న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన నూతన తరం ‘అగ్ని ప్రైమ్’ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ), స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్(ఎస్‌ఎఫ్‌సీ) సహకారంతో భారత సైన్యం అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా సముద్ర తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం రాత్రి ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.
అగ్నిప్రైమ్ నిర్దేశిత అన్ని లక్ష్యాలను చేరుకుందని వెల్లడించింది. ఈ మిస్సైల్ అణ్వాయుధాలను మోసకెళ్లగలదు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం కింద దేశీయంగా అభివృద్ధి చేశారు. ఇది మీడియం రేంజ్ క్షిపణి. దీని స్ట్రైక్ రేంజ్ 1,000 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల దాకా ఉంటుంది. లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించడం అగ్నిప్రైమ్ ప్రత్యేకత. 1,500 నుంచి 3,000 కిలోల దాకా వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. బరువు దాదాపు 11,000 కిలోలు.
అగ్ని క్షిపణుల శ్రేణిలో ఇది ఆరో క్షిపణి కావడం విశేషం. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పృథీ్వ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాశ్ తదితర క్షిపణులను అభివృద్ధి చేశారు. అగ్నిప్రైమ్ పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీఓ, ఎస్‌ఎఫ్‌సీతోపాటు భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. అగ్ని ప్రైమ్ రాకతో మన భద్రతా బలగాలకు మరింత బలం లభిస్తుందని పేర్కొన్నారు. సైంటిస్టులకు ప్రధాన నరేంద్ర మోదీ కూడా అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment