సియోల్: అణు పాటవాన్ని మరింతగా పెంచుకుంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. కొరియా ద్వీపకల్పంలో నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ అత్యున్నత సైనికాధికారులతో ఆయన సమావేశమయ్యారు. అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు దీటుగా రక్షణ సామర్థ్యాన్ని, యుద్ధ సన్నద్ధతను పెంచుకోవడంపై భేటీలో లోతుగా చర్చ జరిగినట్టు అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) తెలిపింది. అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచాలని ఈ సందర్భంగా అధికారులను కిమ్ ఆదేశించారు.
దక్షిణ కొరియాతో మిలిటరీ హాట్‌లైన్ చర్చలకు కూడా ఐదు రోజులుగా ఉత్తర కొరియా ముందుకు రాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బహుశా ప్రస్తుత ఉద్రిక్తతలను బూచిగా చూపుతూ దూకుడు చర్యలకు దిగేందుకు ఉత్తర కొరియా యోచిస్తుండవచ్చని దక్షిణ కొరియా అనుమానిస్తోంది. 2023లో ఉత్తర కొరియా ఇప్పటికే 30కి పైగా క్షిపణి పరీక్షలు నిర్వహించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. 2022లో కూడా రికార్డు స్థాయిలో 70కి పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. తమను అణ్వాయుధ దేశంగా అంగీకరించేలా, ఆర్థిక ఆంక్షలను సడలించేలా అమెరికాపై ఒత్తిడి పెంచడమే వీటి ఉద్దేశమని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య అణు చర్చల్లో 2019 నుంచీ ప్రతిష్టంభన నెలకొంది. ఉత్తర కొరియా 2017లో తొలిసారి అణుపరీక్షలు నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment