Defense Research Development Organisation
-
అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన నూతన తరం ‘అగ్ని ప్రైమ్’ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ), స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్(ఎస్ఎఫ్సీ) సహకారంతో భారత సైన్యం అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా సముద్ర తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం రాత్రి ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. అగ్నిప్రైమ్ నిర్దేశిత అన్ని లక్ష్యాలను చేరుకుందని వెల్లడించింది. ఈ మిస్సైల్ అణ్వాయుధాలను మోసకెళ్లగలదు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద దేశీయంగా అభివృద్ధి చేశారు. ఇది మీడియం రేంజ్ క్షిపణి. దీని స్ట్రైక్ రేంజ్ 1,000 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల దాకా ఉంటుంది. లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించడం అగ్నిప్రైమ్ ప్రత్యేకత. 1,500 నుంచి 3,000 కిలోల దాకా వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. బరువు దాదాపు 11,000 కిలోలు. అగ్ని క్షిపణుల శ్రేణిలో ఇది ఆరో క్షిపణి కావడం విశేషం. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పృథీ్వ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాశ్ తదితర క్షిపణులను అభివృద్ధి చేశారు. అగ్నిప్రైమ్ పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీఓ, ఎస్ఎఫ్సీతోపాటు భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. అగ్ని ప్రైమ్ రాకతో మన భద్రతా బలగాలకు మరింత బలం లభిస్తుందని పేర్కొన్నారు. సైంటిస్టులకు ప్రధాన నరేంద్ర మోదీ కూడా అభినందనలు తెలిపారు. -
శత్రు సైన్యంపై మూషికాస్త్రం!
యుద్ధ క్షేత్రంలో శత్రు శిబిరం ఎత్తుగడలు, రహస్యాలను తెలుసుకోవడానికి సైన్యం రకరకాల మార్గాల్లో ప్రయత్నించడం తెలిసిందే. శత్రువులు ఎక్కడెక్కడ ఏయే ఆయుధాలు మోహరించారో తెలుసుకోవడం యుద్ధంలో కీలకం. ఇలాంటివి పసిగట్టే ఎలుకలపై భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) నిర్విరామంగా ప్రయోగాలు సాగిస్తోంది. డీఆర్డీఓలో అంతర్భాగమైన అసిమ్మెట్రిక్ టెక్నాలజీ ల్యాబ్ ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైంది. మొదటి దశను విజయవంతంగా పూర్తిచేసి, రెండో దశలోకి ప్రవేశించింది. ఏమిటీ ప్రయోగం? సైనికులు జంతువులు, పక్షులను ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే ఎలుకలను రంగంలోకి దించాలన్నదే భారత సైన్యం వ్యూహం. ఇవి ఏమాత్రం అనుమానం రాకుండా శత్రు సైనికుల శిబిరాల్లోకి వెళ్లి, అక్కడి సమాచారాన్ని అందిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా సైన్యం వ్యూహాలు సిద్ధం చేసుకోవచ్చు. ఈ ఎలుకలను యానిమల్ ౖసైబర్గ్స్ అని పిలుస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీనిగురించి ఇటీవల జరిగిన 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో డీఆర్డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్ ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. యానిమల్ సైబర్గ్స్ అంటే? జీవించి ఉన్న ఎలుకల సామర్థ్యాన్ని మరింత పెంచుతారు. ఇందుకోసం ఎలక్ట్రికల్, మెకానికల్ పరికరాలు ఉపయోగిస్తారు. సాధారణ ఎలుకలు చేయలేని ఎన్నో పనులను ఇవి సులువుగా చేసేస్తాయి. కేవలం సైన్యంలోనే కాదు, పరిశోధనలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, భూమిల పాతిపెట్టిన బాంబుల జాడ కనుక్కోవడంతోపాటు శస్త్రచికిత్సల్లోనూ యానిమల్ సైబర్గ్స్ సేవలను వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ జంతువుల్లో మార్పులు చేయడాన్ని జంతు ప్రేమికులు, జంతు హక్కుల సంఘాల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. జంతువుల్లోని సహజ సామర్థ్యాలను దూరం చేయడం వాటిని బాధకు గురిచేయడమే అవుతుందని అంటున్నారు. ఎలుకలే ఎందుకు? భారత్‌లో ఎలుకలపై మొదటి దశ ప్రయోగాలు ముగిశాయి. ఎలుకల కదలికలను నియంత్రించడానికి సర్జరీల ద్వారా వాటి శరీరంలో ఎలక్ట్రోడ్లు అమర్చారు. ఇక సాధారణ వాతావరణ పరిస్థితుల్లో వాటిని పరీక్షించబోతున్నారు. కొండలను ఎంత వరకు అధిరోహించగలవో చూస్తారు. మొదటి దశ ప్రయోగంలో ఎలుకలు కొంత ఇబ్బందికి గురయ్యాయని డీఆర్డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్ వెల్లడించారు. కార్యాచరణకు సిద్ధమైన ఎలుకలను రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు. ఏ దిశగా వెళ్లాలి? ఎంత దూరంగా వెళ్లాలి? ఎక్కడ ఆగాలి? ఎంతసేపు ఆగాలి? అనేదానిపై వాటి మెదడుకు ఎప్పటికప్పుడు సంకేతాలు అందిస్తారు. ప్రయోగానికి ఎలుకలనే ఎన్నుకోవడానికి కారణంగా ఏమిటంటే.. అవి వేగంగా కదులుతాయి. లోతైన బొరియల్లోకి సైతం తేలిగ్గా వెళ్లగలవు. గోడలు, చెట్లు ఎక్కగలవు. యానిమల్ ౖౖసైబర్గ్స్ను చైనాలో ఇప్పటికే అభివృద్ధి చేశారు. యానిమల్ సైబర్గ్స్ సినిమాల్లో కూడా ఉన్నాయి. స్టార్‌వార్స్ సినిమాలోని చ్యూబాకా కూడా ఇలాంటిదే. ఒళ్లంతా రోమాలతో కనిపించే వింత జంతువు చ్యూబాకాలో శరీరం లోపల ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
డీఆర్డీవో చీఫ్‌గా సమీర్ వి కామత్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(డీడీఆర్‌డీ) సెక్రటరీగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చైర్మన్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా, ప్రస్తుత డీఆర్డీవో చీఫ్ జి.సతీశ్‌రెడ్డిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్రీయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కామత్ డీఆర్డీవోలో నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కామత్, సతీశ్‌రెడ్డిల నియామకాలను కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 60 ఏళ్లు వచ్చే వరకు కామత్ నూతన బాధ్యతల్లో కొనసాగుతారని కూడా వివరించింది. డీఆర్డీవో చీఫ్‌గా జి.సతీశ్‌రెడ్డి రెండేళ్ల పదవీ కాలానికి గాను 2018లో నియమితులయ్యారు. 2020 ఆగస్ట్‌లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. తాజాగా ఆయనకు రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు బాధ్యతలు అప్పగించింది. -
స్క్రామ్‌జెట్ పరీక్ష విజయవంతం
చండీపూర్: భారత రక్షణ పరిశోధన సంస్థ మరో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. క్షిపణుల వేగాన్ని ఆరు రెట్లు ఎక్కువ చేసే స్క్రామ్‌జెట్ ఇంజిన్లను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఘనత సాధించిన అతితక్కువ దేశాల సరసన భారత్‌ను సగర్వంగా నిలిపింది. పూర్తిగా దేశీయంగానే తయారైన ఈ స్క్రామ్‌జెట్ ఇంజిన్లు భవిష్యత్తు అగ్ని –5, బ్రహ్మోస్ వంటి క్షిపణులను నడిపిస్తాయని అంచనా. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీ పారిశ్రామిక రంగం సాయంతో రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని లక్షిస్తున్న డీఆర్డీవో ఆ దిశగా మరో ముందడుగు వేసినట్లే. ఒడిశాలోని వీలర్ ఐల్యాండ్‌లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలామ్ కాంప్లెక్స్‌లో సోమవారం ఉదయం 11.03 గంటలకు ప్రయోగం జరగ్గా... హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ వెహికల్ (హెచ్‌ఎస్‌టీటీవీ) విజయవంతంగా నింగికి ఎగసిందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్‌ఎస్‌టీటీవీ 30 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత ఏరడైనమిక్ హీట్‌షీల్డ్స్ వేరుపడ్డాయని, ఆ తరువాత క్రూయిజ్ వాహనం ముందుకు దూసుకెళ్లిందని ఆ ప్రకటన వివరించింది. ముందుగా నిర్దేశించిన మార్గంలో సెకనుకు రెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం మొదలుపెట్టిందని, లాంచ్ వెహికల్ నుంచి వేరుపడిన వెంటనే స్క్రామ్‌జెట్ ఇంజిన్ పరిసరాల్లోని గాలికి ఇంధనాన్ని జోడించి మండటం మొదలుపెట్టిందని, అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేసినట్లు టెలిమెట్రీ స్టేషన్లలోని రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు గుర్తించాయి. స్క్రామ్‌జెట్ ఇంజిన్ పనితీరును పరిశీలించేందుకు బంగాళాఖాతంలో ఒక ప్రత్యేక నౌకను ఏర్పాటు చేయడం గమనార్హం. దశాబ్దాల పరిశోధనల ఫలితంగా ఈ స్క్రామ్‌జెట్ ఇంజిన్ ప్రయోగం విజయవంతమైందని, సంక్లిష్టమైన టెక్నాలజీలను సైతం దేశీయంగానే అభివృద్ధి చేయగలమన్న నమ్మకాన్ని పెంచిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నో ప్రయోజనాలు... స్క్రామ్‌జెట్ ఇంజిన్ల వల్ల ధ్వనికి ఆరురెట్ల వేగంతో ప్రయాణించడం ఒక్కటే ప్రయోజనం కాదు. రాకెట్లు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఆక్సిజన్‌ను మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంజిన్‌లో తిరిగే భాగాలు ఏవీ ఉండవు కాబట్టి ప్రస్తుతం రాకెట్లలో వాడుతున్న టర్బోజెట్ల కంటే సులువుగా స్క్రామ్జెట్లను తయారు చేయవచ్చు. అందించే ప్రతి లీటర్ ఇంధనానికి ఈ ఇంజిన్లు అందుకునే వేగం సాధారణమైన వాటికంటే చాలా ఎక్కువ. వేగం కూడా చాలా ఎక్కువ కాబట్టి అంతరిక్ష ప్రయోగాలు చాలా చౌక అవుతాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయం నుంచి స్క్రామ్జెట్లను అభివృద్ధి చేసేందుకు పలు దేశాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే 1991లో రష్యా తొలిసారి ఈ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ఆ తరువాతి కాలాల్లో ఫ్రాన్స్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలు ఈ టెక్నాలజీని అందుకున్నాయి. ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన స్క్రామ్‌జెట్ ఇంజిన్లు సాధించిన గరిష్ట వేగం ధ్వనికి 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2007లో నాసా, ఆస్ట్రేలియాకు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ ఘనతను సాధించాయి. ప్రధాని అభినందనలు స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీవోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘హైపర్సోనిక్ టెస్ట్ డెమాన్‌స్ట్రేషన్ వెహికల్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవోకు అభినందనలు. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్క్రామ్‌జెట్ ఇంజిన్ ధ్వని వేగం కన్నా ఆరురెట్లు అధికవేగాన్ని అందుకొంది. అతికొద్ది దేశాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది’అని మోదీ ట్వీట్ చేశారు. స్క్రామ్‌జెట్ ఇంజిన్ పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఓ చరిత్రాత్మక ఘనత అని వ్యాఖ్యానించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. -
పీడీవీ 'సూపర్ సక్సెస్!
ఆకాశంలోనే లక్ష్యాన్ని ధ్వంసం చేసిన పృథ్వీ ఇంటర్‌సెప్టర్ క్షిపణి తొలి ప్రయోగమే సఫలం బాలాసోర్: విదేశీ క్షిపణి దాడుల నుంచి రక్షణ కల్పించే అద్భుతమైన కవచం ‘బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ)’ వ్యవస్థ రూపకల్పనలో భాగంగా మన దేశం మరో గొప్ప ముందడుగు వేసింది. సుదూరం నుంచి దూసుకువచ్చే దీర్ఘశ్రేణి క్షిపణులను ముందుగా గుర్తించి, ఆకాశంలోనే పేల్చివేసే ‘పృథ్వీ డిఫెన్స్ వెహికల్ (పీడీవీ)’ని రక్షణశాఖ ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. దీనిని ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఒడిశాలోని వీలర్ ఐలాండ్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. పీడీవీ తొలి ప్రయోగంలోనే పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో రక్షణశాఖలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ప్రయోగం వివరాలతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయోగం జరిగిందిలా.. పీడీవీ ఇంటర్‌సెప్టర్ క్షిపణితో పాటు బాలిస్టిక్ క్షిపణి తరహాలో మోటార్లతో ప్రత్యేకంగా రూపొందించిన లక్ష్యాన్ని ఈ ప్రయోగంలో వినియోగించారు. ముందుగా.. బంగాళాఖాతం మధ్యలో నిలిపిన నౌకల నుంచి లక్ష్యాన్ని ఉదయం 9 గంటల 7 నిమిషాలకు ప్రయోగించారు. అది బాలిస్టిక్ క్షిపణి తరహాలో తీరప్రాంతం వైపు దూసుకువస్తుండగా... పీడీవీ వ్యవస్థలోని రాడార్లు దానిని ఆటోమేటిగ్గా గుర్తించి అప్రమత్తం చేశాయి. వెంటనే ‘ఐటీఆర్’ నుంచి పృథ్వీ ఇంటర్‌సెప్టర్ క్షిపణి బయలుదేరింది. మైక్రో నావిగేషన్, ఇన్ఫ్రారెడ్ వ్యవస్థల సహా యంతో... కొద్ది సేపట్లోనే లక్ష్యాన్ని తుత్తునియలు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టెలిమెట్రీ/రేంజ్ స్టేషన్ల ద్వారా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలించారు. రెండు దశల క్షిపణి రక్షక కవచం ‘బీఎండీ’ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా రూపొందించిన ‘పీడీవీ’ అన్ని స్థాయిల్లోనూ, ప్రమాణాల పరంగా పూర్తిగా విజయవంతం అయిందని డీఆర్డీవో శాస్త్రవేత్త రవికుమార్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా పీడీవీ రూపకల్పన, ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను డీఆర్డీవో డెరైక్టర్ జనరల్, రక్షణశాఖ మంత్రి శాస్త్ర సలహాదారు అవినాశ్ చందర్ అభినందించారు. పృథ్వీ డిఫెన్స్ వెహికల్ పనితీరు, ప్రత్యేకతలు.. 2 వేల కిలోమీటర్లకంటే ఎక్కువ సామర్థ్యమున్న బాలిస్టిక్ క్షిపణులు భూవాతావరణంలో దాదాపు 120 నుంచి 250 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి.. తిరిగి కిందకు వచ్చి లక్ష్యాన్ని ఛేదిస్తాయి.ఇలా వచ్చే శత్రుదేశ క్షిపణులను ‘పీడీవీ’ 120 కిలోమీటర్ల కంటే ఎత్తులో ఉండగానే గుర్తించి, ధ్వంసం చేస్తుంది.క్షిపణులను గుర్తించే రాడార్లు, పృథ్వీని ప్రయోగించే లాంచ్‌ప్యాడ్ ఆటోమేటిక్‌గా స్పందించేలా పీడీవీ వ్యవస్థకు అనుసంధానమై ఉంటాయి.లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించేందుకు వీలుగా ‘పీడీవీ’లో మైక్రో, ఇనెర్షియల్ నావిగేషన్ పరికరాలు, ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) సీకర్ ఉంటాయి. ‘పీడీవీ’ భూవాతావరణంలో పై పొరలకు చేరగానే.. వేడిని తట్టుకోవడం కోసం దీనికి అమర్చిన ‘హీట్ షీల్డ్స్’ విడిపోతాయి. వెంటనే ఇన్ఫ్రారెడ్ సీకర్ పరికరం పైకి తెరుచుకుని లక్ష్యం దిశగా ‘పీడీవీ’కి మార్గ నిర్దేశనం చేస్తుంది.ఇనెర్షియల్ నావిగేషన్, ఐఆర్ సీకర్తోపాటు నియంత్రణ కేంద్రాల సహకారంతో పీడీవీ లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలుగుతుంది.