జనతంత్రం
‘మరణం నా చివరి చరణం కాదు’ అంటాడు విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్. నిజమే, ప్రభావశీలమైన వ్యక్తులు మరణానంతరం కూడా జీవించే ఉంటారు. వారి ప్రభావ స్థాయిని బట్టి సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాల పర్యంతం కూడా. ప్రభావశీలతలో పాజిటివ్ కోణం ఒక్కటే చూడాలా? నెగెటివ్ ప్రభావానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుందా? మానవ చరిత్రపై అడాల్ఫ్ హిట్లర్ చేసిన రక్తాక్షర సంతకం కూడా తక్కువ ప్రభావాన్ని చూపలేదు కదా! అతడు కూడా మనకు ప్రాతఃస్మరణీయుడవుతాడా?
నిజానికి ఇందులో సమస్య ఏమీ లేదు. సందేహాతీతమైన సదాచారాలు మనకు ఉన్నాయి. సమాజం మేలు కోరిన వారు, ప్రజల మంచి కోసం పోరాడినవారు, మంచితనాన్ని పెంచినవారిని స్మరించుకునే సంప్రదాయం మనకున్నది. స్మారకాలు నిర్మించుకునే అలవాటు కూడా ఉన్నది. వారి జీవితాల్లోంచి సమాజం పాఠాలు నేర్చుకోవాలనే కాంక్షతో వారినలా తమ జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలబెట్టుకుంటారు. చెడుమార్గంలో పయనించి ప్రభావం కలిగించిన వారిని... అధ్యయనం కోసం మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కించాలి. వారికి మరణమే చివరి చరణం కావాలి. ఆ ప్రభావం ఆదర్శం కాకూడదు.
కానీ, దురదృష్టవశాత్తు మారుతున్న కాలం వింత పోకడలు పోతున్నది. అభివృద్ధికి అర్థం మారుతున్నది. విజయ గాథలకు కొత్త నిర్వచనాలు చేరుతున్నాయి. గొప్పతనం అనే మాటకు తాత్పర్యం మారింది. ఎవరు బాగా సంపాదిస్తారో వారే మహానుభావులు అనే భావన బలపడుతున్నది. వారు ఏ మార్గంలో సంపాదించారన్న పట్టింపేమీ కనిపించడం లేదు. గమ్యం మాత్రమే కాదు, గమ్యాన్ని చేరే మార్గం కూడా పవిత్రంగా ఉండాలన్న గాంధీ బోధనను ఒక చాదస్తం కింద జమకట్టవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గాడ్సే వారసులకు గౌరవ మర్యాదలు లభిస్తున్న కాలంలోకి ప్రవేశించాము కదా!
పారిశ్రామికాభివృద్ధిలో జాతి ప్రగతిని దర్శించిన జేఆర్‌డీ టాటా వంటి ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలు కూడా మనకు ఉన్నారు. అటువంటి వారు చనిపోయినప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకొని అధికారిక సంస్మరణ సభలు నిర్వహించినట్టు గుర్తు లేదు. అటువంటి అదృష్టం మన తెలుగువాడైన చెరుకూరి రామోజీరావుకు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఈనాడు’కున్నంత పేరు ఆయనకూ ఉన్నది. బాగా సంపాదించారు. చిట్‌ఫండ్స్‌తో ప్రారంభమై మీడియాకు విస్తరించారు. మీడియా దన్నుతో సాటి చిట్‌ఫండ్ కంపెనీలను చావబాది, వాటిని దివాళా తీయించారు. ఫలితంగా ఆయన ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్’ దినదిన ప్రవర్ధమానమైంది.
చిట్‌ఫండ్స్‌కు తోడుగా ‘ఫైనాన్షియర్స్’ పేరుతో మరో జంట కంపెనీ తెరిచారు. రెండు చేతులా ప్రజాధనాన్ని స్వీకరించారు. మీడియాను విస్తరింపజేశారు. ఫిలిం సిటీ పేరుతో ఓ మాహిష్మతీ రాజ్యాన్ని స్థాపించేశారు. ఈలోగా మీడియాను వాడుకొని ప్రభుత్వాలను మార్చారు. ‘పత్రికొక్కటి ఉన్న పదివేల సైన్యంబు’ అన్నారు నార్ల వెంకటేశ్వరరావు. ఆ వాక్యాన్ని చెరుకూరి వారు వ్యాపారపరంగా ఆలోచించారు. పదివేల సైన్యంబును ప్రయోగిస్తూ వచ్చారు. మొదట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పదివేల సైన్యం పొగబాంబులు పేల్చింది.
ఫలితంగా ఎన్టీ రామారావు గద్దెనెక్కారు. రామోజీరావు వ్యాపారపు అడుగులకు మడుగులొత్తడానికి రామారావు నిరాకరించారు. క్రుద్ధుడైన రామోజీ వృద్ధుడైన రామారావుపైకి తన పదివేల సైన్యాన్ని అదిలించారు. ఎన్టీఆర్ గద్దె దిగి చంద్రబాబు గద్దెనెక్కారు. మనోవేదనతో ఐదు మాసాల్లోపే ఎన్టీఆర్ చనిపోయారు. రామోజీరావు పట్ల కృతజ్ఞతాపూర్వకంగా చంద్రబాబు ఆయనకు శుక్రాచార్యులవారి హోదా కల్పించారు.
పత్రికా రచన రంగానికి సంబంధించి రామోజీకి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి. ‘ఈనాడు’ ఎడిటర్ హోదాతో ఆయన ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. కానీ ఆయన వృత్తిపరంగా జర్నలిస్టు కాదు. నాన్ జర్నలిస్ట్ ఎడిటర్‌గా ఆయన పలు రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఏకవాక్య రచన కూడా లేకుండా ఏకబిగిన దశాబ్దాల తరబడి ప్రధాన సంపాదకుడిగా కొనసాగిన ఘనతను ఆయన్నుంచి ఎవరూ లాక్కోలేరు.
1974లో విశాఖపట్నం నుంచి ‘ఈనాడు’ పత్రిక ప్రారంభమయ్యే నాటికి అప్పటికే ఉన్న రెండు పెద్ద పత్రికలు పాత మూసలోనే మునకేసి ఉన్నాయి. ఈ స్థితిలో కొంత ఆధునికతను జోడిస్తూ, ప్రజల అవసరాలను గమనిస్తూ, వారికి అర్థమయ్యే సరళమైన భాషను వినియోగిస్తూ ‘ఈనాడు’ ముందుకొచ్చింది. ఈ మార్పులకు మూల పురుషుడు ‘ఈనాడు’ తొలి ఎడిటర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ ఉరఫ్ ఏబీకే ప్రసాద్ అనే తెలుగుజాతి అగ్రశ్రేణి పాత్రికేయుడు.
‘ఈనాడు’ హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైన కొద్ది కాలానికే ఏబీకే ప్రసాద్‌ను బయటకు పంపించారన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తర్వాత కాలంలో రామోజీరావే స్వయంగా ప్రధాన సంపాదకులయ్యారు. ఏబీకే నెలకొల్పిన పత్రికా ప్రమాణాల స్థానాన్ని క్రమంగా రామోజీ వ్యాపార సూత్రాలు ఆక్రమించాయి. ఈ వ్యాపార సూత్రాలు కూడా పత్రిక విస్తృతిలో వాటి పాత్రను పోషించాయి.
ఆ రోజుల్లో ‘స్కైలాబ్’ పేరుతో అమెరికా నెలకొల్పిన ఒక అంతరిక్ష కేంద్రానికి ఆయుష్షు మూడింది. అది ముక్కచెక్కలై భూమ్మీద పడిపోయే సందర్భాన్ని ‘ఈనాడు’ వినియోగించుకున్నది. అది రేపోమాపో పడిపోనున్నదనీ, దాంతో భూమి బద్దలైపోతుందని, ఇవే మనకు చివరి రోజులనీ ఊరూరా ప్రచారం జరగడంలో ‘ఈనాడు’ గొప్ప పాత్రనే పోషించింది. ఆ విధంగా గ్రామీణ ప్రజల్లోకి కూడా చొచ్చుకొనిపోగలిగింది.
పత్రికకు ఉండవలసిన నిష్పాక్షికత అనే లక్షణాన్ని ఈ యాభయ్యేళ్ల ప్రయాణంలో మొదటి ఐదారేళ్లు ‘ఈనాడు’ పాటించిందేమో! ఎనభయ్యో దశకం ప్రారంభంలోనే నిష్పాక్షికతకు నిప్పు పెట్టేసింది. గడిచిన నాలుగున్నర దశాబ్దాలుగా దాని పాత్రికేయమంతా ఏకపక్షా రచనా వ్యాసంగమే! నాణేనికి ఉండే రెండో కోణాన్ని తెలుగు ప్రజలు చూడకుండా ‘ఈనాడు’ దాచిపెట్టింది. పోటీగా మరో పత్రిక ఎదగకుండా దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే రామోజీ ఎత్తుగడలన్నీ తెలుగు ప్రజల అనుభవంలో ఉన్నవే.
‘ఉదయం’ పత్రిక అకాల అస్తమయానికి ఈ ఎత్తుగడలే కారణం. ‘వార్త’ను నిర్వీర్యం చేయడానికి కూడా అది ప్రయత్నాలు చేసింది. ఒక్క ‘సాక్షి’ ముందు మాత్రం దాని మంత్రాంగం పారలేదు. ఫలితంగా గత పదహారేళ్లుగా తెలుగు ప్రజలకు వార్తాంశాల రెండో కోణం ఆవిష్కృతమైంది. దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలకు నిష్పాక్షిక సమాచార హక్కును దక్కకుండా చేసినందుకుగాను ఆయన్ను అక్షర సూర్యుడుగా భృత్య మీడియా బహువిధాలుగా శ్లాఘించింది. ప్రభుత్వం వారి సంస్మరణ సభలో వక్తలందరూ నోరారా కొనియాడారు.
ఇక రామోజీరావు తన వ్యాపార సామ్రాజ్య స్థాపనలో అనుసరించిన పద్ధతులూ, నియమోల్లంఘనలూ, చట్టవిరుద్ధ వ్యవహారాలూ ఆమోదయోగ్యమైనవేనా? భవిష్యత్తు తరాల వారికి వాటిని బోధించవచ్చునా? ఈ అంశాలపై విస్తృతమైన చర్చ జరగవలసి ఉన్నది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో ఆయన చేసిన డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమైనదని స్వయంగా ఆర్‌బీఐ ప్రకటించింది.
ఆయన కూడా అది తప్పేనని ఒప్పుకున్నందువల్లనే ఆ సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఎవరెవరి దగ్గర డిపాజిట్లు వసూలు చేశారో, ఎవరెవరికి తిరిగి చెల్లించారో తెలియజేస్తూ ఒక జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం ఆదేశాన్ని ఆయన పాటించలేదు.
కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. కానీ మార్గదర్శి ఆ చట్టాన్ని ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించింది. ఆ డిపాజిట్లను నిబంధనలకు విరుద్ధంగా షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్‌లో, తమ సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టింది. లేని చందాదారులను ఉన్నట్టుగా చూపిస్తూ ఘోస్ట్ చిట్టీలు నడుపుతూ మనీలాండరింగ్ నేరానికి పాల్పడినట్టు ఇటీవల జరిగిన సోదాల్లో బయటపడింది. కేంద్ర దర్యాపు సంస్థలు జోక్యం చేసుకోవలసిన పరిణామాలివి.
ఇక రామోజీ ఫిలింసిటీ ఒక అక్రమాల పుట్ట. ఇక్కడ జరిగిన నియమోల్లంఘనలు నూటొక్క రకాలు. ఇందులో ప్రభుత్వ భూముల ఆక్రమణ ఉన్నది. పప్పుబెల్లాలు పంచి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన నేరం ఉన్నది. తరతరాల నాటి రహదారులనే కబ్జా చేసి కాంపౌండ్ వాల్ చుట్టుకున్న దాదాగిరి ఉన్నది. మాతృభూమిలో వైద్యసేవలు చేయడానికి వచ్చిన ఒక ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ను బెదిరించి 200 ఎకరాల భూమిని కారుచౌకగా కొట్టేసిన దాష్టీకం ఉన్నది. భూపరిమితి చట్టాన్ని వెంట్రుక సమానంగా జమకట్టిన లెక్కలేని తెంపరితనం ఈ ఫిలింసిటీ కథలో దాగున్నది.
ఎటువంటి అనుమతుల్లేకుండా ఫిలిం సిటీలో నిర్మించిన 147 భవనాలు హెచ్‌ఎమ్‌డీఏ అధికారాన్ని తొడగొట్టి సవాల్ చేస్తున్నాయి. చెరువులను చెరపట్టి వాటిలోకి ప్రవాహాలను మోసుకెళ్లే కాల్వలను రహదారులుగా మార్చుకున్న ఫిలింసిటీ రుబాబు ముంగిట... ‘వాల్టా’ చట్టం చేతులు ముడుచుకొని సిగ్గుతో తలవంచి నిలబడింది. రామోజీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ వెనుక ఇంత తతంగం ఉన్నది.
ఇది రేఖామాత్రపు ప్రస్తావన మాత్రమే! ఈ ‘సక్సెస్’ స్టోరీ రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదేనా? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరపడం సమర్థనీయమేనా? అమరావతిలో శిలా విగ్రహం, ఒక రహదారికి పేరు, స్మారక ఘాట్‌ల స్థాపన ఎటువంటి స్ఫూర్తిని ఉద్దీపింపజేస్తాయి. ‘భారతరత్న’ బిరుదాన్ని ఆయనకు సంపాదించిపెడతామని ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం సరైన సందేశాన్నే సమాజంలోకి పంపిస్తుందా?
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment