అగ్ని–5 పరీక్ష దిగ్విజయం
విజయవంతంగా లక్ష్యాల ఛేదన
స్వదేశీ ఖండాంతర అణు క్షిపణి
అత్యాధునిక ఎంఐఆర్‌వీ సామర్థ్యం
5,000 కిలోమీటర్ల పైగా రేంజ్
పరిధిలోకి చైనాతో పాటు యూరప్‌లో పలు ప్రాంతాలు
డీఆర్‌డీఓ సైంటిస్టులకు మోదీ అభినందనలు
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మహిళ సారథ్యం
బాలాసోర్/న్యూఢిల్లీ: మన అమ్ములపొదిలోకి తిరుగులేని ‘దివ్యాస్త్రం’ చేరింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) మరో అద్భుతం చేసింది. ఒకటికి మించిన లక్ష్యాలను ఒకేసారి అత్యంత కచి్చతత్వంతో ఛేదించగల అత్యాధునిక ఖండాంతర అణు క్షిపణి అగ్ని–5ను తొలిసారి ప్రయోగించింది.
నిర్దేశించిన ఒకటికి మించిన లక్ష్యాలను అది విజయవంతంగా ఛేదించింది! శత్రు దేశాలకు వణకు పుట్టించగల ఈ ‘దివ్యాస్త్రం’ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిచ్చేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. దీనిలో తొలిసారిగా వాడిన మలి్టపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికిల్ (ఎంఐఆర్‌వీ) సాంకేతికత ద్వారా ఒకే క్షిపణితో వేర్వేరు లక్ష్యాలపై అనేక వార్ హెడ్లను పూర్తి కచి్చతత్వంతో ప్రయోగించవచ్చు.
5,000 నుంచి 5,800 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను అగ్ని–5 ఛేదించగలదు. తక్కువ బరువున్న వార్‌హెడ్లను అమర్చే పక్షంలో క్షిపణి రేంజ్ ఏకంగా 8,000 కి.మీ. దాకా పెరుగుతుంది! ‘మిషన్ దివ్యాస్త్ర’ పేరిట జరిగిన ఒడిశా తీర సమీపంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి సోమవారం జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ‘‘మిషన్ దివ్యాస్త్రను దిగ్విజయం చేసిన డీఆర్‌డీఓ సైంటిస్టులకు హృదయపూర్వక అభినందనలు. వారి ఘనతను చూసి గరి్వస్తున్నా’’అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అతి కొద్ది దేశాల సరసన...
అగ్ని–5 పరీక్ష విజయవంతం కావడంతో ఎంఐఆర్‌వీ సామర్థ్యమున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ‘‘దేశ దీర్ఘకాలిక రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అగ్ని–5ని అభివృద్ధి చేశాం. భారత శాస్త్ర, సాంకేతిక నైపుణ్యానికి ఇది మచ్చుతునక. ఈ ప్రాజెక్టు డైరెక్టర్ మహిళ కావడం విశేషం. రక్షణ రంగంలోనూ దేశ ప్రగతికి నారీ శక్తి ఎంతగా దోహదపడుతోందో చెప్పేందుకు ఇది తాజా తార్కాణం’’ అని వివరించాయి.
అగ్ని–1 నుంచి అగ్ని–4 దాకా ఇప్పటిదాకా అభివృద్ధి చేసిన క్షిపణుల రేంజ్ 700 కి.మీ. నుంచి 3,500 కి.మీ. దాకా ఉంది. ఇవిప్పటికే రక్షణ దళంలో చేరాయి. భూ వాతావరణ పరిధిలోనూ, దాని ఆవల కూడా ఖండాంతర క్షిపణులను ప్రయోగించడంతో పాటు విజయవంతంగా అడ్డగించే సామర్థ్యాల సముపార్జనలో భారత్ ఏటేటా ప్రగతి సాధిస్తూ వస్తోంది. మొత్తం ఆసియా ఖండంతో పాటు యూరప్‌లో కూడా పలు ప్రాంతాలు అగ్ని–5 పరిధిలోకి వస్తాయి! అణు దాడులు చేయడమే గాక వాటిని అడ్డుకునే సత్తా దీని సొంతం.
Comments
Please login to add a commentAdd a comment