
సియోల్: మొట్టమొదటిసారిగా ఘన ఇంధనాన్ని వినియోగించి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తరకొరియా శుక్రవారం ప్రకటించింది. వేగంగా ప్రయాణించే కొత్త రకం క్షిపణిని ఆ దేశం గురువారం ప్రయోగించినట్లు దక్షిణకొరియా, జపా¯Œ పేర్కొనడం తెలిసిందే. రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని అటవీ ప్రాంతంలోని వేదికపై నుంచి చేపట్టిన ఈ ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్, ఆయన భార్య, కుమార్తె, సోదరి తిలకించినట్లు అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది.
ఈ క్షిపణి మూడు దశలుగా ప్రయాణించి, లక్ష్యాన్ని ఛేదించినట్లు వివరించింది. ఇప్పటి వరకు ద్రవ ఇంధనంతో పనిచేసే క్షిపణులను పరీక్షించిన ఉత్తరకొరియా తాజాగా ఘన ఇంధనం వాడినట్లు ప్రకటించడం ముందడుగేనని నిపుణులంటున్నారు. అమెరికాను నేరుగా భయపెట్టే అణ్వాయుధాలను సమకూర్చుకోవాలనే లక్ష్యంలో ఇది పురోగతిగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ తాజా క్షిపణి సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అది ప్రయాణించిన దూరం, ఎత్తు, తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని ఎలా ఛేదించింది, వార్ హెడ్ అమరిక వంటి వివరాలను వెల్లడించకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment