intercontinental ballistic missile
-
ప్రపంచంలోనే శక్తిమంతమైన క్షిపణి పరీక్ష.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు
సియోల్: అత్యంత శక్తివంతమైన, బలీయమైన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ (ఐసీఎంబీ)ను పరీక్షించామని శుక్రవారం ఉత్తరకొరియా ప్రకటించింది. ఇది ప్రచారయావ తప్పితే.. వాస్తవ యుద్ధ పరిస్థితుల్లో ఇంతటి భారీస్థాయి క్షిపణి ఉపయుక్తకరంగా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాను చేరుకోగల ఖండాంతర క్షిపణుల అభివృద్ధి చేయడంలో సాంకేతిక అడ్డంకులను ఉత్తరకొరియా అధిగమించినట్లు తాజా క్షిపణి పరీక్ష ఎక్కడా రుజువు చేయలేకపోయిందని నిపుణులు పేర్కొన్నారు. గురువారం తాము పరీక్షించిన ఖండాంతర క్షిపణి హ్వాసాంగ్–19 .. ఇదివరకు ఎన్నడూ లేనంత దూరానికి, ఎన్నడూ లేనంత ఎత్తులో ప్రయాణించిందని ఉత్తరకొరియా ప్రకటించింది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ఈ పరీక్షను దగ్గరుండి పరిశీలించారని వెల్లడించింది. రష్యా, అమెరికా వద్దనున్న అత్యాధునిక ఖండాంతర క్షిపణుల పొడవు 20 మీటర్ల లోపే ఉంటుందని, హ్వాసాంగ్–19 పొడవు 28 మీటర్లు ఉండటం మూలంగా.. ప్రయోగానికి ముందుగానే దీన్ని దక్షిణకొరియా నిఘా సంస్థలు కనిపెట్టగలిగాయని దక్షిణకొరియా వ్యూహ నిపుణుడు చాంగ్ యంగ్–కెయున్ తెలిపారు. ల్యాంచ్‌పాడ్ల పరిమాణం పెరుగుతుందని, పొడవు అధికంగా ఉన్నందువల్ల శత్రుదేశాల నిఘా రాడార్లకు ఈ తరహా క్షిపణులు సులభంగా చిక్కుతాయని వివరించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు ఎనిమిది వేల మంది ఉత్తరకొరియా సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా మొహరించిందని అమెరికా వెల్లడించింది. రష్యాలోని కస్క్‌లో ఉక్రెయిన్ సేనలు పాగా వేయడం తెలిసిందే. కస్క్ నుంచి ఉక్రెయిన్ సేనలు వెనక్కి మళ్లించడానికి వీలుగా 8 వేల మంది ఉత్తరకొరియా సైనికులను తరలించిందని వివరించింది. -
Mission Divyastra: అమ్ములపొదిలో దివ్యాస్త్రం
బాలాసోర్/న్యూఢిల్లీ: మన అమ్ములపొదిలోకి తిరుగులేని ‘దివ్యాస్త్రం’ చేరింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మరో అద్భుతం చేసింది. ఒకటికి మించిన లక్ష్యాలను ఒకేసారి అత్యంత కచి్చతత్వంతో ఛేదించగల అత్యాధునిక ఖండాంతర అణు క్షిపణి అగ్ని–5ను తొలిసారి ప్రయోగించింది. నిర్దేశించిన ఒకటికి మించిన లక్ష్యాలను అది విజయవంతంగా ఛేదించింది! శత్రు దేశాలకు వణకు పుట్టించగల ఈ ‘దివ్యాస్త్రం’ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిచ్చేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. దీనిలో తొలిసారిగా వాడిన మలి్టపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికిల్ (ఎంఐఆర్వీ) సాంకేతికత ద్వారా ఒకే క్షిపణితో వేర్వేరు లక్ష్యాలపై అనేక వార్ హెడ్లను పూర్తి కచి్చతత్వంతో ప్రయోగించవచ్చు. 5,000 నుంచి 5,800 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను అగ్ని–5 ఛేదించగలదు. తక్కువ బరువున్న వార్హెడ్లను అమర్చే పక్షంలో క్షిపణి రేంజ్ ఏకంగా 8,000 కి.మీ. దాకా పెరుగుతుంది! ‘మిషన్ దివ్యాస్త్ర’ పేరిట జరిగిన ఒడిశా తీర సమీపంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి సోమవారం జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ‘‘మిషన్ దివ్యాస్త్రను దిగ్విజయం చేసిన డీఆర్డీఓ సైంటిస్టులకు హృదయపూర్వక అభినందనలు. వారి ఘనతను చూసి గరి్వస్తున్నా’’అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అతి కొద్ది దేశాల సరసన... అగ్ని–5 పరీక్ష విజయవంతం కావడంతో ఎంఐఆర్వీ సామర్థ్యమున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ‘‘దేశ దీర్ఘకాలిక రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అగ్ని–5ని అభివృద్ధి చేశాం. భారత శాస్త్ర, సాంకేతిక నైపుణ్యానికి ఇది మచ్చుతునక. ఈ ప్రాజెక్టు డైరెక్టర్ మహిళ కావడం విశేషం. రక్షణ రంగంలోనూ దేశ ప్రగతికి నారీ శక్తి ఎంతగా దోహదపడుతోందో చెప్పేందుకు ఇది తాజా తార్కాణం’’ అని వివరించాయి. అగ్ని–1 నుంచి అగ్ని–4 దాకా ఇప్పటిదాకా అభివృద్ధి చేసిన క్షిపణుల రేంజ్ 700 కి.మీ. నుంచి 3,500 కి.మీ. దాకా ఉంది. ఇవిప్పటికే రక్షణ దళంలో చేరాయి. భూ వాతావరణ పరిధిలోనూ, దాని ఆవల కూడా ఖండాంతర క్షిపణులను ప్రయోగించడంతో పాటు విజయవంతంగా అడ్డగించే సామర్థ్యాల సముపార్జనలో భారత్ ఏటేటా ప్రగతి సాధిస్తూ వస్తోంది. మొత్తం ఆసియా ఖండంతో పాటు యూరప్‌లో కూడా పలు ప్రాంతాలు అగ్ని–5 పరిధిలోకి వస్తాయి! అణు దాడులు చేయడమే గాక వాటిని అడ్డుకునే సత్తా దీని సొంతం. -
ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం
సియోల్: ఉత్తరకొరియా ఆదివారం సముద్ర జలాలపైకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ కొరియా, జపాన్ దీన్ని ధ్రువీకరించాయి. డిసెంబర్ 18న కూడా అమెరికా ప్రధాన భూభాగంపై సైతం దాడి చేయగల సామర్థ్యమున్న ఘన ఇంధన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాసంగ్–18ని ఉత్తర కొరియా ప్రయోగించింది. ఏప్రిల్‌లో దక్షిణకొరియాలో, నవంబర్‌లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఉత్తరకొరియా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. -
అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర క్షిపణి పరీక్ష
మాస్కో: అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతంగా నిర్వహించినట్లు రష్యా ఆర్మీ ఆదివారం ప్రకటించింది. ఈ క్షిపణి అణువార్హెడ్లను మోసుకెళ్లగలదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధంతో రష్యా, పశ్చిమదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడం, అంతర్జాతీయ అణు పరీక్ష నిషేధ ఒప్పందం నుంచి వైదొలుగుతూ రష్యా పార్లమెంట్ ఆమోదించిన బిల్లుపై అధ్యక్షుడు పుతిన్ గత వారం సంతకం చేసిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇంపరేటర్ అలెగ్జాండర్ 3 అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర బులావా క్షిపణిని రష్యా ఉత్తర తెల్ల సముద్రంలో నీటి అడుగు నుంచి పరీక్షించి చూసినట్లు రష్యా రక్షణ శాఖ వివరించింది. -
ఘన ఇంధన బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించాం
సియోల్: మొట్టమొదటిసారిగా ఘన ఇంధనాన్ని వినియోగించి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తరకొరియా శుక్రవారం ప్రకటించింది. వేగంగా ప్రయాణించే కొత్త రకం క్షిపణిని ఆ దేశం గురువారం ప్రయోగించినట్లు దక్షిణకొరియా, జపా¯Œ పేర్కొనడం తెలిసిందే. రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని అటవీ ప్రాంతంలోని వేదికపై నుంచి చేపట్టిన ఈ ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్, ఆయన భార్య, కుమార్తె, సోదరి తిలకించినట్లు అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది. ఈ క్షిపణి మూడు దశలుగా ప్రయాణించి, లక్ష్యాన్ని ఛేదించినట్లు వివరించింది. ఇప్పటి వరకు ద్రవ ఇంధనంతో పనిచేసే క్షిపణులను పరీక్షించిన ఉత్తరకొరియా తాజాగా ఘన ఇంధనం వాడినట్లు ప్రకటించడం ముందడుగేనని నిపుణులంటున్నారు. అమెరికాను నేరుగా భయపెట్టే అణ్వాయుధాలను సమకూర్చుకోవాలనే లక్ష్యంలో ఇది పురోగతిగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ తాజా క్షిపణి సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అది ప్రయాణించిన దూరం, ఎత్తు, తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని ఎలా ఛేదించింది, వార్ హెడ్ అమరిక వంటి వివరాలను వెల్లడించకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. -
North Korea: మరింత ‘అణు’ దూకుడు
సియోల్: అణు పాటవాన్ని మరింతగా పెంచుకుంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. కొరియా ద్వీపకల్పంలో నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ అత్యున్నత సైనికాధికారులతో ఆయన సమావేశమయ్యారు. అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు దీటుగా రక్షణ సామర్థ్యాన్ని, యుద్ధ సన్నద్ధతను పెంచుకోవడంపై భేటీలో లోతుగా చర్చ జరిగినట్టు అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) తెలిపింది. అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచాలని ఈ సందర్భంగా అధికారులను కిమ్ ఆదేశించారు. దక్షిణ కొరియాతో మిలిటరీ హాట్‌లైన్ చర్చలకు కూడా ఐదు రోజులుగా ఉత్తర కొరియా ముందుకు రాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బహుశా ప్రస్తుత ఉద్రిక్తతలను బూచిగా చూపుతూ దూకుడు చర్యలకు దిగేందుకు ఉత్తర కొరియా యోచిస్తుండవచ్చని దక్షిణ కొరియా అనుమానిస్తోంది. 2023లో ఉత్తర కొరియా ఇప్పటికే 30కి పైగా క్షిపణి పరీక్షలు నిర్వహించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. 2022లో కూడా రికార్డు స్థాయిలో 70కి పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. తమను అణ్వాయుధ దేశంగా అంగీకరించేలా, ఆర్థిక ఆంక్షలను సడలించేలా అమెరికాపై ఒత్తిడి పెంచడమే వీటి ఉద్దేశమని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య అణు చర్చల్లో 2019 నుంచీ ప్రతిష్టంభన నెలకొంది. ఉత్తర కొరియా 2017లో తొలిసారి అణుపరీక్షలు నిర్వహించింది. -
ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం
సియోల్: ఉత్తరకొరియా గురువారం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. టోక్యోలో జపాన్–దక్షిణ కొరియా నేతల శిఖరాగ్ర సమ్మేళనం ప్రారంభానికి ముందు ఉ.కొరియా ఈ దుందుడుకు చర్యకు పాల్పడటం గమనార్హం. ఉత్తరకొరియా ఈ నెలలో జరిపిన మొదటి ఐసీబీఎం ప్రయోగం కాగా, వారం వ్యవధిలో చేపట్టిన మూడో ఆయుధ పరీక్ష ఇది. ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి గురువారం ఉదయం ప్రయోగించిన ఈ క్షిపణి సుమారు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి తూర్పువైపు సముద్రజలాల్లో పడిపోయినట్లు దక్షిణ కొరియా ప్రకటించింది. -
దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు
సియోల్: ఉత్తరకొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిపిన నేపథ్యంలో ఆదివారం దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభించాయి. ఆదివారం జరిపిన ఈ విన్యాసాల్లో అమెరికా వ్యూహాత్మక బాంబర్లు పాల్గొన్నాయి. అమెరికా బి–1బి బాంబర్లకు దక్షిణ కొరియా ఎఫ్–35ఏ, ఎఫ్–15ఏ, అమెరికా ఎఫ్–16 రక్షణగా నిలిచాయి. రెండు మిత్ర దేశాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తమకున్న రక్షణ సంసిద్ధతను ప్రదర్శించాయని దక్షిణ కొరియా ఒక ప్రకటనలో తెలిపింది. జపాన్‌తో కలిసి అమెరికా సంయుక్త వైమానిక విన్యాసాలు జరుపనుందని జపాన్ వార్తా సంస్థ తెలిపింది. ఉత్తరకొరియా శనివారం రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి లాంగ్–రేంజ్ క్షిపణిని జపాన్ సముద్రం తీరంలోకి ప్రయోగించింది. ఈ క్షిపణి గంటలో 900 కిలోమీటర్లు (560 మైళ్లు) ప్రయాణించింది. జపాన్‌కు చెందిన ఓషిమా దీవికి 200 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో క్షిపణి కూలిపోయినట్లు సమాచారం. -
డేంజర్ వెపన్.. సంబరాల్లో కిమ్ సేన
ప్యాంగ్ యాంగ్ : ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు తారాస్థాయికి చేరాయి. బుధవారం అతిపెద్ద ఖండాంతర క్షిపణి హాసంగ్-15 పరీక్షతో ఒక్కసారిగా కొరియన్ భూభాగాలు వణికిపోయాయి. ఇప్పటిదాకా కిమ్ సైన్యం ప్రయోగించిన వాటిల్లో అతిపెద్దది, శక్తివంతమైనది ఇదే కావటం విశేషం. ఉత్తర కొరియా అణ్వాయుధాల పొదిలో ఇప్పటిదాకా ఉన్న క్షిపణులు కేవలం అమెరికా తీర ప్రాంతాలను మాత్రమే చేరగలిగితే.. హాసంగ్-15 మాత్రం వాషింగ్టన్నగరాన్ని చేరి నాశనం చేసే సామర్థ్యం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్యాంగ్యాంగ్ అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేశారు. . ఈ మేరకు పరీక్ష విజయవంతం అయ్యాక కిమ్ జొంగ్ ఉన్ అధికారులతో వేడుకలు జరుపుకుంటున్న ఫోటోలను విడుదల చేశారు. సిగరెట్ తాగుతూ కిమ్ విజయ గర్వంతో ఆకాశం వైపు చూస్తున్న ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్షిపణి సామర్థ్యం... నార్త్ కొరియా అణు క్షిపణులలో ఇప్పటిదాకా ఇదే పెద్దది.. ప్రమాదకరమైనది కూడా. చాలా తక్కువ దేశాలు ఈ పరిణామంలో ఇప్పటిదాకా క్షిపణిని తయారు చేశాయని ఉత్తర కొరియా సైన్యం ప్రకటించుకుంది. క్షిపణుల నిపుణుడు మైకేల్ ఎల్లెమన్ ఈ క్షిపణి గురించి 38 నార్త్ బ్లాగ్‌లో వివరాలు తెలియజేశారు. సుమారు 150 కేజీల బరువు(330 పౌండ్లు) ఉన్న హాసంగ్-15 13,000 కిలో మీటర్ల లక్ష్యాన్ని సులువుగా చేధిస్తుంది. వెస్ట్ కోస్ట్ చేరాలంటే బరువులో 500 కేజీలను తగ్గిస్తే చాలూ అని మైకేల్ అభిప్రాయపడ్డారు. -
బేఖాతర్.. 50టన్నుల అణుపరీక్షకు రెడీ
ప్యాంగ్యాంగ్: జగడాల మారి ఉత్తర కొరియా అదే దూకుడును కొనసాగిస్తోంది. తన అణ్వస్త్రాల ప్రయోగాలను అదే వేగంగా ముందుకు తీసుకెళుతోంది. తాజాగా మరో ఖండాంతర అణుక్షిపణిని (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్-ఐసీబీఎం) పరీక్షించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఓ పక్క ఇప్పటికే హైడ్రోజన్ బాంబును పరీక్షించడం కారణంగా అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుండగానే వాటిని బేఖాతరు చేస్తూ తాజాగా మరో పరీక్షకు సిద్ధమవుతోంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరో పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తమకు సమాచారం ఉందని దక్షిణ కొరియా సైనిక వర్గాలు తెలిపాయి. దాదాపు 50 టన్నుల పేలుడు పదార్థాన్ని ఆ ఖండాంతర అణుక్షిపణిలో వాడనున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా ఆరు సార్లు అణుపరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
ఇక అమెరికా మొత్తం మా గుప్పిట్లో: ఉత్తర కొరియా
-
ఇక అమెరికా మొత్తం మా గుప్పిట్లో: ఉత్తర కొరియా
వాషింగ్టన్: ఉత్తర కొరియా తన దుస్సాహసాన్ని కొనసాగిస్తునే ఉంది. అమెరికా తమపైకి దాడి చేసినా ఏం చేయలేదనే తీరుగా వ్యవహరిస్తోంది. ఒక్క ఈ నెలలోనే రెండుసార్లు ఖండాంతర అణుక్షిపణులను పరీక్షించింది. ఈ నెల(జులై) 4న ఓ ఖండాంతర బాలిస్టిక్ అణుక్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా తాజాగా శుక్రవారం మరో బాలిస్టిక్ ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఇంకో అడుగు ముందుకేసి ఇప్పుడు అమెరికా మొత్తం తమ లక్షిత ప్రాంతంలోకి వచ్చినట్లేనని, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఏ ప్రాంతంపైనైనా తమ దేశం నుంచే దాడి చేయగలమని అని అన్నారు. తాజా ఖండాంతర క్షిపణితో అది స్పష్టమైందని ఆయన చెప్పినట్లు అక్కడి మీడియా తెలిపింది. 'తాజాగా నిర్వహించిన పరీక్షల తర్వాత కిమ్ చాలా ఉత్సాహంగా కనిపించారు. మేం దాడి చేయగల పరిధిలో అమెరికా మొత్తం ఉంది అంటూ ఆయన అన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా అమెరికా భూభాగంపై దాడి చేయగల సత్తా ఇక మాది' అని కిమ్ అన్నట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఎజెన్సీ తెలిపింది. అంతేకాదు, ఈ క్షిపణిని అభివృద్ధి చేసిన వారిని ప్రశంసల్లో ముంచెత్తారని వివరించింది. కాగా, ఉత్తర కొరియా చర్యపట్ల అమెరికా మండిపడింది. కొరియా చేసింది చాలా నిర్లక్ష్య పూరితమైన అపాయకరమైన చర్య అంటూ మండిపడింది. ఇక ఉత్తర కొరియాను ఏప్రమాదం నుంచి రక్షించే సమస్య లేదని స్పష్టం చేసింది. ఉత్తర కొరియాను ఏకాకిని చేసేందుకు ఇదొక్క కారణం చాలు అంటూ ట్రంప్ అన్నారు. -
వినాశనం దిశగా నార్త్ కొరియా అడుగులు
వాషింగ్టన్/ప్యోంగ్ యాంగ్: క్షిపణి ప్రయోగాలతో తరచుగా వివాదాల్లో తలదూర్చే ఉత్తరకొరియా వద్ద ఇతరదేశాలు ఊహించనంత అణ్వస్త్ర సామర్థ్యం ఉందని అమెరికా అభిప్రాయపడుతోంది. ఇటీవల అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఉద్దేశపూర్వకంగా ప్రయోగించడంపై ఈ అగ్రరాజ్యం సీరియస్‌గా ఉంది. అయితే ఉత్తరకొరియా మరిన్ని అణ్వాయుధాలను సిద్ధం చేస్తుందని, వినాశనం కోరుకోవడమే కిమ్ పని అంటూ అమెరికా మీడియా మండిపడింది. నార్త్‌కొరియా వద్ద ఇప్పటికే 20 అణు బాంబులు ఉన్నాయని, ఇకపై నెలకొక అణుబాంబు చొప్పున రూపొందించి వినాశనానికి తెరతీయనుందని అమెరికా నిఘా సంస్థలు హెచ్చరించాయి. అమెరికా తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలలో గమనిస్తే నార్త్ కొరియా వద్ద భారీ మోతాదులో ప్లూటోనియం, ఇతరత్రా అణ్వస్త్ర సామాగ్రి నిల్వ ఉండటం మరిన్ని ప్రయోగాలకు కిమ్ సిద్ధంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలన్నారు. రేడియోకెమికల్ ల్యాబోరేటరీలో మరో రెండు ప్రయోగాలకు సరిపోయే అణు పదార్థాలున్నాయని, దీనివల్ల ఉత్తరకొరియా మరిన్ని క్షిపణి ప్రయోగాలకు కాలుదువ్వడంపై అమెరికాలో ఆందోళన నెలకొంది. ఇటీవల ప్రయోగించిన ఖండాంతర క్షిపణి అమెరికాలోని అలాస్కా ప్రాంతం వరకు సులువుగా చేరుకుంటుందని నిపుణులు అంచనా వేయడంతో కిమ్ ఆటకట్టించడానికి రష్యా, చైనా దేశాల సహకారం కావాలని అమెరికా యోచిస్తోంది. -
అమెరికాపై కిమ్ తీవ్ర అసభ్య పదజాలం..!
అగ్రరాజ్యంపై కిమ్ జాంగ్ ఉన్ తిట్లు..! సియోల్: ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఉత్తర కొరియా అమెరికాకు పుండుమీద కారం చల్లేరీతిలో వ్యాఖ్యలు చేసింది. ఈ బాలిస్టిక్ క్షిపణి విజయం.. అమెరికా బాస్టర్డ్స్కు వారి స్వాతంత్ర్య దినోత్సవ కానుక అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పేర్కొన్నట్టు ఆ దేశ మీడియా తెలిపింది. 'జులై 4 వార్షికోత్సవం సందర్భంగా పంపిన ఈ కానుకను చూసి అమెరికా బాస్టర్డ్స్ అంతగా సంతోషించరు' అని కిమ్ అన్నట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. 'వారి విసుగును దూరం చేసేందుకు అప్పుడప్పుడు ఇలాంటి కానుకలను మనం పంపిస్తూ ఉండాలి' అని కిమ్ వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు పేర్కొంది. ప్రపంచ దేశాల హెచ్చరికలను, ఆంక్షలను బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా మంగళవారం ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అమెరికాతో పలు దేశాలపై దాడి చేసే సామర్థ్యమున్న ఈ క్షిపణి (వాసోంగ్-14) పరీక్షను దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారని ఉ.కొరియా టీవీ చానల్ పేర్కొంది. ‘కిమ్ ఈ పరీక్షకు ఆదేశించారు. క్షిపణి 2,802 కి.మీ.ఎత్తుకు చేరుకుని 933 కి.మీ ప్రయాణించింది. 39 నిమిషాల పయనం తర్వాత జపాన్ సముద్రంలో పడిపోయింది. పూర్తి స్థాయి అణుశక్తి దేశమైన ఉ.కొరియా వద్ద ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగల అత్యంత శక్తిమంతమైన ఐసీబీఎం ఉంది. అమెరికా నుంచి అణు యుద్ధ ముప్పునకు ఇది ముగింపు పలుకుతుంది’ అని తెలిపింది. ఉ.కొరియా క్షిపణి ఒకటి 2,802 కి.మీ ఎత్తుకు వెళ్లడం ఇదే తొలి సారి. ఉ.కొరియాలోని ఉత్తర ఫియోంగాన్ రాష్ట్రంలో ఈ పరీక్ష జరిపారని దక్షిణ కొరియా తెలిపింది. ఇది భూమిపై నుంచి ప్రయోగించిన మధ్యశ్రేణి క్షిపణి అని, అమెరికాకు దీనివల్ల ముప్పులేదని అమెరికా పసిఫిక్ కమాండ్ పేర్కొంది. ఐసీబీఎం 6,700 కి.మీ. వరకు దూసుకెళ్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉ.కొరియా ఈ ఏడాదిలో క్షిపణి పరీక్ష నిర్వహించ డం ఇది 11వసారి. అమెరికా స్వాతంత్య్రదినమైన జూలై4న ఐసీబీఎంను పరీక్షించడం గమనార్హం. -
ఖండాంతర క్షిపణి ప్రయోగం
► విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా ► అమెరికా సహా పలు దేశాలపై దాడి చేసే సామర్థ్యం సియోల్: ప్రపంచ దేశాల హెచ్చరికలను, ఆంక్షలను ఉత్తర కొరియా మరోసారి బేఖాతరు చేసింది. అమెరికాతో పలు దేశాలపై దాడి చేసే సామర్థ్యమున్న తన తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని మంగళవారం విజయవంతంగా పరీక్షించామని ప్రకటించింది. వాసోంగ్–14 క్షిపణి పరీక్షను దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారని ఉ.కొరియా టీవీ చానల్ పేర్కొంది. ‘కిమ్ ఈ పరీక్షకు ఆదేశించారు. క్షిపణి 2,802 కి.మీ.ఎత్తుకు చేరుకుని 933 కి.మీ ప్రయాణించింది. 39 నిమిషాల పయనం తర్వాత జపాన్ సముద్రంలో పడిపోయింది. పూర్తి స్థాయి అణుశక్తి దేశమైన ఉ.కొరియా వద్ద ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగల అత్యంత శక్తిమంతమైన ఐసీబీఎం ఉంది. అమెరికా నుంచి అణు యుద్ధ ముప్పునకు ఇది ముగింపు పలుకుతుంది’ అని తెలిపింది. ఉ.కొరియా క్షిపణి ఒకటి 2,802 కి.మీ ఎత్తుకు వెళ్లడం ఇదే తొలి సారి. ఉ.కొరియాలోని ఉత్తర ఫియోంగాన్ రాష్ట్రంలో ఈ పరీక్ష జరిపారని దక్షిణ కొరియా తెలిపింది. ఇది భూమిపై నుంచి ప్రయోగించిన మధ్యశ్రేణి క్షిపణి అని, అమెరికాకు దీనివల్ల ముప్పులేదని అమెరికా పసిఫిక్ కమాండ్ పేర్కొంది. ఐసీబీఎం 6,700 కి.మీ. వరకు దూసుకెళ్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉ.కొరియా ఈ ఏడాదిలో క్షిపణి పరీక్ష నిర్వహించ డం ఇది 11వసారి. అమెరికా స్వాతంత్య్రదినమైన జూలై4న ఐసీబీఎంను పరీక్షించడం గమనార్హం. ఇంకో మంచి పని లేదా?: ట్రంప్ ఉ.కొరియా క్షిపణి పరీక్షపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ‘ఇతనికి తన జీవితంలో చేయాల్సిన మంచిపనేదీ లేదా?’ అని ఉ.కొరియా నేత కిమ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఉ.కొరియాపై ఒత్తిడి తెచ్చి, ఈ పిచ్చిపనులను మానిపించాలని ఆ దేశానికి మిత్రదేశమైన చైనాకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అమెరికా సహా సంబంధిత పక్షాలన్నీ సంయమనం పాటించాలని చైనా కోరింది. -
అణుయుద్ధానికే అమెరికా తెగిస్తోంది!
ప్యాంగ్యాంగ్: అమెరికా తాజాగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (ఐసీబీఎం) మధ్యలోనే కూల్చివేసే వ్యవస్థను అమెరికా విజయవంతంగా పరీక్షించడంపై ఉత్తర కొరియా మండిపడింది. ఇది సైనికంగా తీవ్రంగా రెచ్చగొట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇది సైనికంగా తీవ్రంగా రెచ్చగొట్టే చర్య. అణుయుద్ధాన్ని తెరతీయాలన్న అమెరికా వికృత కోరికకు ఇది అద్దం పడుతోంది. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అణుయుద్ధాన్ని మొదలుపెట్టే సన్నాహాలు తుదిదశకు చేరాయన్న సంకేతాన్ని ఈ రిస్కీ చర్య ఇస్తోంది' అని కొరియా ప్రజా ఆర్మీ వ్యూహాత్మక దళ అధికార ప్రతినిధి పేర్కొన్నట్టు ఆ దేశ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) పేర్కొంది. కొరియా తన ఆత్మరక్షణకు అణ్వాయుధ బలాన్ని పెంపొందించుకోవడం సబబేనని అమెరికా తలపెడుతున్న ఇలాంటి చర్యలు రుజువుచేస్తున్నాయని పేర్కొంది. తమ అణ్వాయుధాలను ఇలాంటి ఇంటర్సెప్షన్ వ్యవస్థలు అడ్డుకుంటాయనుకుంటే అది పొరపాటేనని హెచ్చరించింది. ఒకవైపు వరుస అణ్వాయుధ పరీక్షలతో, ప్రయోగాలతో ఉత్తర కొరియా చెలరేగిపోతుండగా.. ప్రత్యర్థులు ప్రయోగించే అణ్వాయుధాలను మధ్యలోనే కూల్చివేసే వ్యవస్థను అమెరికా మంగళవారం విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. -
ఖండాంతర క్షిపణులు: అమెరికాకు కొరియా షాక్!
-
ఖండాంతర క్షిపణులు: అమెరికాకు కొరియా షాక్!
ఉత్తరకొరియా శనివారం తన ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలే పంపింది. వార్షిక సైనిక కవాతు సందర్భంగా సరికొత్త క్షిపణులు, వాటి ప్రయోగ వేదికలను ప్రదర్శిస్తూ హల్చల్ చేసింది. అంతేకాకుండా తొలిసారిగా కొరియా రెండు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ఆకృతులను కూడా ప్రదర్శనకు పెట్టడం అమెరికాకు షాక్‌కు గురిచేసింది. సబ్‌మెరైన్ వేదికగా ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణుల భూతల వెర్షన్స్‌ను సైతం అది ప్రదర్శించింది. ఈ అత్యాధునిక అణ్వాయుధ బలసంపత్తి అంతా తొలిసారిగా ప్రదర్శనకు పెట్టినదేనని అమెరికా రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరకొరియా వద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్టయితే.. అవి నేరుగా అమెరికాలో భూభాగాన్ని, యూరప్‌ను ఢీకొనే అవకాశముంది. ఇక, శనివారం ప్రదర్శనకు పెట్టిన షార్టర్ రేంజ్బాలిస్టిక్ క్షిపణులు ఆసియా ప్రాంతంలోని పలు దేశాలకు సవాల్ విసరనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తరకొరియా దుందుడుకుగా అణ్వాయుధ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఆదేశాలతో అమెరికా నేవీ బలగాలు కొరియా ద్వీపకల్పంలో లంగరువేశాయి. ఈ క్రమంలో అమెరికాకు గట్టి సందేశం ఇచ్చే లక్ష్యంతోనే ఉత్తర కొరియా తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శనకు పెట్టిందని అమెరికా రక్షణ నిపుణుడు, సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ మెలిస్సా హన్హమ్ తెలిపారు. కొరియా తాజా కవాతులో ప్రదర్శనకు పెట్టిన చాలావరకు క్షిపణులు చాలావరకు గతంలో ఎన్నడూ చూడని వార్డ్వేర్తో రూపొందినవని, సరికొత్తవని పేర్కొన్నారు. ప్రదర్శనకు ఉంచినవి క్షిపణుల ఆకృతులు మాత్రమేనా? లేక అందులో నిజంగా క్షిపణులు ఉన్నాయా? అన్నది తెలియదని, కానీ, వాటిని గతంలో ఎన్నడూ చూడలేదని హన్హమ్ చెప్పారు. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ టు సంగ్ 105వ జన్మదినం(డే ఆఫ్‌ది సన్) సందర్భంగా పెద్ద మొత్తంలో అణ్వాయుధాలతో, క్షిపణులతో, సైనిక బలగాలతో పెద్ద మొత్తంలో శనివారం పరేడ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.