స్క్రామ్‌జెట్‌ పరీక్ష విజయవంతం | India successfully tests hypersonic technology demonstrator with scramjet engine | Sakshi
Sakshi News home page

స్క్రామ్‌జెట్‌ పరీక్ష విజయవంతం

Published Tue, Sep 8 2020 2:37 AM | Last Updated on Tue, Sep 8 2020 2:59 AM

India successfully tests hypersonic technology demonstrator with scramjet engine - Sakshi

నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్‌; లాంచ్‌పాడ్‌పై స్క్రామ్‌జెట్ (ఇన్‌సెట్‌)

చండీపూర్‌: భారత రక్షణ పరిశోధన సంస్థ మరో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. క్షిపణుల వేగాన్ని ఆరు రెట్లు ఎక్కువ చేసే స్క్రామ్‌జెట్‌ ఇంజిన్లను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఘనత సాధించిన అతితక్కువ దేశాల సరసన భారత్‌ను సగర్వంగా నిలిపింది. పూర్తిగా దేశీయంగానే తయారైన ఈ స్క్రామ్‌జెట్‌ ఇంజిన్‌లు భవిష్యత్తు అగ్ని –5, బ్రహ్మోస్‌ వంటి క్షిపణులను నడిపిస్తాయని అంచనా.

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశీ పారిశ్రామిక రంగం సాయంతో రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని లక్షిస్తున్న డీఆర్‌డీవో ఆ దిశగా మరో ముందడుగు వేసినట్లే. ఒడిశాలోని వీలర్‌ ఐల్యాండ్‌లో ఉన్న ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ కాంప్లెక్స్‌లో సోమవారం ఉదయం 11.03 గంటలకు ప్రయోగం జరగ్గా... హైపర్‌సోనిక్‌ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్‌ వెహికల్‌ (హెచ్‌ఎస్‌టీటీవీ) విజయవంతంగా నింగికి ఎగసిందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఒక ప్రకటనలో తెలిపింది.

హెచ్‌ఎస్‌టీటీవీ 30 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత ఏరడైనమిక్‌ హీట్‌షీల్డ్స్‌ వేరుపడ్డాయని, ఆ తరువాత క్రూయిజ్‌ వాహనం ముందుకు దూసుకెళ్లిందని ఆ ప్రకటన వివరించింది. ముందుగా నిర్దేశించిన మార్గంలో సెకనుకు రెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం మొదలుపెట్టిందని, లాంచ్‌ వెహికల్‌ నుంచి వేరుపడిన వెంటనే స్క్రామ్‌జెట్‌ ఇంజిన్‌ పరిసరాల్లోని గాలికి ఇంధనాన్ని జోడించి మండటం మొదలుపెట్టిందని, అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేసినట్లు టెలిమెట్రీ స్టేషన్లలోని రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్‌ వ్యవస్థలు గుర్తించాయి. స్క్రామ్‌జెట్‌ ఇంజిన్‌ పనితీరును పరిశీలించేందుకు బంగాళాఖాతంలో ఒక ప్రత్యేక నౌకను ఏర్పాటు చేయడం గమనార్హం. దశాబ్దాల పరిశోధనల ఫలితంగా ఈ స్క్రామ్‌జెట్‌ ఇంజిన్‌ ప్రయోగం విజయవంతమైందని, సంక్లిష్టమైన టెక్నాలజీలను సైతం దేశీయంగానే అభివృద్ధి చేయగలమన్న నమ్మకాన్ని పెంచిందని డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

ఎన్నో ప్రయోజనాలు...
స్క్రామ్‌జెట్‌ ఇంజిన్ల వల్ల ధ్వనికి ఆరురెట్ల వేగంతో ప్రయాణించడం ఒక్కటే ప్రయోజనం కాదు. రాకెట్లు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఆక్సిజన్‌ను మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంజిన్‌లో తిరిగే భాగాలు ఏవీ ఉండవు కాబట్టి ప్రస్తుతం రాకెట్లలో వాడుతున్న టర్బోజెట్ల కంటే సులువుగా స్క్రామ్‌జెట్లను తయారు చేయవచ్చు. అందించే ప్రతి లీటర్‌ ఇంధనానికి ఈ ఇంజిన్లు అందుకునే వేగం సాధారణమైన వాటికంటే చాలా ఎక్కువ. వేగం కూడా చాలా ఎక్కువ కాబట్టి అంతరిక్ష ప్రయోగాలు చాలా చౌక అవుతాయి.

రెండో ప్రపంచ యుద్ధం సమయం నుంచి స్క్రామ్‌జెట్లను అభివృద్ధి చేసేందుకు పలు దేశాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే 1991లో రష్యా తొలిసారి ఈ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ఆ తరువాతి కాలాల్లో ఫ్రాన్స్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలు ఈ టెక్నాలజీని అందుకున్నాయి. ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన స్క్రామ్‌జెట్‌ ఇంజిన్లు సాధించిన గరిష్ట వేగం ధ్వనికి 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2007లో నాసా, ఆస్ట్రేలియాకు చెందిన డిఫెన్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ ఘనతను సాధించాయి.

ప్రధాని అభినందనలు
స్క్రామ్‌జెట్‌ ఇంజిన్‌ను అభివృద్ధి చేసిన డీఆర్‌డీవోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘హైపర్‌సోనిక్‌ టెస్ట్‌ డెమాన్‌స్ట్రేషన్‌ వెహికల్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీవోకు అభినందనలు. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్క్రామ్‌జెట్‌ ఇంజిన్‌ ధ్వని వేగం కన్నా ఆరురెట్లు అధికవేగాన్ని అందుకొంది. అతికొద్ది దేశాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది’అని మోదీ ట్వీట్‌ చేశారు. స్క్రామ్‌జెట్‌ ఇంజిన్‌ పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఓ చరిత్రాత్మక ఘనత అని వ్యాఖ్యానించారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement