అమెరికాపై కిమ్ తీవ్ర అసభ్య పదజాలం..!
అగ్రరాజ్యంపై కిమ్ జాంగ్ ఉన్ తిట్లు..!
సియోల్: ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఉత్తర కొరియా అమెరికాకు పుండుమీద కారం చల్లేరీతిలో వ్యాఖ్యలు చేసింది. ఈ బాలిస్టిక్ క్షిపణి విజయం.. అమెరికా బాస్టర్డ్స్‌కు వారి స్వాతంత్ర్య దినోత్సవ కానుక అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పేర్కొన్నట్టు ఆ దేశ మీడియా తెలిపింది. 'జులై 4 వార్షికోత్సవం సందర్భంగా పంపిన ఈ కానుకను చూసి అమెరికా బాస్టర్డ్స్ అంతగా సంతోషించరు' అని కిమ్ అన్నట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. 'వారి విసుగును దూరం చేసేందుకు అప్పుడప్పుడు ఇలాంటి కానుకలను మనం పంపిస్తూ ఉండాలి' అని కిమ్ వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు పేర్కొంది.
ప్రపంచ దేశాల హెచ్చరికలను, ఆంక్షలను బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా మంగళవారం ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అమెరికాతో పలు దేశాలపై దాడి చేసే సామర్థ్యమున్న ఈ క్షిపణి (వాసోంగ్-14) పరీక్షను దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారని ఉ.కొరియా టీవీ చానల్ పేర్కొంది. ‘కిమ్ ఈ పరీక్షకు ఆదేశించారు. క్షిపణి 2,802 కి.మీ.ఎత్తుకు చేరుకుని 933 కి.మీ ప్రయాణించింది. 39 నిమిషాల పయనం తర్వాత జపాన్ సముద్రంలో పడిపోయింది.
పూర్తి స్థాయి అణుశక్తి దేశమైన ఉ.కొరియా వద్ద ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగల అత్యంత శక్తిమంతమైన ఐసీబీఎం ఉంది. అమెరికా నుంచి అణు యుద్ధ ముప్పునకు ఇది ముగింపు పలుకుతుంది’ అని తెలిపింది. ఉ.కొరియా క్షిపణి ఒకటి 2,802 కి.మీ ఎత్తుకు వెళ్లడం ఇదే తొలి సారి. ఉ.కొరియాలోని ఉత్తర ఫియోంగాన్ రాష్ట్రంలో ఈ పరీక్ష జరిపారని దక్షిణ కొరియా తెలిపింది. ఇది భూమిపై నుంచి ప్రయోగించిన మధ్యశ్రేణి క్షిపణి అని, అమెరికాకు దీనివల్ల ముప్పులేదని అమెరికా పసిఫిక్ కమాండ్ పేర్కొంది. ఐసీబీఎం 6,700 కి.మీ. వరకు దూసుకెళ్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉ.కొరియా ఈ ఏడాదిలో క్షిపణి పరీక్ష నిర్వహించ డం ఇది 11వసారి. అమెరికా స్వాతంత్య్రదినమైన జూలై4న ఐసీబీఎంను పరీక్షించడం గమనార్హం.