరుగుతున్నది. నాన్నగారు కాల్ చేశారు. గ్లాస్ పట్టుకోవడానికి కూడా ఓపిక లేని పరిస్థితి. కార్డ్‌లెస్ ఫోన్ చెవి దగ్గర పెట్టారు అమ్మ. ఆయన నానామాటలు అంటున్నారు. నాకు ఒక్కటే ఏడుపు. అమ్మ వారిస్తోంది. అటువంటి సమయంలో నన్ను సపోర్ట్ చేయాల్సింది పోయి నానామాటలు అనాలా అని బాధపడ్డాను. ఇంట్లో మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కాగితాల మీద సంతకాలు తీసుకొని ‘ఈ’టీవీని నా నుంచి దూరం చేశారు.’’
(‘సాక్షి’ ఇంటర్వ్యూలో రామోజీ కుమారుడు సుమన్)
రామోజీని పెంచి పోషించింది మా నాన్నే: యూరీ రెడ్డి
‘‘మా నాన్న జీజే రెడ్డి ‘మార్గదర్శి’ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరు. దాని సీడ్ క్యాపిటల్ కూడా ఆయనదే. మా నాన్న ఎన్నోసార్లు ఈ విషయం చెప్పారు. మార్గదర్శి, నవభారత్ ఎంటర్‌ప్రైజెస్ వంటి కంపెనీలన్నీ ఇంటర్ లింక్డ్ అని చెప్పారు. మరణశయ్యపై నుంచి ఒక తండ్రి కుమారునితో చెప్పిన విషయాలను మీతో పంచుకుంటున్నాను. డాల్ఫిన్ హోటల్‌లో కూడా తన పెట్టుబడులున్నాయని నాన్న చెప్పారు. ‘ఈనాడు’ ప్రింటింగ్ ప్రెస్‌ను కూడా తూర్పు జర్మనీ నుంచి నాన్నే తెప్పించారని మా అంకుల్స్ చెప్పారు. నాన్న జీవితంలో చాలా మందికి సాయం చేశారు. ఎంతో మందిని పెంచి పోషించారు. వారిలో రామోజీ కూడా ఒకరు.’’
(‘సాక్షి’ ఇంటర్వ్యూలో యూరీ రెడ్డి)
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment